Published : 11/06/2022 16:32 IST

Radhika Apte: అప్పుడు బ్రెస్ట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ సర్జరీ చేయించుకోమన్నారు!

(Photos: Instagram)

రంగుల ప్రపంచం సినిమా రంగంలో అమ్మాయిల అందం విషయంలో ఎన్ని పరిమితులుంటాయో మనకు తెలిసిందే! అయితే వాటికి లోబడి కొందరు ఆయా కాస్మెటిక్‌ సర్జరీలు చేయించుకొని తమ రూపాన్ని మార్చుకుంటే.. మరికొంతమంది వాటిని పట్టించుకోకుండా.. ఎలా ఉన్నా తమ శరీరాన్ని తాము అంగీకరిస్తారు. బాలీవుడ్‌ బోల్డ్‌ బ్యూటీ రాధికా ఆప్టే రెండో కోవకు చెందుతుంది. మహిళలకు సంబంధించిన అంశాలపై కుండ బద్దలుకొట్టినట్లుగా మాట్లాడే ఈ ముద్దుగుమ్మ.. తన వ్యక్తిగత విషయాల్నీ అంతే నిర్మొహమాటంగా చెబుతుంటుంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకునే క్రమంలో తానెదుర్కొన్న పలు అనుభవాల గురించి అప్పుడప్పుడూ పంచుకుంటుంటుందీ చక్కనమ్మ. ఈ నేపథ్యంలోనే తాను సినిమాల్లోకొచ్చిన తొలి నాళ్లలో తన శరీరాకృతి విషయంలో పలువురు చేసిన సూచనల గురించి ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది రాధిక.

బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌.. ఈ పదాలు రాధికా ఆప్టేకు అచ్చు గుద్దినట్లు సరిపోతాయి. సినిమాల్లో ఎంత విలక్షణమైన పాత్రల్ని ఎంచుకుంటుందో.. తన మాటతీరు, మనసులోని భావాల్ని పంచుకోవడంలోనూ అంతే పారదర్శకంగా వ్యవహరిస్తుంటుందీ బాలీవుడ్‌ అందం. తన 17 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాల్ని చవి చూసిన ఈ చిన్నది.. తన శరీరాకృతి కొలతల విషయంలో మొదట్లో ఎదుర్కొన్న పలు చేదు అనుభవాల గురించి ఇలా చెప్పుకొచ్చింది.

ఈ మార్పులన్నీ తప్పదన్నారు!

‘అసలే సినిమా ఇండస్ట్రీకి నేను కొత్త. అయితే హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే నా శరీరాకృతి, అందం విషయంలో పలు మార్పులు చేసుకోవాలని కొందరు నాకు సూచించారు. ఈ క్రమంలో కొందరేమో ముక్కు సరిచేసుకోవడానికి ఆపరేషన్ అవసరమన్నారు. మరికొంతమంది బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ చేయించుకుంటే మంచిదన్నారు. ఆపైనా ఇలాంటి సూచనలు కొనసాగాయి. కాళ్లలో ఏదో లోపం ఉందని, దవడ-బుగ్గల్లో మార్పులు చేసుకోవాలని, రెట్టింపు అందం కోసం బొటాక్స్ ట్రీట్‌మెంట్ తీసుకోమని.. ఇలా ఎవరికి తోచినట్లుగా వాళ్లు సూచించారు. దీంతో మొదట్లో కాస్త టెన్షన్‌ పడ్డా. కానీ ఆ తర్వాత రియలైజై.. ఇవేవీ అవసరం లేదని నాకు నేను సర్దిచెప్పుకున్నా. నిజానికి నా జుట్టుకు రంగు వేసుకోవడానికే నాకు 30 ఏళ్లు పట్టింది. కనీసం ఏదైనా అనారోగ్యం ఎదురైనా ఇంజక్షన్‌ ఎరుగను. అలాంటిది అవసరం ఉన్నా, లేకపోయినా ఈ సూచనలన్నీ చేసేసరికి చాలా కోపం వచ్చింది.

అప్పుడే మార్పు సాధ్యం!

మామూలుగానే ఎలా ఉన్నా నన్ను నేను అంగీకరించుకునే వ్యక్తిని నేను. ఇక సినిమా ఇండస్ట్రీ కోసం ఈ మార్పులన్నీ చేసుకోమని చెప్పడంతో ఆ స్వీయ ప్రేమ రెట్టింపైంది.. అయినా వయసు పెరగడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. దాన్ని ఏ చికిత్సా ఆపలేదు. ఒకవేళ బలవంతంగా ఇలాంటి అసాధారణ చికిత్సలు చేయించుకుంటే నష్టపోయేది మనమే! ఇలా గతంలోనే కాదు.. ఇలాంటి అనుభవం ఇటీవల కూడా మరోసారి ఎదురైంది. ఛాతీ, పెదాల అందాన్ని ప్రామాణికంగా తీసుకొని మొన్నామధ్య ఓ ప్రాజెక్ట్‌ నుంచి నన్ను తొలగించారు. నేను గౌరవించే వ్యక్తులు చేసిన మంచి సినిమా అది. అయితే కొంతమంది పైకి కనపడరు కానీ.. వాళ్ల మనస్తత్వాలూ ఇలాగే ఉంటాయి. ప్రతిభను పక్కన పెట్టి ఇలాంటి అనవసర విషయాలపై దృష్టి సారిస్తుంటారు. ఇలాంటి ఆలోచనల్లో మార్పు రావాలంటే.. ఈ రంగంలోనూ కీలక స్థానాల్లో మహిళలుండాలి. అప్పుడే ప్రతిభకు చోటుంటుంది.. స్త్రీ సాధికారత సాధ్యమవుతుంది..’ అందీ బాలీవుడ్‌ బ్యూటీ.

ప్రస్తుతం రాధిక నటించిన ‘ఫోరెన్సిక్‌’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కనిపించనుందీ బోల్డ్‌ బ్యూటీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని