Published : 25/11/2021 19:03 IST

ఆ ‘ఒక్క ఛాన్స్‌’ కోసం ఈ ఒక్క యాప్‌!

(Photo: Instagram)

సినిమాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చాలామంది ఆశ పడుతుంటారు. ‘ఒకే ఒక్క ఛాన్స్‌’ కావాలంటూ స్టూడియోల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుంటారు. ఈ క్రమంలో ఉన్న ఉద్యోగాన్ని, సొంత ఊరిని వదులుకోవడానికీ సిద్ధపడుతుంటారు. మరి, ఇలాంటి వాళ్లందరికీ అవకాశాలు దక్కుతాయా అంటే..? అరుదనే చెప్పాలి. అందుకే ఇలాంటి వాళ్లందరికీ తన వంతుగా చేయూతనందించడానికి ముందుకొచ్చింది పంజాబీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. సినిమా ఔత్సాహికులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు వీలుగా.. తన తమ్ముడు అమన్‌తో కలిసి ఓ యాప్‌ను రూపొందించిందీ ముద్దుగుమ్మ. సినిమా కష్టాలు సినిమా వాళ్లకే తెలుసన్నట్లు.. ఈ రంగుల ప్రపంచంలోకి వచ్చే క్రమంలో తానెదుర్కొన్న అనుభవాలే ఈ యాప్‌ ఆలోచనకు ఆజ్యం పోశాయంటోన్న రకుల్‌.. తన యాప్‌ గురించి ఏం చెబుతోందో తెలుసుకుందాం రండి..

కన్నడ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చినా.. తన అందం, అభినయంతో టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. మరోవైపు బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం వరుస హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న రకుల్‌.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటుంటుంది. ఇక ఇప్పుడు ఓ కొత్త యాప్‌తో తన ఫ్యాన్స్‌కు మరింత చేరువైందీ బ్యూటీ.

అందుకే ఈ యాప్‌!

సినిమాల్లో నిలదొక్కుకోవాలంటే ఎంతలా కష్టపడాలో.. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే అంతకంటే ఎక్కువగా శ్రమపడాలంటోంది రకుల్‌. ఈ క్రమంలోనే ఔత్సాహికులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి వీలుగా ‘స్టారింగ్‌ యూ’ అనే యాప్‌ను తన తమ్ముడితో కలిసి రూపొందించింది. ఇది లింక్డిన్‌ తరహా అప్లికేషన్‌. సినిమాల్లోకి రావాలనుకునే వారు ముందుగా తమ వివరాలను ఇందులో నమోదుచేసుకొని.. తమలో ఉన్న ప్రతిభ (ఉదాహరణకు.. నటన, నృత్యం, సంగీతం, స్క్రిప్ట్‌ రైటింగ్‌, పాటలు రాయడం మొదలైనవి..)ను ఫొటోలు, వీడియోల రూపంలో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ యాప్‌లో క్యాస్టింగ్‌ అప్‌డేట్స్‌, సినిమాలు-ఆడిషన్స్‌కి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుంటుంది. ఇక ఈ యాప్‌తో అనుసంధానమై ఉన్న దర్శకనిర్మాతలు, ప్రొడక్షన్‌ హౌస్‌లు.. తమ సినిమాలకు అవసరమైన ప్రతిభావంతుల్ని ఈ యాప్ ద్వారా ఎంచుకునే వీలు కలుగుతుంది. ఫలితంగా ఔత్సాహికులు ఒక్క ఛాన్స్‌ అంటూ స్టూడియోల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందంటోంది రకుల్‌.

నాలా వాళ్లు కష్టపడకూడదని..!

‘నేను సినిమాల కోసం ప్రయత్నిస్తోన్న సమయంలో ఇలాంటి ఓ యాప్‌ ఉంటే ఎంతో మేలు కలిగేది అని ఇప్పుడు అనిపిస్తుంటుంది. ఎందుకంటే క్యాస్టింగ్‌ స్టూడియోల చుట్టూ తిరగడం, ఆడిషన్స్‌ కోసం గంటల తరబడి క్యూలో నిలబడడం.. ఇవన్నీ నాకూ అనుభవమే. ఈ క్రమంలో దాదాపు రెండేళ్ల పాటు కష్టపడ్డాను. ఇక కరోనా సమయంలో సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. అదే సమయంలో సినిమాల్లో అవకాశాల కోసం వెతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్నా. ఇలాంటి వారు సులభంగా అవకాశాలను అందిపుచ్చుకునేలా చేయాలనే నేను, అమన్‌ ఈ చిన్న ఆలోచన చేశాం. సినిమా ఆసక్తి ఉన్న వారికి, అలాంటి ప్రతిభ కోసం వెతికే దర్శక నిర్మాతలు, ప్రాంతీయ ప్రొడక్షన్‌ హౌస్‌లకు మా యాప్‌ ఓ వారధిలా ఉపయోగపడుతుంది. ఇందులో బాలీవుడ్‌తో పాటు ఇతర ప్రాంతీయ చిత్ర పరిశ్రమల్ని కూడా అనుసంధానం చేశాం. అలాగే కేవలం మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సినిమా ట్యాలెంట్‌ ఉన్న వాళ్లు ఈ వేదికగా అవకాశాల కోసం ప్రయత్నించచ్చు..’ అంటూ చెప్పుకొచ్చిందీ పంజాబీ అందం.

ఇదనే కాదు.. మరోవైపు తన తమ్ముడితో కలిసి జిమ్‌ బిజినెస్‌ కూడా చేస్తోంది రకుల్‌.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి