Viral: ప్రాణాలకు తెగించి మరీ.. మొసలి నుంచి భర్తను కాపాడింది!

మహిళల్లో ఎంతో శక్తి దాగుంటుంది. కానీ, కొంతమంది తమని తాము తక్కువగా అంచనా వేసుకుంటారు. అయితే ఇలాంటి వారే విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు తమను తాము నిరూపించుకుంటారు. ఈ క్రమంలో వార్తల్లో నిలుస్తుంటారు. రాజస్థాన్‌కు చెందిన విమలాబాయి....

Updated : 11 Feb 2024 14:21 IST

(Photo: Screengrab)

మహిళల్లో ఎంతో శక్తి దాగుంటుంది. కానీ, కొంతమంది తమని తాము తక్కువగా అంచనా వేసుకుంటారు. అయితే ఇలాంటి వారే విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు తమను తాము నిరూపించుకుంటారు. ఈ క్రమంలో వార్తల్లో నిలుస్తుంటారు. రాజస్థాన్‌కు చెందిన విమలాబాయి కూడా ఇలానే వార్తల్లో నిలిచింది. ప్రాణాలకు తెగించి మరీ తన భర్తను మొసలి బారి నుంచి కాపాడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా...

ప్రాణాలకు తెగించి..!

రాజస్థాన్‌లోని కరౌలి ప్రాంతానికి చెందిన బన్నే సింగ్, విమలాబాయి దంపతులు. వీరిద్దరూ గొర్రెలను మేపడానికి స్థానిక చంబల్‌ నదీ తీరానికి వెళ్లారు. గొర్రెలు నీళ్లు తాగడానికి నదిలోకి వెళ్లడంతో విమలాబాయి దగ్గర్లోని చెట్టు కింద కూర్చుంది. బన్నే సింగ్ కూడా నీళ్లు తాగడానికి నదిలోకి వెళ్లాడు. అప్పటిదాకా ఎక్కడా కనిపించని మొసలి ఒక్క ఉదుటున బన్నేసింగ్‌ కాలిని పట్టుకుంది. అతను కేకలు పెడుతూ మొసలి నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నాలు ఫలించలేదు. భర్త కేకలు విన్న విమల తన దగ్గర ఉన్న వెదురు కర్రను పట్టుకుని నదిలోకి దిగింది. తన భర్తను కాపాడడం కోసం మొసలి తలపై గట్టిగా కొట్టడం ప్రారంభించింది. ఎంత ప్రయత్నించినా మొసలి మాత్రం పట్టు విడవడం లేదు. దాంతో విమల తన శక్తినంతా కూడదీసుకుని మొసలి కళ్లపై గట్టిగా కొట్టడం ప్రారంభించింది. ఈసారి ఆమె ప్రయత్నం ఫలించింది. మొసలి అతన్ని విడిచి నదిలోకి వెళ్లిపోయింది. కానీ, అప్పటికే బన్నేసింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో కుటుంబ సభ్యుల సహాయం తీసుకుని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే గాయాలు తీవ్రంగా ఉండడంతో అతన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఈ జీవితం నా భార్య ఇచ్చిన బహుమతి..!

గాయాల నుంచి కోలుకున్న తర్వాత బన్నేసింగ్‌ మాట్లాడుతూ ఈ జీవితం తన భార్య ఇచ్చిన బహుమతి అని చెప్పుకొచ్చాడు. ‘మొసలి నా కాలు పట్టుకుని నదిలోకి ఈడ్చుకెడుతున్నప్పుడు కళ్ల ముందు మృత్యువు కనిపించింది. అప్పుడు నా భార్య ప్రాణాలకు తెగించి మరీ నన్ను కాపాడింది. ఆ పావుగంటలో విమల సమయస్ఫూర్తి, సాహసమే నన్ను బతికించాయి. ఈ జీవితం నా భార్య ఇచ్చిన బహుమతి’ అంటూ తన భార్యని ఆకాశానికెత్తేశాడు!

అక్కడి చంబల్‌ నదీ తీరం 40 కిలోమీటర్ల పొడవునా మొసళ్లు ఎక్కువగా ఉంటాయని స్థానికులు చెబుతారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 16 మంది మొసళ్ల దాడిలో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అయితే మొసలి దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన మొదటి వ్యక్తి మాత్రం బన్నే సింగ్ ఒక్కడే కావడం.. అందులోనూ తన భార్యే తనని ప్రాణాలకు తెగించి మరీ రక్షించడం చెప్పుకోదగిన విషయం.

నా భర్త కంటే ఏదీ నాకు ఎక్కువ కాదు..!

అయితే ప్రాణాలకు తెగించి భర్తను కాపాడిన విమల మాత్రం ‘నా భర్త కంటే ఏదీ నాకు ఎక్కువ కాదు’ అని చెబుతోంది. ‘ఆ సమయంలో నా గురించి నేను ఎంతమాత్రం ఆలోచించలేదు. నా భర్తను మొసలి నుంచి ఎలా కాపాడాలన్న విషయం గురించి మాత్రమే ఆలోచించాను. కానీ ఆ సమయంలో ఏం చేయాలో వెంటనే పాలుపోలేదు. నా దగ్గర ఉన్న కర్రతో మొసలి తలపై కొడుతూనే ఉన్నాను. కానీ అది విడిచి పెట్టలేదు. దాంతో మొసలి కంటిపై గట్టిగా కొట్టడం ప్రారంభించాను. దాంతో అది నా భర్తను విడిచి నదిలోకి వెళ్లిపోయింది’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. పలువురు విమల సాహసాన్ని వీరోచిత చర్యగా ప్రశంసిస్తూ, ప్రభుత్వం కూడా ఆమె ధైర్యాన్ని గుర్తించి, సత్కరించాలని కామెంట్లు పెడుతున్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్