అప్పుడు ఈషా, శ్లోక.. ఇప్పుడు రాధిక.. ఏంటీ ‘పూల దుపట్టా’ సంప్రదాయం?!

అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ పెళ్లి వేడుకల్ని ‘నభూతో..’ అనేలా నిర్వహిస్తోంది అంబానీ కుటుంబం. ఇక ప్రతి వేడుకలో కాబోయే వధువు రాధిక ధరించే అవుట్‌ఫిట్స్‌ అందరినీ కట్టిపడేస్తున్నాయి. ఫ్యాషన్‌ ప్రియుల ఊహకు సైతం అంతు చిక్కకుండా ఆమె ఎంచుకునే దుస్తులు తన పెళ్లి కళను మరింతగా పెంచుతున్నాయనడంలో సందేహం లేదు.

Published : 11 Jul 2024 13:01 IST

(Photos: Instagram)

అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ పెళ్లి వేడుకల్ని ‘నభూతో..’ అనేలా నిర్వహిస్తోంది అంబానీ కుటుంబం. ఇక ప్రతి వేడుకలో కాబోయే వధువు రాధిక ధరించే అవుట్‌ఫిట్స్‌ అందరినీ కట్టిపడేస్తున్నాయి. ఫ్యాషన్‌ ప్రియుల ఊహకు సైతం అంతు చిక్కకుండా ఆమె ఎంచుకునే దుస్తులు తన పెళ్లి కళను మరింతగా పెంచుతున్నాయనడంలో సందేహం లేదు. ఈ ఫ్యాషన్‌ సిరీస్‌లో భాగంగా అలాంటి ఓ అద్భుతమైన అవుట్‌ఫిట్‌ను తన హల్దీ  వేడుక కోసం ఎంచుకుంది రాధిక. ఈ క్రమంలో అంబానీ ఇంటి సంప్రదాయాన్ని ఫాలో అవడమే కాదు.. ‘అంబానీకి తగ్గ కోడల’ని అందరిచేతా మరోసారి అనిపించుకుందీ కాబోయే కొత్త పెళ్లికూతురు.

నిశ్చితార్థం మొదలు హల్దీ దాకా.. అంబానీ ఇంట జరుగుతోన్న ప్రతి ప్రి-వెడ్డింగ్‌ వేడుకా హైలైట్‌గా నిలుస్తోంది. ఇక ఇందులో భాగంగా వధువు రాధిక ఆయా వేడుకల కోసం ఎంచుకునే అవుట్‌ఫిట్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వేడుక థీమ్‌కి తగినట్లుగా ఆమె ధరించే దుస్తులు ఫ్యాషన్‌పై తనకున్న మక్కువను తెలియజేస్తున్నాయి. మొన్నటికి మొన్న మమేరు వేడుక కోసం గుజరాతీ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా బాంధనీ ప్రింటెడ్‌ భారీ ఎంబ్రాయిడరీ లెహెంగాను ధరించిన రాధిక.. సంగీత్‌ కోసం కాస్త మోడ్రన్‌గా ఉండే లెహెంగా, శారీ లుక్స్‌లో స్టైలిష్‌గా మెరిసిపోయింది. ఇక ఇటీవలే జరిగిన హల్దీ వేడుకతో తన ఫ్యాషన్‌ సెన్స్‌ను మరోసారి బయటపెట్టిందీ అంబానీ బహూ.

అప్పుడు ఈషా, శ్లోక.. ఇప్పుడు రాధిక!

సాధారణంగా హల్దీ వేడుక కోసం పసుపు రంగులో ఉండే దుస్తుల్ని ఎంచుకుంటాం. రాధిక కూడా ఈ రంగు అవుట్‌ఫిట్స్‌నే ఎంచుకుంది.. అయితే అందులోనే కాస్త వైవిధ్యాన్ని ప్రదర్శించిందామె. పసుపు రంగు ఫ్లోరల్‌ మోటిఫ్స్‌తో రూపొందించిన లెహెంగాపై మ్యాచింగ్‌ బ్లౌజును జత చేసిన ఆమె.. పూలతో రూపొందించిన దుపట్టాను ధరించి మెరిసిపోయింది. ఈ పూల దుపట్టా రాధిక లుక్‌ని మరింత ప్రత్యేకంగా మార్చిందని చెప్పచ్చు. దాదాపు వెయ్యికి పైగా తెలుపు రంగు తగర్‌ పూలతో ఈ దుపట్టాను ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. దీనికి బోర్డర్‌గా 90 బంతిపూలను వాడారు. ఇలా తన అవుట్‌ఫిట్‌కు జతగా తగర్‌ పూలతో రూపొందించిన ఫ్లోరల్‌ ఆభరణాలతో తన లుక్‌ని పూర్తిచేసిందీ అంబానీ బ్యూటీ. నిజానికి పెళ్లి వేడుకల్లో ఈ తరహా పూల దుపట్టాను భాగం చేయడం అంబానీ ఇంటి సంప్రదాయమట!

గతంలో ఈషా అంబానీ, శ్లోకా మెహతాలూ తమ వివాహ వేడుకల్లో ఈ తరహా దుపట్టాలు ధరించారు. ఆ సమయంలో బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా.. ఈషా, శ్లోకలు పూల దుపట్టా ధరించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో పంచుకోగా, అవి వైరల్‌గా మారాయి. ఇక ఇప్పుడు ఇదే సంప్రదాయాన్ని రాధిక కూడా అనుసరించి అంబానీ వారి కోడలనిపించుకుంది. ప్రముఖ డిజైనర్‌ అనామికా ఖన్నా రూపొందించిన ఈ హల్దీ అవుట్‌ఫిట్‌లో రాధికను ట్రెడిషనల్‌ బ్రైడ్‌గా ముస్తాబు చేసింది రియా కపూర్‌ (సోనమ్‌ కపూర్‌ చెల్లెలు).


తమిళమ్మాయిగా.. ఈషా!

అంబానీ ఇంట పెళ్లి వేడుకల్ని ఫ్యాషన్‌ పరేడ్‌గానూ అభివర్ణిస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో నీతా మొదలు.. ఈషా, శ్లోక, రాధిక ధరించే దుస్తులు ఇటు ట్రెడిషనల్‌ టచ్‌ ఇస్తూనే.. అటు ఆయా వేడుకల థీమ్‌నూ చాటుతున్నాయి. అలా ఇటీవలే ఓ వేడుకలో భాగంగా ఈషా అంబానీ ధరించిన అవుట్‌ఫిట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు కారణం.. ఆమె తమిళమ్మాయిలా ముస్తాబవడమే! పింక్‌ ఎంబ్రాయిడరీ బోర్డర్‌తో రూపొందించిన టీల్‌ రా సిల్క్‌ లెహెంగా ధరించిన ఆమె.. గోల్డెన్‌ బ్లౌజ్‌ను తన అటైర్‌కు జత చేసింది. దీనికి మ్యాచింగ్‌గా తాను వేసుకున్న హెయిర్‌స్టైల్‌ ఆమె లుక్‌నే హైలైట్‌ చేసిందని చెప్పచ్చు. ఈ క్రమంలో పొడవాటి జడ వేసుకున్న ఈషా.. దాన్ని జడ బిళ్లలతో కూడిన లాంగ్‌ హెయిర్‌బ్రూచ్‌తో అలంకరించుకుంది. ఇక తన తల్లి నీతా గతంలో ఓ సందర్భంలో ధరించిన భారీ పచ్చల హారాన్ని మెడలో వేసుకున్న ఈషా.. నడుముకి వడ్డాణం, చేతి నిండా గాజులు, చెవులకు జుంకాలు.. ఇలా భారతీయత ఉట్టిపడే పదహారణాల పడచుపిల్లలా మెరిసిపోయింది. ప్రస్తుతం ఈషా ఫొటోలూ నెట్టింట్లో ట్రెండ్‌ అవుతున్నాయి. ‘అంబానీ ఆడపడుచా.. మజాకానా..!’ అంటూ నెటిజన్లు ఈ అంబానీ ప్రిన్సెస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇలా ప్రి-వెడ్డింగ్‌ వేడుకల్లోనే తమ ఫ్యాషనబుల్‌ లుక్స్‌తో అందరినీ మాయ చేస్తోన్న ఈ అంబానీ బ్యూటీస్.. ఇక పెళ్లిలో ఎలాంటి దుస్తుల్లో మెరవనున్నారో? వధువు రాధిక పెళ్లి కూతురిగా ఎలా మెరిసిపోతుందో అన్న కుతూహలం చాలామందిలో నెలకొంది. ఇవన్నీ తెలియాలంటే.. మరో రెండు రోజులు ఆగాల్సిందే!
Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్