Published : 01/10/2021 13:52 IST

రకుల్‌ ఫిట్‌నెస్‌ రహస్యాలు తెలుసా?

తెరపై కనిపించే అందాల తారలంతా తమ అందంతో పాటు.. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కూ సమ ప్రాధాన్యమిస్తుంటారు. ఈ క్రమంలోనే వివిధ రకాల వ్యాయామాలు చేస్తూ.. చక్కటి ఆహార నియమాల్నీ పాటిస్తుంటారు. అంతేనా.. అప్పుడప్పుడూ వాటిని తమ అభిమానులతో పంచుకుంటూ స్ఫూర్తి నింపుతుంటారు కూడా! తాజాగా రకుల్ప్రీత్‌ సింగ్‌ కూడా ఇదే చేసింది. పాలరాతి శిల్పం లాంటి తన ఫిట్టెస్ట్‌ బాడీ వెనకున్న అసలు రహస్యమేంటో చెప్పేసింది. మరి, అదేంటో తెలుసుకుంటూనే.. వివిధ సందర్భాల్లో/ పోస్టుల రూపంలో తాను పంచుకున్న ఆరోగ్య/ఫిట్‌నెస్ రహస్యాలేంటో ఓసారి నెమరువేసుకుందాం..!

ఇది నా హెల్దీ మెనూ!

* ఇంట్లో తయారుచేసుకున్న పదార్థాలే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయని చెప్పే రకుల్‌.. తన ఫిట్‌నెస్‌కు పెరుగన్నమే కారణమంటోంది. ఈ క్రమంలోనే పెరుగన్నం తింటోన్న ఫొటోను తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఆమె.. ‘పెరుగన్నంలో సబ్జా గింజలు వేసుకొని తింటే ఆ రుచే వేరు! పెరుగులో ఉండే మైక్రోబ్స్‌, సబ్జా గింజల్లో ఉండే పీచు పొట్ట ఆరోగ్యానికి ఎంతో మంచివి. కడుపుబ్బరం వంటి సమస్యలు తలెత్తకుండా ఇవి కాపాడతాయి. తద్వారా రోజంతా ఎంతో యాక్టివ్‌గా ఉండచ్చు.. మరింత ఫిట్‌గా మారిపోవచ్చు..’ అంటోంది రకుల్.

* ఆరోగ్యానికైనా, నాజూకైన శరీరాకృతిని సొంతం చేసుకోవడానికైనా చిరుధాన్యాల్ని మించింది లేదనేది నా అభిప్రాయం. అందుకే నా ఆహారంలో అవి ఉండాల్సిందే! ఈ క్రమలో ఒక్కటని కాదు.. వివిధ రకాల చిరుధాన్యాల్ని మెనూలో చేర్చుకుంటా.

* శరీరానికి తేమనందించడానికి, కడుపుబ్బరం.. వంటి జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి, మొటిమల్ని దూరం చేసుకోవడానికి నేను ఎంచుకునేది బార్లీ నీళ్లు.

* వీగనిజం అనేది డైట్‌ కాదు.. జీవనశైలి. వీగన్‌గా మారిన వారికి తీసుకునే ఆహారం విషయంలో తక్కువ ఆప్షన్లుంటాయనుకుంటారు. కానీ అది సరైంది కాదు.. ఈ ఆహార శైలికి అలవాటుపడిన వారు ఆకుకూరలతో పాటు పప్పులు, రోటీ, సబ్జీ.. వంటివి తీసుకోవచ్చు. వీగన్‌గా మారిన తర్వాత నేనూ ఇదే చేస్తున్నా.

* అన్నం తింటే బరువు పెరుగుతామన్న అపోహ చాలామందిలో ఉంది. కానీ ఇందులోని కార్బోహైడ్రేట్లు సులభంగా జీర్ణమవుతాయి. తద్వారా జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా శరీరం పోషకాల్ని సులభంగా గ్రహించగలుగుతుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడాలంటే ఇదే కీలకం! నేనైతే లంచ్‌లో ఎక్కువ శాతం అన్నమే తీసుకుంటా. ఇందులో కాస్త నెయ్యి కూడా వేసుకుంటా. దీనివల్ల రక్తంలో ఇన్సులిన్‌ స్థాయులు అదుపులో ఉండడంతో పాటు ఎక్కువ సేపు ఆకలేయకుండా జాగ్రత్తపడచ్చు.

* నేనో పెద్ద ఫుడీని! అయితే తీసుకునే ప్రతి ఆహారం పోషకాలతో నిండి ఉండేలా, రుచికరంగా ఉండేలా జాగ్రత్తపడతా. వీగన్‌గా మారాక ఎక్కువగా ఇంటి పట్టున వండిన ఆహార పదార్థాలకే ఓటేస్తున్నా. షూటింగ్స్‌కి వెళ్లినప్పుడల్లా చాలావరకు లంచ్‌ బాక్స్‌ తయారుచేయించుకొని తీసుకెళ్తున్నా. ఈ క్రమంలో జొన్న రొట్టె, బెండకాయ, పప్పు, అన్నం.. వంటి వాటికి ప్రాధాన్యమిస్తున్నా.

* ఇక లంచ్‌ తర్వాత విటమిన్‌ ‘సి’ నిండి ఉన్న జ్యూసులు/పానీయాలు తాగడం నాకు అలవాటు. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి మనం తీసుకున్న ఆహారంలో నుంచి ఐరన్‌ను శరీరం సులభంగా గ్రహించేలా చేస్తుంది. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

* గింజలు హార్మోన్ల ఆరోగ్యానికి ఎంతో మంచివి. అందుకే నేను వీటికి ప్రాధాన్యమిస్తున్నా. ముఖ్యంగా గుమ్మడి, అవిసె, నువ్వులు, పొద్దుతిరుగుడు గింజల్ని ఆహారంలో చేర్చుకుంటున్నా.


వారానికి ఆరు రోజులు!

* బరువు తగ్గాలనుకునే వారికే వ్యాయామాలు అవసరం అన్న భావన ఇప్పటికీ చాలామంది మహిళల్లో ఉంది. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ కాళ్లు/కీళ్ల నొప్పులు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. అదే బరువుతో సంబంధం లేకుండా రోజూ వ్యాయామాలు చేయడం అలవాటున్న వారు ఈ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.

* ఉత్సాహం అనేది నాకు పుట్టుకతోనే వచ్చిందనుకుంటా. అందుకే చిన్న వయసు నుంచే పరుగు, ఈత, కరాటే, లాన్‌ టెన్నిస్‌.. వంటి క్రీడల్లో పాల్గొనడానికి ఉత్సుకత చూపేదాన్ని. నేను జాతీయ స్థాయి గోల్ఫర్‌గానూ రాణించాను.

* వారానికి ఆరు రోజులు వ్యాయామం చేస్తా. ఈ క్రమంలో కిక్‌ బాక్సింగ్‌, సైక్లింగ్‌, స్కిప్పింగ్‌.. వంటి హై ఇంటెన్సిటీ కార్డియో వ్యాయామాలకు ప్రాధాన్యమిస్తా. ఏ వ్యాయామం చేసినా ముందుగా ఓ పది నిమిషాల పాటు కచ్చితంగా వార్మప్‌ చేస్తా.

* అంతేకాదు.. నా శరీరాన్ని ఫిట్‌గా, ఫ్లెక్సిబుల్‌గా మార్చుకోవడానికి యోగా నా వర్కవుట్‌ రొటీన్‌లో ఉండాల్సిందే! ఇది లోలోపలి నుంచి మనకు శక్తిని ప్రసాదిస్తుంది.

* వ్యాయామం తర్వాత రిలాక్సవడానికి యోగ నిద్ర తప్పనిసరి. ఇది నా వెల్‌నెస్‌ ఎక్స్‌పర్ట్‌ మున్‌మున్‌ నాకిచ్చిన చక్కటి సలహా! అంతేకాదు.. ఒత్తిడి, ఆందోళనలు, నిద్రలేమి.. వంటి ఎన్నో సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం చూపుతుంది.


అందం.. ఆనందం!

* ఆరోగ్యానికే కాదు.. నా చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా మార్చడంలో అవకాడోది కీలక పాత్ర. అందుకే దీన్నిలా గుజ్జులా చేసుకొని తీసుకోవడం నాకు అలవాటు!

* అప్పుడప్పుడూ ఛీట్‌ మీల్‌ తీసుకోవడం నాకూ అలవాటే! అయితే అది కూడా ఆరోగ్యకరంగానే ఎంచుకుంటా!

* నా అందం, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌.. వీటన్నింటికీ కారణం ఆనందమే! అందుకే ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటా!

ఫిట్‌నెస్‌పై తనకున్న ప్రేమతో ఓ జిమ్ సెంటర్ కూడా నడుపుతోంది రకుల్. మరోవైపు సినిమాల్లోనూ బిజీగా గడుపుతోంది. ఆమె నటించిన ‘కొండపొలం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని