ఆ లోటును భర్తీ చేసుకోండిలా..!

ఉన్నత భవిష్యత్తు కోసం ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం తప్పనిసరి. అయితే ఈ హడావిడిలో పడిపోయి చాలామంది దంపతులు ఒకరికొకరు తగిన సమయం కేటాయించుకోలేకపోతున్నారు. ఇక పని వేళలు, సెలవు రోజులు వేర్వేరుగా...

Published : 09 May 2023 12:25 IST

రమ్య-రాకేష్‌లకు ఇటీవలే పెళ్లైంది. ఇద్దరూ ప్రముఖ సంస్థల్లో ఉన్నతోద్యోగులు.. అయితే సమస్యల్లా ఇద్దరికీ వేర్వేరు పని వేళలు కావడమే. దీంతో ఇంటి నుంచి పనిచేసినప్పటికీ కలిసి గడపడానికి వీరికి సమయమే దొరకట్లేదు.

కీర్తనది మీడియా రంగం.. ఆమె భర్త కృతిక్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. షిఫ్టులే కాదు, ఇద్దరి వీక్లీ ఆఫ్‌లు కూడా వేరు. ఈ ఒత్తిడితో చీటికీ మాటికీ గొడవలు పడుతూ.. ఇద్దరి మధ్య దూరం పెరుగుతోంది.

ఉన్నత భవిష్యత్తు కోసం ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం తప్పనిసరి. అయితే ఈ హడావిడిలో పడిపోయి చాలామంది దంపతులు ఒకరికొకరు తగిన సమయం కేటాయించుకోలేకపోతున్నారు. ఇక పని వేళలు, సెలవు రోజులు వేర్వేరుగా ఉన్న వారైతే ఒకే ఇంట్లో ఉన్నా.. హాయ్‌, బైలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. నిజానికి ఈ ఉరుకుల పరుగుల జీవితం ఆరోగ్యాన్నే కాదు.. అనుబంధాన్నీ దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. తమ కాపురంలో కలతలు రేగడానికి ఇదీ ఓ కారణమంటూ చాలా జంటలు తమ వద్దకొస్తున్నట్లు చెబుతున్నారు. ఏదేమైనా.. పనివేళలు, సెలవు రోజుల్లో తేడాల వల్ల అనుబంధానికి ముప్పు వాటిల్లకూడదంటే.. ఆలుమగలు తమకు దొరికిన ఆ కాస్త సమయాన్నే తెలివిగా సద్వినియోగం చేసుకోవడం మంచిదంటున్నారు. మరి, అదెలాగో మనమూ తెలుసుకుందాం రండి..

ఆ సమయం వృథా కాకుండా..!

భార్యాభర్తలిద్దరికీ షిఫ్టు సమయాలు వేరైనప్పటికీ రోజులో ఏదో ఒక సమయం ఇద్దరికీ అనువుగా రావచ్చు. ఓరోజు మధ్యాహ్నం లంచ్‌ సమయానికి ఇద్దరూ ఇంట్లోనే ఉండచ్చు.. లేదంటే రాత్రిళ్లు కలిసి భోజనం చేసే అవకాశం దొరకచ్చు.. మరో రోజు ఉదయాన్నే కలిసి వ్యాయామం చేయడానికి వీలు కుదరచ్చు.. ఇంకో రోజు కలిసి ఇంటి పనులు, వంట పని చేసుకునేందుకు సమయం కలిసి రావచ్చు. అయితే ఇలాంటప్పుడు కొంతమంది మొబైల్స్‌, టీవీలకు అతుక్కుపోవడం.. ఇంకొంతమంది దొరక్క దొరక్క ఖాళీ సమయం దొరికిందని తమకు నచ్చిన పనుల్లో లీనమవడం.. వంటివి చేస్తుంటారు. కానీ ఇలాంటి పనులతో సమయాన్ని వృథా చేసుకోకుండా.. భాగస్వామితో గడపడానికి కేటాయిస్తే.. ఇద్దరూ కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకోవచ్చు.. దీనివల్ల ఇద్దరి మధ్య కమ్యూనికేషన్‌ దెబ్బతినకుండా జాగ్రత్తపడచ్చు.. అలాగే పని ఒత్తిళ్ల నుంచీ ఉపశమనం పొందచ్చు. ఇక వీక్లీ ఆఫ్‌లు కుదరకపోయినా.. నెలకోసారో లేదా రెండుసార్లో ఒకరి వీక్లీ ఆఫ్‌ రోజున మరొకరు సెలవు పెట్టుకోవడం.. ఇదే విధంగా మరోసారి ఇంకొకరు సెలవుల్ని అడ్జెస్ట్‌ చేసుకోవడం వల్ల మరింత ఎక్కువ సమయం కలిసి గడిపేందుకు వీలు దొరుకుతుంది.

