Published : 14/10/2022 13:17 IST

పిరియడ్స్ టైంలో దుర్వాసన.. ఎందుకిలా?

నెలసరి సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సమస్యలు మహిళలకు సవాలుగా మారుతుంటాయి. ఈ టైంలో బ్లీడింగ్‌ వల్ల వచ్చే దుర్వాసన కూడా అలాంటిదే! దీంతో నలుగురిలోకి వెళ్లడానికి అసౌకర్యంగా, ఇబ్బందిగా ఫీలవుతుంటారు చాలామంది. అయితే దీనికి మనం తెలిసో, తెలియకో చేసే కొన్ని పొరపాట్లే కారణం అంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఏంటవి? ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి?

తరచూ మార్చుకుంటున్నారా?

నెలసరి సమయంలో బ్లీడింగ్‌ని బట్టి ప్రతి నాలుగైదు గంటలకోసారి శ్యానిటరీ న్యాప్‌కిన్ మార్చుకోవడం తప్పనిసరి అని చెబుతుంటారు నిపుణులు. దీనివల్ల లీకేజీ సమస్యను దూరం చేసుకోవడంతో పాటు వెజైనా ఇన్ఫెక్షన్ల ముప్పును చాలావరకు తగ్గించుకోవచ్చంటున్నారు. అయితే కొంతమంది ఈ విషయాన్ని విస్మరించి.. గంటల తరబడి ప్యాడ్‌ మార్చుకోకుండా అలాగే ఉండిపోతారు. నెలసరి దుర్వాసనకు ఇదీ ఓ కారణమే అంటున్నారు నిపుణులు. కాబట్టి రక్తస్రావాన్ని బట్టి నిర్ణీత వ్యవధుల్లో ప్యాడ్‌ మార్చుకోవడం, కప్‌ వాడితే ప్రతి 6-12 గంటలకోసారి దాన్ని శుభ్రం చేసుకోవడం.. వంటి జాగ్రత్తలు తీసుకుంటే సమస్య ఉండదు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ప్యాడ్‌ కంటే కప్ వాడితే నెలసరి సమయంలో వచ్చే దుర్వాసనను చాలావరకు తగ్గించుకోవచ్చట!

వాటికి ప్రత్యామ్నాయంగా..!

ప్రస్తుతం ఎక్కువ శాతం మంది బయట దొరికే ప్యాడ్స్‌నే ఉపయోగిస్తున్నారు. నిజానికి ఇందులో రసాయనాలు, పరిమళాల వాడకం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా రక్తస్రావంతో ఈ రసాయనాలు కలిసినప్పుడు అదో రకమైన దుర్వాసన వెలువడుతుంటుంది. పైగా ఈ ప్యాడ్లు ఆరోగ్యానికీ హానికరం కూడా! కాబట్టి వీటికి బదులుగా కాటన్‌, మైక్రోఫైబర్‌తో తయారుచేసిన సహజసిద్ధమైన ప్యాడ్స్‌ని ఎంచుకుంటే సురక్షితంగా ఉండచ్చు.

లోదుస్తులు శుభ్రంగా..!

సాధారణ దుస్తుల విషయంలో తీసుకున్న శ్రద్ధ చాలామంది లోదుస్తుల విషయంలో తీసుకోరు. అవి మురికిగా మారినా, రక్తస్రావమైనా.. ఏదో అలా పైపైన ఉతికేస్తుంటారు. అయితే ఈ నిర్లక్ష్యం కూడా నెలసరి సమయంలో దుర్వాసన రావడానికి కారణమవుతుందంటున్నారు నిపుణులు. పైగా ఇలాంటి అపరిశుభ్రమైన లోదుస్తులు వేసుకుంటే జననేంద్రియాల్లో అలర్జీ, ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా పెరుగుతుంది. కాబట్టి లోదుస్తుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, ప్యాడ్స్‌ మాదిరిగానే వీటినీ ఎప్పటికప్పుడు మార్చుకోవడం మర్చిపోవద్దు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత కూడా పిరియడ్‌ సమయంలో దుర్వాసనను చాలావరకు తగ్గిస్తుందంటున్నారు నిపుణులు.

ఆ ‘క్యాన్సర్‌’ ఉందేమో!

నెలసరి సమయంలో వచ్చే దుర్వాసనను చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. అయితే ఇది కొన్ని కేసుల్లో ‘సర్వైకల్‌ క్యాన్సర్‌’కూ సంకేతం కావచ్చంటున్నారు నిపుణులు. ఈ వ్యాధి ఉన్న వారిలో అధిక రక్తస్రావం, ఎక్కువ రోజులు బ్లీడింగ్‌ అవడం.. వంటి లక్షణాలూ కనిపిస్తాయంటున్నారు. ముఖ్యంగా కుళ్లిన వాసన వస్తున్నట్లయితే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవడం వల్ల సమస్యను నిర్ధారించుకోవచ్చు.

ఎప్పుడు డాక్టర్‌ని సంప్రదించాలి?

నెలసరి దుర్వాసనను అస్సలు నిర్లక్ష్యం చేయద్దంటున్నారు నిపుణులు. ముఖ్యంగా.. దీంతో పాటు పసుపు/ఆకుపచ్చ స్రావాలు, అసాధారణ స్థాయిలో బ్లీడింగ్ కావడం, పొత్తికడుపులో/వెజైనా దగ్గర భరించలేనంత నొప్పిగా ఉన్నప్పుడు, జ్వరం.. ఇలాంటి లక్షణాలుంటే మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించి.. దీనికి కారణమేంటో నిర్ధారించుకుంటే సమస్యకు సత్వర పరిష్కారం దొరుకుతుది. అలాగే ఇది ఇతర దుష్ప్రభావాలకు దారితీయకుండా జాగ్రత్తపడచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని