Published : 14/11/2022 21:15 IST

చలికాలంలో బరువు పెరుగుతున్నారా?

చలికాలంలో జలుబు, దగ్గు, కీళ్లు పట్టేయడం, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, చర్మం పొడిబారడం.. వంటి సమస్యలు చాలామందిలో ఎదురయ్యేవే! అయితే ఈ కాలంలో చాలామంది బరువు కూడా పెరుగుతారని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు! ఇంతకీ ఈ కాలంలో బరువు పెరగడానికి కారణాలేంటి..? అది తెలుసుకుంటే మన శరీరంలో అనవసరంగా పేరుకుపోయే కొవ్వుల్ని కరిగించచ్చు.

శీతాకాలంలో చల్లటి వాతావరణం కారణంగా ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదు. తద్వారా ఫిట్‌నెస్‌ రొటీన్‌ అదుపు తప్పుతుంది. ఇదిలాగే కొనసాగితే మన శరీరంలోకి చేరిన క్యాలరీలు కొవ్వుగా రూపాంతరం చెందుతాయి. ఫలితంగా బరువు పెరుగుతాం. అయితే దీన్ని అధిగమించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ భాగస్వామి లేదా ఫ్రెండ్‌ని ఫిట్‌నెస్‌ పార్ట్‌నర్‌గా ఎంచుకొని ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఇదే కాదు.. ఈ కాలంలో బరువు పెరగడానికి ఇంకా చాలా కారణాలే ఉన్నాయంటున్నారు నిపుణులు.

ఎండ తగలకపోయినా..!

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనం కోసం ఎండలో నిల్చోవడం మనకు అలవాటే! ఈ క్రమంలో ఎండలో వ్యాయామాలు చేసే వారూ లేకపోలేదు. అయితే ఈ కాలంలో కొన్ని రోజులు పొగ మంచు కారణంగా ఎండ రాకపోవచ్చు.. ఇలా చలికాలంలో శరీరానికి ఎండ తగలకపోవడం వల్ల సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్‌ (ఎస్‌ఏడీ) సమస్య తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇది ఒక రకమైన డిప్రెషన్‌ లాంటిదే! దీని కారణంగా ఆహారపు కోరికలు, మోతాదుకు మించి ఆహారం తీసుకోవడం.. వంటివి తలెత్తుతాయి. ఈ అలవాట్లు అంతిమంగా బరువు పెరిగేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి ఉదయం ఎండ లేకపోతే మధ్యాహ్నం పూట కాసేపు వీలు కుదుర్చుకొని ఎండలో గడపడం మంచిదట. అయితే ఈ క్రమంలో సూర్యకిరణాల కారణంగా చర్మ సమస్యలు తలెత్తకుండా సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవడం మాత్రం మరవద్దు.

హార్మోన్ల అసమతుల్యత వల్ల..

హార్మోన్లు సమతులంగా లేకపోయినా బరువు పెరగడం మనకు తెలిసిందే! అయితే వాతావరణంలో మార్పులు వచ్చిన కొద్దీ హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని చెబుతున్నారు నిపుణులు. ఇది బరువు తగ్గే ప్రక్రియను నెమ్మదించడంతో పాటు ఆహారపు కోరికలు పెంచుతుంది. తద్వారా క్రమంగా బరువు పెరుగుతాం. కాబట్టి హార్మోన్ల అసమతుల్యత ఉన్న వారు ఈ కాలంలో రెగ్యులర్‌ చెకప్స్‌ చేయించుకోవడం అవసరం. అలాగే ఇందుకోసం మందులు వాడే వారు కూడా డాక్టర్‌ సలహా మేరకు సీజన్‌ను బట్టి అవసరమైతే మందుల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

అర్ధరాత్రి ఆకలేస్తోందా..?

శీతాకాలంలో పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో డిన్నర్ త్వరగా ముగించడం, రాత్రి ఎక్కువసేపు మెలకువతో ఉండడం, రాత్రుళ్లు తేలికపాటి ఆహారం తీసుకోవడం.. ఇలా కారణమేదైనా అర్ధరాత్రి ఆకలేస్తుంటుంది. అలాంటప్పుడు చాలామంది బిస్కట్స్‌, చిప్స్‌, పాప్‌కార్న్, కుకీస్‌, చాక్లెట్స్‌.. వంటివి లాగించేస్తుంటారు. ఈ అలవాటును ఇలాగే కొనసాగిస్తే బరువు పెరగడం ఖాయం. కాబట్టి వీటికి బదులుగా ఏదో ఒక పండు, పండ్ల రసం, నట్స్‌, డ్రైఫ్రూట్స్‌.. ఇలా ఆలోచిస్తే ఆరోగ్యకరమైన లేట్ నైట్‌ స్నాక్స్‌కు కొదవే లేదు.

ఇకపోతే డీహైడ్రేషన్‌ కూడా ఆహారపు కోరికల్ని పెంచుతుందట! కాబట్టి రోజుకు బరువును బట్టి రెండు-మూడు లీటర్ల నీళ్లు తాగడం తప్పనిసరి! అయితే చల్లగా తాగడానికి ఇబ్బంది పడితే గోరువెచ్చగా తీసుకోవడం మంచిది.

ఇక వీటితో పాటు మనం తీసుకునే ఆహారం కూడా బరువు తగ్గించడంలో సహకరిస్తుంది. ఈ క్రమంలో జామ-యాపిల్‌ వంటి సీజనల్‌ పండ్లు, క్యారట్‌-బీట్‌రూట్‌ వంటి దుంపలు, గుడ్లు-నట్స్‌-గింజలు వంటి ప్రొటీన్లు అధికంగా లభించే పదార్థాలు.. ఇలాంటివి ఆరోగ్యానికే కాదు.. చలికాలంలో బరువును అదుపులో ఉంచడానికీ దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని