Published : 16/06/2022 17:20 IST

Rashmika Mandanna: నేనో పెద్ద ఫుడీని.. రోజులో ఏమేం తింటానంటే..?!

(Photos: Instagram)

మనం ఎక్కువగా దృష్టి పెట్టేది అందం, ఆరోగ్యం పైనే! ఈ క్రమంలోనే తీసుకునే ఆహారంలో పలు మార్పులు-చేర్పులు చేసుకుంటాం. ఇక నిత్యం యవ్వనంగా మెరిసిపోయే మన అందాల నాయికలైతే ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. ఉదయం మొదటి ఆహారం దగ్గర్నుంచి డిన్నర్‌ వరకు ప్రతిదీ ఆరోగ్యకరంగానే ఉండాలనుకుంటారు. అయితే ఈ విషయంలో తాను నాలుగాకులు ఎక్కువే చదివానంటోంది టాలీవుడ్‌ బ్యూటీ రష్మిక మందాన. తానో పెద్ద ఫుడీనని.. అలాగని ఏది పడితే అది తీసుకోనని చెబుతోంది. ఆరోగ్యం నిండి ఉండే తన రోజువారీ మెనూ చూడగానే ఎక్కడ లేని సంతోషం, ఉత్సాహం వచ్చేస్తాయంటూ ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది రష్మిక. మరి, ఈ ముద్దుగుమ్మ ఆరోగ్య, ఫిట్‌నెస్‌ రహస్యాలేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి..

ఇదీ నా మెనూ!

❖ షూటింగ్‌ ఉన్నా, ఇంట్లో ఉన్నా.. ఇంటి ఆహారానికే ప్రాధాన్యమిస్తా. ఉదయం నిద్ర లేవగానే సుమారు లీటర్‌ నీళ్లు తాగడం నాకు ముందు నుంచే అలవాటు. అయితే గత కొన్ని రోజుల నుంచి నా డైటీషియన్‌ సలహా మేరకు యాపిల్ సైడర్ వెనిగర్‌ తీసుకుంటున్నా.

❖ అల్పాహారానికి ముందు ఐస్‌డ్‌ కాఫీ తీసుకోవడం నాకు అలవాటు. మొన్నటిదాకా వేసవి వేడిని తట్టుకోవడానికి ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడింది. ఆ తర్వాత కాసేపటికి సెలరీ (ఇది ఒక రకమైన ఆకుకూర) జ్యూస్‌ తాగుతా.

❖ బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా చాలావరకు తేలికపాటి ఆహారానికే ప్రాధాన్యమిస్తా. ఈ క్రమంలో ఓట్స్‌-బాదం బటర్‌ నా ఫేవరెట్!

❖ మధ్యాహ్న భోజనానికి ముందు (బ్రంచ్‌ సమయంలో) కప్పు టీ తాగితే మనసు, శరీరం ఉత్తేజితమవుతాయి. అందుకే నా మెనూలో టీ ఉండాల్సిందే! అది కూడా బ్లాక్‌ టీకే ప్రాధాన్యమిస్తా.

❖ ఇక లంచ్‌లో చికెన్‌ ఉండాల్సిందే. దీంతో పాటు మెదిపిన బంగాళాదుంపలు తీసుకుంటా.

❖ రాత్రి డిన్నర్‌లోకీ లైట్‌ ఫుడ్‌నే ఇష్టపడతా. వెజిటబుల్‌ సూప్‌, పచ్చి కాయగూరలు, పండ్లు.. వంటివి ఉండాల్సిందే!

❖ నా శరీరం తేమను కోల్పోకుండా ఉండేందుకు నీళ్లు ఎక్కువగా తాగుతుంటా. నా ఆరోగ్యానికి, అందానికి ఈ చిట్కా ఎంతో ఉపయోగపడుతుంది.

స్లిమ్‌ కాదు.. ఫిట్‌నెస్‌ ముఖ్యం!

నాజూగ్గా ఉండడం కంటే ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండడమే ముఖ్యమనే సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తిని నేను. అందుకే ఆహారంతో పాటు వ్యాయామాలకూ తగిన సమయం కేటాయిస్తాను. ఈ క్రమంలో వారానికి నాలుగు రోజులు వర్కవుట్‌ చేస్తా. కిక్‌బాక్సింగ్‌, స్కిప్పింగ్‌, డ్యాన్స్‌, ఈత, యోగా, స్పిన్నింగ్‌, బ్రిస్క్‌ వాక్‌.. వంటివి సాధన చేస్తాను. వీటితో పాటు కండరాల సామర్థ్యం కోసం కార్డియో, బరువులెత్తడం.. నా ఫిట్‌నెస్‌ రొటీన్‌లో భాగం చేసుకుంటా. అయితే ఫిట్‌నెస్‌ స్థాయులు పెంచుకోవాలంటే రొటీన్‌ను మిస్‌ చేయకుండా స్థిరంగా కొనసాగించడం ముఖ్యం.

‘పుష్ప’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’.. చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న రష్మిక.. ప్రస్తుతం ‘పుష్ప-2’, ‘సీతా రామమ్‌’తో పాటు మరో నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని