ఎముక వ్యాధి.. అయినా తన బొమ్మలకు అంతర్జాతీయ క్రేజ్ !
నడవాలంటే భయం.. ఏ అవయవానికి సంబంధించిన ఎముకలు విరుగుతాయోనని! అలాగని ఎక్కువసేపు కూర్చున్నా వెన్నెముక, నడుముపై ఒత్తిడి పడి విపరీతమైన నొప్పి వేధించేది. ఇదీ పుట్టుకతోనే అరుదైన ఎముక వ్యాధితో జన్మించిన రాధిక ఆరోగ్య స్థితి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకోలేక ఒకానొక దశలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన ఆమె.. ఇప్పుడు వ్యాపారవేత్తగా రాణిస్తోంది....
(Photos : Instagram)
నడవాలంటే భయం.. ఏ అవయవానికి సంబంధించిన ఎముకలు విరుగుతాయోనని! అలాగని ఎక్కువసేపు కూర్చున్నా వెన్నెముక, నడుముపై ఒత్తిడి పడి విపరీతమైన నొప్పి వేధించేది. ఇదీ పుట్టుకతోనే అరుదైన ఎముక వ్యాధితో జన్మించిన రాధిక ఆరోగ్య స్థితి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకోలేక ఒకానొక దశలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన ఆమె.. ఇప్పుడు వ్యాపారవేత్తగా రాణిస్తోంది. తనలోని క్రాఫ్టింగ్ నైపుణ్యాలకు మెరుగులద్ది తాను తయారుచేస్తోన్న బొమ్మలకు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్నారు. అరుదైన ఆరోగ్య సమస్య ఉన్నా.. ఎవరిపై ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడి ఎంతోమందికి స్ఫూర్తినిస్తోన్న రాధిక కథ మీరూ చదివేయండి!
రాధికది కోయంబత్తూరు శివారులోని భారతీపురం అనే చిన్న గ్రామం. పుట్టుకతోనే అరుదైన ఎముక వ్యాధి (Brittle Bone Disease)తో జన్మించిన ఆమె.. ఆరేళ్ల వయసులో ఆడుకుంటూ కింద పడిపోయింది. దాంతో ఎముక ఫ్రాక్చర్ కావడంతో ఆమెకు సర్జరీ చేశారు వైద్యులు. అలా 11 ఏళ్లొచ్చే వరకు ఆమెకు పది సర్జరీలయ్యాయి. దీంతో నాలుగో తరగతిలోనే స్కూల్ మానేయాల్సి వచ్చిందామె.
బడికెళ్లలేక..!
ఓవైపు తన తోటి వాళ్లంతా చదువు, ఆటల్లో ముందుకు సాగుతుంటే.. తన ఆరోగ్య సమస్యతో తను మాత్రం ఇంటికే పరిమితమయ్యానని, ఇది తనను ఆందోళనకు గురి చేసేదంటోంది రాధిక.
‘నాకున్న అరుదైన ఎముక వ్యాధితో.. ఇంట్లో నడవాలన్నా, బయటికి వెళ్లాలన్నా.. ఇలా ప్రతి విషయంలోనూ ఇతరులపై ఆధారపడాల్సి వచ్చేది. ఇది నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేసేది. మరోవైపు చదువులో నా తోటి వాళ్లంతా ముందుకెళ్తుంటే.. నేను మాత్రం ఇంటికే పరిమితమయ్యా. నడిస్తే ఎముకలు ఎక్కడ విరుగుతాయోనన్న భయంతో గంటల కొద్దీ కూర్చొనే ఉండేదాన్ని. దాంతో నడుం, వెన్నెముకలో నొప్పి వేధించేది. ఈ ప్రతికూలతలన్నీ నన్ను డిప్రెషన్‌లోకి నెట్టేశాయి. ఆ సమయంలో ఒంటరిగా గడిపేదాన్ని. ఎవరైనా మాట్లాడిస్తే వాళ్లపై అరిచేదాన్ని. ఇలాంటి స్థితిలో ఉన్న నేను మా కుటుంబ సభ్యుల అండతో నెమ్మదిగా బయటపడ్డా. అదే సమయంలో అమ్మానాన్నలు నాకు ఇంట్లోనే ట్యూషన్ పెట్టించారు. అలా ఓవైపు చదువుకుంటూనే.. మరోవైపు నాకిష్టమైన క్రాఫ్టింగ్‌పై దృష్టి పెట్టా. పాత పెళ్లికార్డులు, ఆహ్వాన పత్రికలతో.. గ్రీటింగ్ కార్డులు తయారుచేసేదాన్ని. క్రమంగా యూట్యూబ్ వీడియోలు చూస్తూ.. స్కెచెస్ వేయడం, డ్రాయింగ్ గీయడం.. వంటి నైపుణ్యాలు నేర్చుకున్నా..’ అని చెబుతోంది రాధిక.
దశ తిప్పిన బుక్ ఫెయిర్!
ఆహ్వాన పత్రికలతో గ్రీటింగ్ కార్డులు, పాత న్యూస్ పేపర్లతో వాల్ హ్యాంగింగ్స్ వంటి ఇంటి అలంకరణ వస్తువులు తయారుచేస్తూ.. వాటితోనే తన ఇంటిని అందంగా అలంకరించేది రాధిక. ఇవి చూసి తన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, బంధువులు.. ఆమె పనితనాన్ని ప్రశంసించేవారు. ఇది తనకు ఎంతో ప్రోత్సాహకరంగా అనిపించేదంటోందీ క్రాఫ్టింగ్ క్వీన్.
‘మా ఇంట్లో అమర్చిన వాల్ హ్యాంగింగ్స్, ఇతర అలంకరణ వస్తువులు నేనే తయారుచేశానంటే ముందు ఎవరూ నమ్మలేదు.. కానీ ఆ తర్వాత మాకూ కావాలంటూ అడిగి మరీ నాతో తయారుచేయించుకునే వారు. అలా మా పక్కింట్లో ఉండే ఆంటీకి రూ. 750తో వాల్ హ్యాంగింగ్ తయారుచేసిచ్చా. ఆ తర్వాత న్యూస్ పేపర్లతో వివిధ రకాల బొమ్మలూ తయారుచేయడం నేర్చుకున్నా. అలా విభిన్న కాస్ట్యూమ్స్‌తో నేను తయారుచేసిన కొన్ని బొమ్మల్ని నా సోదరుడి సహకారంతో కోయంబత్తూరులో నిర్వహించిన ఓ బుక్ ఫెయిర్‌లో ప్రదర్శించా. అసలు ఒక్కటీ అమ్ముడుపోదేమో అనుకున్నా.. కానీ మూడు రోజుల్లోనే అన్నీ అమ్ముడుపోవడంతో నమ్మలేకపోయా. దాంతో నాలోని ప్రతిభ, సృజనాత్మకతపై మరింత నమ్మకం పెరిగింది. నిజానికి ఈ బుక్ ఫెయిర్ తర్వాతే బొమ్మల తయారీని పూర్తి స్థాయి వ్యాపారంగా మలచుకున్నా..’ అంటోన్న రాధిక.. తాను తయారుచేసే బొమ్మల్ని ‘QueenBee Dolls’ పేరుతో విక్రయిస్తోంది.
దేశవిదేశాల్లోనూ పాపులారిటీ!
న్యూస్ పేపర్, గ్లూ, రంగురంగుల పెయింట్స్ ఉపయోగించి తాను తయారుచేసే బొమ్మలకు ఆఖర్లో వార్నిష్ కోటింగ్ ఇచ్చి.. వాటర్‌ప్రూఫ్‌గా మలుస్తోంది రాధిక. ఇక ఈ బొమ్మలు వంగిపోకుండా, గట్టిగా ఉండడానికి వాటి తయారీలో మెటాలిక్ వైర్లను వాడుతోంది. ఇలా కుటుంబం, పెళ్లి, దేవతామూర్తులు, సంప్రదాయ నృత్యశైలులు.. వంటి విభిన్న థీమ్స్‌తో బొమ్మలు తయారుచేస్తోందామె.
‘ప్రస్తుతం నేను తయారుచేసే బొమ్మల్లో ఫ్యామిలీ డాల్స్, మ్యుజీషియన్ డాల్స్, ఆఫ్రికన్ డాల్స్‌ను ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాదు.. అమెరికా, శ్రీలంక, కెనడా.. వంటి దేశాల నుంచీ ఆర్డర్లొస్తున్నాయి. ఆయా దేశాల స్కిన్ టోన్, వేషభాషల్ని బట్టి బొమ్మలకూ హంగులద్దుతున్నా. అలాగే చాలామంది గిఫ్టింగ్ కోసం కస్టమైజ్ డాల్స్ కావాలంటూ అడుగుతున్నారు. వారి అవసరాల్ని బట్టి యాక్సెసరీస్, దుస్తులు, రంగుల్లో మార్పులు చేస్తూ బొమ్మలు తయారుచేస్తున్నా..’ అంటోన్న రాధిక.. ఇప్పటివరకు 3 వేలకు పైగా వివిధ రకాల బొమ్మలు తయారుచేసి విక్రయించింది.
వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ..!
ఓవైపు ఎముకల వ్యాధితో బాధపడుతున్నా.. మరోవైపు తన బొమ్మల వ్యాపారంతో ఎవరిపైనా ఆధారపడకుండా తన కాళ్ల పైన తను జీవిస్తోంది. భవిష్యత్తులో గిఫ్ట్ స్టోర్లకు, ఇంటీరియర్ డిజైనర్లకు అమ్మేలా తన బొమ్మల వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు చెబుతోందీ డాల్ మేకర్. ఇక తన ప్రతిభకు గుర్తింపుగా పలు అవార్డులు-రివార్డులూ అందుకుంది రాధిక. ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తిచేసిన ఆమె.. ‘ఆర్ట్ అండ్ క్రాఫ్ట్’ విభాగంలో డిగ్రీ పూర్తి చేస్తానంటోంది. మరోవైపు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ వేదికగా వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ.. ఔత్సాహికులకు బొమ్మల తయారీలో శిక్షణ ఇస్తోంది. అంతేకాదు.. స్కూళ్లు, కాలేజీల్లో స్ఫూర్తిదాయక ప్రసంగాలూ చేస్తోంది రాధిక.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.