Published : 31/01/2023 17:28 IST

ఇలా ఉంటే బంధం బోర్ కొట్టదు!

ఇంటి పనులు, ఆఫీస్‌ పనులు.. ఈతరం దంపతుల మధ్య దూరం పెరగడానికి ఇవీ ఓ రకంగా కారణమే! అందుకే ఆఫీస్‌ పనులు పక్కన పెట్టినా ఇంటి పనుల్ని కలిసి పంచుకుంటే కొంతవరకు ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఇవనే కాదు.. పిల్లల వల్ల కూడా ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించలేకపోతున్నామన్నది చాలామంది దంపతులు చెబుతోన్న మాట! అలాగని పిల్లల్నీ వద్దనుకోలేం.. ఎందుకంటే వాళ్లూ మన జీవితంలో అంతర్భాగమే! అయితే దీనికి ఒకే ఒక్క మార్గం ఉందంటున్నారు నిపుణులు. ఎలాగైతే పిల్లలకు జన్మనివ్వడంలో ఆలుమగల బాధ్యత సమానంగా ఉంటుందో.. పిల్లల్ని పెంచి పెద్ద చేసే బాధ్యతనూ కలిసి పంచుకున్నప్పుడే ఒక్కరి పైనే పూర్తి భారం పడకుండా ఉంటుంది.. తద్వారా అటు సమయమూ మిగులుతుంది.. ఇటు పిల్లలకు-మీకు మధ్య అనుబంధం రెట్టింపవుతుంది. ఇక ఈ దొరికిన సమయాన్ని దంపతులిద్దరూ వినియోగించుకోగలిగితే సంసారంలో కలతలకు చోటే ఉండదు..

నిత్యనూతనం చేసుకోవాలి!

వివాహ బంధం శాశ్వతమైంది. అయితే ఈ కాలంలో చాలామంది దంపతులు దీని విలువ తెలుసుకోలేక, లేదంటే డబ్బు మోజులో పడిపోవడం వల్ల, వివాహేతర సంబంధాలకు ఆకర్షితం కావడం వల్ల, పాశ్చాత్య పోకడల ప్రభావం మూలంగా.. ఇలా కారణమేదైనా నూరేళ్ల అనుబంధాన్ని మధ్యలోనే తెంచుకుంటున్నారు. ‘ఈ అనుబంధం మాకు బోర్‌ కొట్టేసింది’ అని సింపుల్‌గా చెప్పేస్తున్నారు. నిజానికి మన వివాహ వ్యవస్థకు, సంస్కృతీ సంప్రదాయాలకు పూర్తి విరుద్ధమిది! మరి, ఇలాంటి పవిత్ర బంధాన్ని మధ్యలోనే తెగతెంపులు చేసుకోకుండా, ఈ క్రమంలో వచ్చిన పొరపచ్ఛాల్ని దూరం చేసుకోవాలంటే.. దంపతులిద్దరూ ఒకరి లక్ష్యాలు, కోరికలు, ప్రాధమ్యాలు, పరిస్థితుల్ని మరొకరు అర్థం చేసుకుంటూ, అన్ని విషయాల్లో ఒకరికొకరు మద్దతు తెలుపుకుంటూ ముందుకు సాగడం మంచిదంటున్నారు నిపుణులు. వీటితో పాటు రొమాన్స్‌, శృంగారం కూడా అనుబంధాన్ని నిత్యనూతనం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

ఇదేవిధంగా ఈ కాలపు దంపతుల్లో పొరపచ్ఛాలు రావడానికి స్వార్థం కూడా ఓ కారణమే! కాబట్టి దాన్ని పక్కన పెట్టి ఎలాంటి ప్రతికూల పరిస్థితులొచ్చినా కలిసే ఎదుర్కోవడం, సమస్యల్నీ కలిసే పరిష్కరించుకోవడం వల్ల ఇద్దరి మధ్యా దగ్గరితనం పెరుగుతుంది. దాంపత్య బంధాన్ని పటిష్టం చేయడంలో ఇదీ కీలకమే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని