అవాంఛిత రోమాలు.. ఎందుకొస్తాయి?

కొందరు మహిళల్లో ముఖంపై అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో అసౌకర్యానికి గురవుతుంటారు. అందుకే వివిధ పద్ధతుల ద్వారా ముఖంపై ఉన్న వెంట్రుకలను తొలగించుకుంటుంటారు. అయితే మహిళల్లో ఇలా ముఖంపై అవాంఛిత రోమాలు....

Published : 13 Jun 2023 13:06 IST

కొందరు మహిళల్లో ముఖంపై అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో అసౌకర్యానికి గురవుతుంటారు. అందుకే వివిధ పద్ధతుల ద్వారా ముఖంపై ఉన్న వెంట్రుకలను తొలగించుకుంటుంటారు. అయితే మహిళల్లో ఇలా ముఖంపై అవాంఛిత రోమాలు రావడం వెనుక కొన్ని ఆరోగ్యపరమైన కారణాలున్నాయంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకొందామా..

కారణాలివే!

మహిళల్లో గడ్డంపై అవాంఛిత రోమాలు రావడానికి ముఖ్య కారణం ఆండ్రోజెన్లే. పురుష హార్మోన్లైన ఇవి కొందరిలో అవసరానికి మించి విడుదలవుతుంటాయి. ఇలాంటి వారిలో గడ్డం, పైపెదవిపై వెంట్రుకలు పెరిగే అవకాశాలుంటాయి.

కొందరిలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా పీసీఓఎస్ సమస్య తలెత్తుతుంది. ఫలితంగా కొందరిలో గడ్డం పెరిగే అవకాశం ఉంటుంది.

అడ్రినల్ గ్రంథుల్లో సమస్యల వల్ల.. కొందరు మహిళల్లో కార్టిసాల్ విడుదల చాలా తక్కువగా ఉంటుంది. దీన్నే ‘అడ్రినల్ హైపర్ప్లేసియా’ అని పిలుస్తారు. శరీరంలో విడుదలవ్వాల్సిన స్థాయిలో కార్టిసాల్ ఉత్పత్తి అవకపోవడం వల్ల వారిలో మగవారి మాదిరిగా గడ్డం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్య పదిహేనువేల మందిలో ఒకరికి మాత్రమే ఉంటుందంటున్నారు నిపుణులు.

కార్టిసాల్ తక్కువైనప్పుడే కాదు.. అవసరమైన దానికంటే ఎక్కువగా విడుదలైనా ముఖంపై అవాంఛిత రోమాలు పెరిగే అవకాశం ఉంటుంది. దీన్నే 'కషింగ్ సిండ్రోమ్' అని పిలుస్తారు. పలు అనారోగ్యాల వల్ల స్టెరాయిడ్లు తీసుకొనే వారిలో ఇది కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థ్రైటిస్‌, ఆస్తమా.. వంటి సమస్యలకు చికిత్స తీసుకొనే క్రమంలో ఉపయోగించే మందుల కారణంగా కూడా ఈ సమస్య ఎదురవ్వచ్చట!

కొందరు మహిళలు గర్భనిరోధక మాత్రలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి కొందరిలో ఆండ్రోజెన్ విడుదల స్థాయిని పెంచుతాయి. ఇలాంటి వారిలో సైతం ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అవాంఛిత రోమాలు పెరిగే అవకాశం ఉంది.

బరువు అధికంగా ఉన్నవారిలో సైతం ముఖంపై వెంట్రుకలు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.


ఇలా తొలగించుకోవచ్చు..!

శరీరంపై వచ్చే అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి వ్యాక్సింగ్, షేవింగ్, ప్లక్కింగ్, త్రెడింగ్ వంటి పద్ధతులను ఉపయోగించడం తెలిసిందే. వీటితో పాటు నిపుణుల సలహా మేరకు లేజర్‌, ఎలక్ట్రాలిసిస్‌, కొన్ని రకాల క్రీములు.. వంటివి ఉపయోగిస్తూ అవాంఛిత రోమాలకు చెక్‌ పెట్టచ్చు. అలాగే కొంతమంది మహిళల్లో అధిక బరువు కారణంగా కూడా ఈ సమస్య తలెత్తచ్చు కాబట్టి.. బరువు తగ్గించుకుంటే ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇక సహజసిద్ధమైన పద్ధతుల్నే పాటించాలనుకునే వారి కోసం షుగర్‌ వ్యాక్స్‌, కార్న్‌ స్టార్చ్‌, పసుపు.. వంటివి మంచి ఫలితాలనిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని