Updated : 16/02/2022 18:56 IST

స్ట్రెచ్ మార్క్స్.. తగ్గే అవకాశముందా?

గర్భం దాల్చిన మహిళల్లో స్ట్రెచ్ మార్క్స్ రావడం సహజం. అధిక బరువున్న మహిళల్లోనూ ఇవి కనిపిస్తాయి. చర్మం సాగిపోవడం కారణంగా ఏర్పడే వీటిని తగ్గించుకోవడానికి మహిళలు చాలానే శ్రమ పడుతుంటారు. మరి వీటిని తగ్గించుకొనే అవకాశం ఏమైనా ఉందా? తెలుసుకుందాం రండి..

ఎలా ఏర్పడతాయంటే..?

గర్భం దాల్చిన తర్వాత పొట్ట క్రమంగా పెరగడం మొదలవుతుంది. ఈ సమయంలో పొట్ట కండరాలతో పాటు చర్మం కూడా సాగుతుంది. ఇలా స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడడం క్రమంగా ప్రారంభమవుతుంది. సాధారణంగా చర్మం మూడు పొరలుగా ఉంటుంది. స్ట్రెచ్ మార్క్స్ ఎప్పుడూ పైపొర, మధ్యపొరల్లోనే ఏర్పడుతుంటాయి. దీనివల్ల చర్మకణాలు విడిపోయి కొలాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.

ఇవి ఏర్పడటానికి హార్మోన్ల ప్రభావం, బరువు పెరగడం కూడా కారణం కావచ్చు. ఎలాగైతే గాయం ఎక్కువ రోజులు మానకుండా ఉంటే.. దానికి సంబంధించిన గుర్తు చర్మంపై ఏర్పడుతుందో.. అలాగే స్ట్రెచ్ మార్క్స్ విషయంలోనూ జరుగుతుంది. ఎర్రటి స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ కాలం చర్మంపై ఉండడం వల్ల వాటి తాలూకు గుర్తులు పొట్టపై మిగిలిపోతాయి. ఇవి క్రమంగా చర్మం రంగులోకి కలిసిపోయినప్పటికీ పైకి కనిపిస్తూనే ఉంటాయి.

తగ్గే అవకాశం ఉందా..?

చాలామంది గర్భం దాల్చిన సమయంలో తమ పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ వస్తాయేమోనని భయపడుతుంటారు. వీటివల్ల ఆరోగ్యానికి కలిగే నష్టం ఏమీ లేకపోయినా.. అందం దెబ్బతింటుందనే కారణంతో కొందరు వీటి విషయంలో అసౌకర్యంగా ఫీలవుతుంటారు. అందుకే వీటిని తగ్గించడం కోసం గర్భం దాల్చినప్పుడే అంటే స్ట్రెచ్ మార్క్స్ ఎర్రగా ఉన్నప్పుడే కొన్ని రకాల క్రీములను ఉపయోగిస్తుంటారు. కానీ ఇది అంత మంచిది కాదు. దీనివల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డకు హాని కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయంలో వైద్యుల సలహా మేరకు కొన్ని రకాల ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. అధునాతన చికిత్సలు ప్రయత్నించవచ్చు.

సహజ పద్ధతుల ద్వారా..

పొట్టపై ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడానికి కొన్ని సహజమైన పద్ధతుల్ని పాటించడం ద్వారా కూడా కొంతవరకు ప్రయోజనాన్ని పొందవచ్చు.

* నిమ్మరసంలో కొద్దిగా పంచదార, కొన్ని చుక్కల కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనె కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. దీన్ని పొట్టపై రాసి కాసేపు నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మకణాలకు రక్తప్రసరణ జరిగి స్ట్రెచ్ మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ చిట్కాను ప్రతిరోజూ పాటించడం వల్ల మంచి ఫలితాన్ని పొందచ్చు.

* కలబంద సైతం స్ట్రెచ్ మార్క్స్ తగ్గించడానికి సాయం చేస్తుంది. ఇందుకోసం కలబంద గుజ్జుని చర్మానికి రాసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా రోజూ చేయడం ద్వారా చర్మంపై ఏర్పడిన స్ట్రెచ్ మార్క్స్ తగ్గే అవకాశం ఉంది.

* కొద్దిగా ఆముదంతో పొట్ట భాగాన్ని ఐదు నుంచి పది నిమిషాల పాటు గుండ్రంగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత పలుచని కాటన్ వస్త్రంతో కప్పాలి. ఆపై హీటింగ్ ప్యాడ్ లేదా వేడి నీరు నింపిన వాటర్‌బాటిల్తో పొట్టపై కప్పిన వస్త్రంపై కాపడం పెట్టినట్లుగా చేయాలి. ఇలా క్రమం తప్పకుండా నెల రోజుల పాటు చేస్తే కొంతవరకు ఫలితం కనిపిస్తుంది.

* ఆలివ్‌నూనెను ఉపయోగించడం ద్వారా కూడా పొట్టపై ఏర్పడిన స్ట్రెచ్ మార్క్స్‌ని దూరం చేసుకోవచ్చు. దీన్ని కొద్దిగా వేడి చేసి దాంతో మృదువుగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత అరగంట సమయం అలాగే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరగడంతో పాటు విటమిన్ 'ఎ', 'డి', 'ఇ' చర్మంలోకి బాగా ఇంకుతాయి. దీనివల్ల స్ట్రెచ్ మార్క్స్ తగ్గే అవకాశం ఉండచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని