Breaking Steriotypes : షేర్వాణీ ధరించి.. గుర్రమెక్కి..!

సాధారణంగా వివాహ వేడుకల్లో అబ్బాయిలు షేర్వాణీ ధరించడం, అమ్మాయిలు చక్కగా చీరలో ముస్తాబవడం ఆనవాయితీ! అలాగే కొన్ని ప్రాంతాల్లో పెళ్లికొడుకు వారి సంప్రదాయం ప్రకారం గుర్రం మీద కల్యాణ మండపానికి చేరుకుంటాడు. అయినా ఇవన్నీ అబ్బాయిలకేనా.. అమ్మాయిలు చేస్తే తప్పేంటి

Updated : 04 Dec 2021 12:19 IST

(Image for Representation)

సాధారణంగా వివాహ వేడుకల్లో అబ్బాయిలు షేర్వాణీ ధరించడం, అమ్మాయిలు చక్కగా చీరలో ముస్తాబవడం ఆనవాయితీ! అలాగే కొన్ని ప్రాంతాల్లో పెళ్లికొడుకు వారి సంప్రదాయం ప్రకారం గుర్రం మీద కల్యాణ మండపానికి చేరుకుంటాడు. అయినా ఇవన్నీ అబ్బాయిలకేనా.. అమ్మాయిలు చేస్తే తప్పేంటి? అనుకున్నట్లుంది రాజస్థాన్‌కు చెందిన వధువు క్రితిక సైని. అందుకే ఈ రెండు సంప్రదాయాలకు స్వస్తి పలుకుతూ లింగ సమానత్వానికి తెరతీసింది.

సంప్రదాయాన్ని మార్చి..!

రాజస్థాన్‌ సంప్రదాయంలో పెళ్లికి ముందు ‘బండోరి’ వేడుకను జరుపుకుంటారు. ఇందులో భాగంగా పెళ్లికొడుకు షేర్వాణీ ధరించి, తలకు పగిడి చుట్టుకుని గుర్రంపై ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకుంటాడు. అయితే సికర్‌ జిల్లా, రనోలి గ్రామానికి చెందిన క్రితిక మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించింది. తానే పెళ్లికొడుకులాగా షేర్వాణీ ధరించి, తలకు పగిడి చుట్టుకుని గుర్రంపై ఊరేగుతూ పెళ్లి మండపానికి వచ్చింది. ఇలా అప్పటిదాకా ఉన్న సంప్రదాయానికి తెరదించుతూ స్త్రీపురుష సమానత్వాన్ని చాటింది. అంతేకాదు.. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసిన కృతిక తన షేర్వాణీని తానే డిజైన్‌ చేసుకోవడం ఈ పెళ్లిలో మరో ఆకర్షణ.

కట్నం పుచ్చుకోలేదు!

ఇలా తన పెళ్లిలో లింగ సమానత్వాన్ని చాటిన తన కూతుర్ని చూసి మురిసిపోతున్నాడు క్రితిక తండ్రి. ‘నాకు నలుగురు అమ్మాయిలు.. ఇద్దరు అబ్బాయిలు. మా అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా పెంచాను. స్త్రీపురుషులిద్దరూ సమానమే అని నా కూతురు తన వివాహ వేడుక ద్వారా మంచి సందేశమిచ్చింది. నా అల్లుడు కూడా కట్నం తిరస్కరించి వరకట్న నిర్మూలన గురించి ఈ సమాజానికి చక్కటి మెసేజ్‌ ఇచ్చాడు..’ అంటున్నారాయన.

వీరు కూడా!

ఇలా పెళ్లి సంప్రదాయాల్లో మార్పులు తీసుకురావడం, తద్వారా లింగ సమానత్వం చాటడం.. ఈ కాలపు వధువుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకు కొన్ని ఉదాహరణలే ఈ సంఘటనలు..

* గతంలో నేహా ఖిచార్‌ అనే వధువు కూడా క్రితిక లాగే షేర్వాణీ ధరించి గుర్రంపై పెళ్లి మండపానికి వచ్చి వార్తల్లో నిలిచింది.

* సాధారణంగా పెళ్లిలో వరుడు వధువు మెడలో తాళికడతాడు. కానీ కర్ణాటకకు చెందిన అమిత్‌, ప్రియ దంపతులు తమ పెళ్లిలో ఒకరికొకరు మంగళసూత్రం కట్టుకొని లింగ సమానత్వాన్ని చాటారు. ముంబయికి చెందిన మరో జంట తనూజా పాటిల్‌-శార్దూల్‌ కదమ్‌ కూడా వీళ్ల బాటలోనే నడిచారు.

* ఇండియన్‌-అమెరికన్‌ ఆంత్రప్రెన్యూర్‌ సంజన రిషి కూడా తన పెళ్లి కోసం సంప్రదాయబద్ధమైన లెహెంగాకు బదులుగా మోడ్రన్‌ ప్యాంట్‌సూట్‌లో ముస్తాబైంది. ‘నాకు ప్యాంట్‌ సూట్స్‌ అంటే చాలా ఇష్టం. అందుకే పెళ్లిలోనూ నా ఇష్టానికే ప్రాధాన్యమిచ్చాను..’ అంటూ తనదైన రీతిలో సమానత్వాన్ని చాటింది.

* ఇక ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్‌ జంట పత్రలేఖ-రాజ్‌కుమార్‌ రావ్‌ కూడా తమ పెళ్లిలో లింగ సమానత్వాన్ని చాటారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరి పాపిట్లో మరొకరు సింధూరం దిద్దుకున్నారు.

* ఇలా వీటన్నింటితో పాటు తమ పెళ్లి కోసం మహిళా పూజారుల్ని ఎంచుకునే అమ్మాయిలూ పెరిగిపోతున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా వివాహమే ఇందుకు నిదర్శనం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్