Published : 04/05/2022 19:09 IST

కాబోయే అమ్మలూ.. మీకూ ఇవి తినాలనిపిస్తోందా..!

పుల్లపుల్లగా తినాలనిపించడం, ఈ పూట కారంగా ఏదైనా తింటే బాగుండుననిపించడం.. ఇలా గర్భిణుల్లో కొన్ని రకాల ఆహారపు కోరికలు కలగడం సహజం. మరికొందరైతే ఈ సమయంలో చేదును కూడా కోరుకుంటుంటారు. మరి, ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. అసలు గర్భిణుల్లో ఇలాంటి కోరికలు ఎందుకు కలుగుతాయని మీరెప్పుడైనా ఆలోచించారా? అయితే ఇందుకూ ఓ కారణముందని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. సాధారణంగా మన శరీరంలో ఏదైనా పోషకం ఉండాల్సిన దాని కంటే తక్కువగా ఉంటే ఆ పోషకం ఎక్కువగా ఉండే ఆహారం తినాలని శరీరం మెదడును ప్రేరేపిస్తుందట! అలా ఆ పదార్థం తినే దాకా మనకు నిద్ర పట్టదన్నమాట! మరి, ఇలా గర్భిణుల్లో సాధారణంగా కలిగే కొన్ని ఫుడ్‌ క్రేవింగ్స్‌ ఏంటో తెలుసుకుందామా?!

గర్భం ధరించిన తర్వాత మన శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గులు, ఆహార నియమాల్లో మార్పులు, ఆకలి పెరగడం.. ఇలా ఇవన్నీ గర్భిణుల్లో ఆహారపు కోరికలు పెరగడానికి కారణాలే అంటున్నారు నిపుణులు. అయితే ఈ క్రమంలో శరీరం ఆయా పదార్థాల నుంచి సరైన మోతాదులో పోషకాలను గ్రహించే దాకా ఈ కోరికలు కొనసాగుతాయని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. ఇక ఇలా మొదటి త్రైమాసికం చివర్లో మొదలైన ఈ ఆహారపు కోరికలు రెండో త్రైమాసికంలో మరీ ఎక్కువగా ఉంటాయని, మూడో త్రైమాసికంలో క్రమంగా తగ్గుముఖం పడతాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ ‘క్రేవింగ్స్‌’కీ అర్థముంది!

* కడుపుతో ఉన్నప్పుడు ఐస్‌క్రీమ్‌ తినాలనిపిస్తోందా? అయితే మీ శరీరానికి క్యాల్షియం అవసరం అని అర్థమట! అలాగని ఐస్‌క్రీమ్‌ను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు కాబట్టి మితంగా తింటూనే.. మధ్యమధ్యలో పెరుగులో చక్కెర వేసుకొని తినడం వంటి ప్రత్యామ్నాయాలను అనుసరించడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.

* ఉప్పుతో కూడిన చిప్స్‌, బిస్కట్స్‌.. వంటివి తినాలన్న కోరిక కలిగితే వారి శరీరంలో నీటి అవసరం ఎక్కువగా ఉందని అర్థమని ఓ అధ్యయనం చెబుతోంది. అలాగని ఇలాంటి పదార్థాలు తినేకంటే ఎక్కువగా నీరు తాగడం, చక్కెర వేసుకోకుండా తయారుచేసిన పండ్ల రసాలు తీసుకోవడం.. మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతగా సాల్టీ ఫుడ్‌ తినాలనిపిస్తే చిప్స్‌కి బదులు పాప్‌కార్న్ సరైన ఎంపిక అంటున్నారు.

* వేసవిలో కూల్‌ డ్రింక్స్‌ అంటే ఎవరికైనా ఇష్టమే! ఇక కొంతమంది గర్భిణుల్లో వాతావరణంతో సంబంధం లేకుండా ఇలాంటి శీతల పానీయాలు తాగాలన్న కోరిక కలుగుతుందట! అంటే.. వారి శరీరం చక్కెరను కోరుకుంటోందని అర్థమట! అలాంటి సమయంలో విచ్చలవిడిగా ఈ పానీయాలు తాగి ఆరోగ్యం పాడు చేసుకునే బదులు చల్లటి తాజా పండ్ల రసాలను తీసుకోమంటున్నారు నిపుణులు.

* ఇక గర్భిణిగా ఉన్నప్పుడు చాక్లెట్‌ తినాలనిపిస్తే.. అది శరీరానికి మరిన్ని క్యాలరీలు అవసరమని చెప్పడానికి సూచనట! ఈ క్రమంలో మిల్క్‌ చాక్లెట్‌ కంటే డార్క్‌ చాక్లెట్‌ అది కూడా ఒక బైట్‌ తిని ఆ కోరికను అదుపు చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

* ఐరన్‌ తక్కువగా ఉండే గర్భిణుల మనసు మాంసం వైపు లాగుతుందట! ఎందుకంటే మాంసంలో ఐరన్‌ స్థాయులు అధికంగా ఉంటాయి. అయితే దీన్ని కూడా మీ పోషకాహార నిపుణులు సూచించిన మోతాదులోనే తీసుకోవడం మంచిదట!

* కోడిగుడ్లు తినాలన్న కోరిక కూడా కొంతమంది గర్భిణుల్లో ఉంటుందట! అయితే ప్రొటీన్‌ అధికంగా ఉండే గుడ్లను డాక్టర్‌ సలహా మేరకు, మీ బరువును బట్టి ఒకటి లేదా రెండు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.. అది కూడా బాగా ఉడికించుకొని తీసుకోవడం మంచిది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని