కట్నాన్ని విరాళంగా ఇచ్చింది!

తన పెళ్లి ఆడంబరంగా జరగాలని ప్రతి అమ్మాయీ కోరుకుంటుంది. ఈ క్రమంలో ధరించే దుస్తులు, వేసుకునే నగలపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది. ఇక పుట్టింటి వారు కూడా తమ అమ్మాయిని కట్నకానుకలతో అత్తారింటికి సాగనంపడం ఆనవాయితీ! రాజస్థాన్‌కు చెందిన కిశోర్‌ సింగ్‌ కనోడ్‌ కూడా తన కూతురు అంజలిని భారీ కట్న కానుకలతో ఘనంగా అత్తారింటికి సాగనంపాలనుకున్నాడు.

Published : 26 Nov 2021 17:07 IST

(Photo: Facebook)

తన పెళ్లి ఆడంబరంగా జరగాలని ప్రతి అమ్మాయీ కోరుకుంటుంది. ఈ క్రమంలో ధరించే దుస్తులు, వేసుకునే నగలపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది. ఇక పుట్టింటి వారు కూడా తమ అమ్మాయిని కట్నకానుకలతో అత్తారింటికి సాగనంపడం ఆనవాయితీ! రాజస్థాన్‌కు చెందిన కిశోర్‌ సింగ్‌ కనోడ్‌ కూడా తన కూతురు అంజలిని భారీ కట్న కానుకలతో ఘనంగా అత్తారింటికి సాగనంపాలనుకున్నాడు. కానీ అంజలికి తన తండ్రి నిర్ణయం సంతృప్తినివ్వలేదు. ఈ డబ్బును కట్నంగా ఇవ్వడం కంటే.. ఏదైనా సమాజ సేవకు వినియోగిస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుందనుకుందామె. ఇదే ఆలోచనను ఆమె తన తల్లిదండ్రులతో పంచుకోగా.. అందుకు వారు సంతోషంగా ఒప్పుకున్నారు. దాంతో తన కట్నం కోసం దాచిన లక్షలాది రూపాయల్ని ఓ స్థానిక సంస్థకు విరాళంగా అందించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిందామె. ఇలా అంజలి చేసిన పనికి ప్రస్తుతం దేశమంతా జేజేలు కొడుతోంది.

కిశోర్‌ సింగ్‌ కనోడ్‌ రాజస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త. ఆయనకు అంజలీ కన్వర్‌ అనే కూతురు ఉంది. అందరు తండ్రుల్లాగే తానూ తన కూతురికి జామ్‌ జామ్‌గా వివాహం చేసి.. లక్షలాది రూపాయల కట్న కానుకలతో ఆమెను అత్తారింటికి సాగనంపాలనుకున్నాడు. ఈ క్రమంలోనూ సుమారు రూ. 75 లక్షల మొత్తాన్ని పోగు చేశాడు. అంజలికి మంచి సంబంధం రావడంతో ఇటీవలే ఆమె పెళ్లి జరిపించాడు.

బాలికా విద్య కోసం..!

అయితే అంజలికి చిన్నతనం నుంచే సామాజిక స్పృహ ఎక్కువ. ఈ క్రమంలోనే తన పెళ్లి కోసం నాన్న లక్షలాది రూపాయలు పొదుపు చేశాడని తెలుసుకున్న ఆమె.. ఆ డబ్బును కట్నంగా ఇవ్వడం కంటే ఏదైనా సమాజ సేవకు వినియోగిస్తే బాగుంటుందనుకుంది. ఇదే విషయాన్ని తన తండ్రి దగ్గరికి వెళ్లి చెప్పింది. స్థానికంగా ఓ స్వచ్ఛంద సంస్థ నిర్మిస్తోన్న బాలికల వసతి గృహం కోసం ఈ సొమ్మును విరాళంగా అందించాలని కోరింది. తన కూతురి మంచి మనసుకు ఉప్పొంగిపోయిన కిశోర్‌.. అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. ఈ క్రమంలోనే తన ఉద్దేశాన్ని వివరిస్తూ రాసిన లేఖను వివాహ వేడుక ముగియగానే ఆ మండపంలోనే సంస్థ నిర్వాహకులకు అందించింది అంజలి. ఆ వెంటనే రూ. 75 లక్షల చెక్కును కూడా వారికి అందజేసింది. ఇలా బాలికా విద్యను ప్రోత్సహిస్తూ వధువు తీసుకున్న ఈ నిర్ణయానికి ఆమె అత్తింటి వారు కూడా పొంగిపోయారు. ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. మరోవైపు ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఎంతోమంది ఆమె మంచి మనసును, సేవా దృక్పథాన్ని అభినందిస్తున్నారు. ఎవరైనా సరే.. కట్నం ఇచ్చిపుచ్చుకునే బదులు ఇలాంటి మంచి పనుల కోసం ఆ డబ్బును వినియోగిస్తే సమాజానికి ఎంతో కొంత మంచి చేసిన వారవుతారంటూ తమ స్పందనను తెలియజేస్తున్నారు.

కేవలం ఇప్పుడనే కాదు.. గతంలోనూ కిశోర్‌ ఇదే స్వచ్ఛంద సంస్థకు కోటి రూపాయలు విరాళంగా అందించాడు. ఇక ఇప్పుడు దీని నిర్మాణం కోసం మరో 50-75 లక్షల సొమ్ము అవసరమవడంతో.. దాన్ని అంజలి విరాళంగా అందించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్