కష్టసుఖాలు పంచుకోండి!

కాపురమన్నాక కలతలు, గొడవలు సహజం. వీటికి తోడు కెరీర్‌ పరంగా ఇద్దరూ బిజీగా ఉండడం వల్ల కలిసి గడపలేకపోతున్నామన్న ఒత్తిడి ఇద్దరిలోనూ సహజం. ఇవి మానసికంగా కుంగదీస్తాయి. ఈ చిరాకుతోనూ భార్యాభర్తలిద్దరి మధ్యా గొడవలు రావచ్చు. అయితే పని వేళల్లో తేడాల వల్ల అసలే సమయం దొరకట్లేదని ఈ గొడవల్ని నిర్లక్ష్యం చేస్తే.. మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ఇద్దరికీ ఉమ్మడిగా దొరికిన ఆ కాస్త సమయంలోనే ఓ పావు గంటో, అరగంటో కేటాయించి.. ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడం మేలంటున్నారు నిపుణులు. అలాగే ఒకరి కష్టసుఖాల్ని మరొకరు పంచుకోవడం, ఒకరికొకరు అండగా నిలవడం కూడా.. బిజీ లైఫ్‌స్టైల్లోనూ అనుబంధాన్ని పెంచుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గమే అంటున్నారు.

పరోక్షంగా ప్రేమ పెంచుకోండి!

ఇద్దరూ ఉద్యోగాలు చేసే భార్యాభర్తలు బాధ్యతల్నే కాదు.. ఇంటి పనుల్నీ సమానంగా పంచుకోవడం మనం చూస్తుంటాం. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఆయా పనులు చేసుకోవడం వల్ల ఇంటి పని త్వరగా పూర్తవుతుంది.. ఒక్కరిపైనే భారం పడకుండానూ ఉంటుంది. ఇలా ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. అయితే షిఫ్టు వేళలు వేరైనా.. కలిసి గడిపే సమయం దొరక్కపోయినా ఇంటి పనుల్ని సమానంగా పంచుకుంటూ ముందుకు సాగితే భార్యాభర్తలు తమ అనుబంధాన్ని దృఢం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. భార్య ఆఫీస్‌ పనుల్లో నిమగ్నమైనప్పుడు.. అంట్లు తోమడం, బట్టలు వాషింగ్‌ మెషీన్లో వేయడం-ఆరేయడం, ఇల్లు శుభ్రం చేయడం.. వంటి ఇంటి పనుల్ని భర్త పూర్తిచేయచ్చు.. అలాగే భర్త కోసం వంట, మిగిలిన ఇతర పనుల్ని భార్య చేసుకోవడం.. ఇలా ఒకరు చేయగా మిగిలిన పనుల్ని మరొకరు చేసుకోవడం వల్ల.. సమయం ఆదా అవుతుంది.. పరోక్షంగా ఒకరికొకరు సహాయపడినట్లూ ఉంటుంది. ఇది కూడా ఆలుమగల మధ్య అనుబంధాన్ని పెంచుతుందంటున్నారు నిపుణులు.

దాన్ని నిర్లక్ష్యం చేయద్దు!

దాంపత్య బంధంలో శృంగారానిది కీలక పాత్ర. అయితే చాలామంది భార్యాభర్తలు తీరిక లేని పనివేళలు, షిఫ్టుల్లో మార్పుల కారణంగా దీనికీ తగిన సమయం కేటాయించలేకపోతారు. మరికొందరు పని ఒత్తిళ్లతో సతమతమవుతూ లైంగిక జీవితాన్ని ఆస్వాదించలేకపోతారు. ఫలితంగా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. పరిస్థితి ఇక్కడి దాకా రాకూడదంటే.. ముందే జాగ్రత్తపడడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఇద్దరికీ దొరికిన సమయాన్నే ఇందుకు సద్వినియోగం చేసుకోవాలంటున్నారు. ఇందులో భాగంగా.. ఒకరి మనసులోని ఫాంటసీలు తమ భాగస్వామితో పంచుకోవడం, అవతలి వారి కోరికల్ని తెలుసుకొని మసలుకోవడం, అప్పుడప్పుడూ వెకేషన్స్‌కి ప్లాన్‌ చేసుకోవడం.. ఇవన్నీ మానసికంగా, శారీరకంగా ఇద్దరినీ దగ్గర చేసే మార్గాలే! కాబట్టి కెరీర్‌ విషయంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ లైంగిక జీవితాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయడం తగదంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్