నాన్న కల... ఒలింపిక్స్‌కి చేర్చింది!

నాన్నకు ఆటంటే ప్రాణం. తన కూతురిని దేశం గర్వించే క్రీడాకారిణిగా చూడాలనుకున్నారు. ఆ అమ్మాయికేమో నాన్న కల నెరవేర్చాలన్నదే లక్ష్యం. దాన్ని సాధించడానికి పరుగును ఎంచుకున్న ఈ తెలుగమ్మాయి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మెరవడమే కాదు...

Updated : 07 Jul 2024 08:04 IST

నాన్నకు ఆటంటే ప్రాణం. తన కూతురిని దేశం గర్వించే క్రీడాకారిణిగా చూడాలనుకున్నారు. ఆ అమ్మాయికేమో నాన్న కల నెరవేర్చాలన్నదే లక్ష్యం. దాన్ని సాధించడానికి పరుగును ఎంచుకున్న ఈ తెలుగమ్మాయి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మెరవడమే కాదు... తాజాగా ఒలింపిక్స్‌కీ అర్హత సాధించింది. దండి జ్యోతిక శ్రీ... ఆమె పరుగు ప్రయాణమిదీ...

లింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ పోటీ! భారత్‌కి ఆఖరి అవకాశం. ఇక్కడ వెనకబడితే ఇక ఇంటికే. దీంతో గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఏదో మూలన బెరుకు. అందుకే ఎప్పటిలాగే తన సపోర్టర్‌... నాన్నకి ఫోన్‌ చేసింది జ్యోతిక. ‘నాన్నా ఇక్కడ సిగ్నల్స్‌ సరిగా లేవు’ అని ఏదో చెప్పబోయిందట. ‘సిగ్నల్స్‌ సంగతి వదిలేయ్‌... ఇప్పుడు నీ ధ్యాసంతా ఉండాల్సింది రేసు మీద’ అన్నారట ఆయన. ఆ ఒక్కమాటలోనే తనకు కావాల్సిన ధైర్యం వెతుక్కుంది జ్యోతిక. తన వందశాతం ఇచ్చి... పారిస్‌ ఒలింపిక్స్‌కి అర్హత సాధించింది. 

పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు జ్యోతిక శ్రీది. తండ్రి శ్రీనివాసరావు క్రీడాకారుడు. చిన్నప్పుడు పరుగు పందెం చూసి స్ఫూర్తిపొంది తాను కూడా అథ్లెట్‌ కావాలనుకున్నారట. అది నెరవేరకపోయినా బాడీబిల్డర్‌గా మారారు. ఆటలపై ప్రేమతో తన ఇద్దరు కూతుళ్లలో ఒకరినైనా క్రీడల్లో ప్రోత్సహించాలి అనుకున్నారాయన. చిన్నకూతురు జ్యోతిక స్కూల్లో వేగంగా పరుగెత్తడం గమనించి, ఆమెను ట్రాక్‌వైపు నడిపించారు. అలా 13 ఏళ్ల వయసులో జ్యోతిక పరుగులో తండ్రి దగ్గర శిక్షణ ప్రారంభించింది. రన్నర్‌గా ఎదిగింది. తరవాత 2016 నుంచి 2020 వరకు విజయవాడలో సాయ్‌ కోచ్‌ వినాయక్‌ ప్రసాద్‌ శిక్షణలో పరుగుపై పట్టు సాధించింది. ఆపై హైదరాబాద్‌లో గోపీచంద్‌ మైత్రా అథ్లెటిక్స్‌ ప్రాజెక్టులో భాగంగా ప్రముఖ కోచ్‌ నాగపురి రమేశ్‌ దగ్గర సాధన చేస్తూ.. అంచెలంచెలుగా ఎదిగింది. వ్యక్తిగత విభాగంతో పాటు రిలే పరుగులోనూ సత్తాచాటుతోంది. ఆమె ప్రతిభ గమనించి... గత ఏడాది జ్యోతికకు ‘ఈనాడు’ సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ అండగా నిలిచింది. ఆమె అవసరాలు తీరుస్తూ.. అత్యుత్తమ శిక్షణనూ అందించింది. ఆ అండతో మరింత రాటుదేలింది.

సులువేం కాలేదు...

2017 ప్రపంచ యూత్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 400మీ. రిలేలో ప్రాతినిధ్యం వహించింది. కానీ ఆమె గురించి అందరికీ తెలిసింది మాత్రం 2021లో. ఆ ఏడాది అండర్‌-23 మహిళల 400మీ. పరుగులో జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది జ్యోతిక. గత ఏడాది జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్, ఇండియన్‌ గ్రాండ్‌ ప్రి- 2,4 పోటీల్లో బంగారు పతకాలు గెలిచింది. ఆసియన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్, వరల్డ్‌ రిలే ఛాంపియన్‌షిప్‌ల్లో సత్తా చాటి తాజాగా ఒలింపిక్స్‌కి అర్హత సాధించింది. అలాగని జ్యోతిక ప్రయాణం నల్లేరు మీద నడకేమీ కాదు. అంతెందుకు, ఆసియన్‌ ఛాంపియన్‌షిప్‌ తరవాత మోకాలి గాయమైంది. దీంతో ఆసియన్‌ గేమ్స్, కామన్‌వెల్త్‌ క్రీడలకు దూరమైంది. తను లేకుండానే రిలే బృందం పతకం గెలిచింది. జట్టులో తను లేకపోవడం జ్యోతికను బాధించింది. అయినా తిరిగి పోడియం మీదకెక్కి పతకం అందుకోవాలని పట్టుదలగా అనుకుంది. గాయం తగ్గగానే మళ్లీ సాధన ప్రారంభించింది. మొదట్లో గాయపడతానేమో అని భయమేసినా దాన్నీ అధిగమించి ఫిట్‌నెస్‌ సాధించింది... ఒలింపిక్స్‌కి దూసుకెళ్లింది.

‘నాన్న ప్రోత్సాహంతో పరుగు మొదలుపెట్టా. ప్రస్తుతం ఒలింపిక్స్‌లో గెలవాలన్నది లక్ష్యం. నాకు పరుగులో పోటీపడడమే ఇష్టం. కానీ రిలేలోనూ ఉత్తమ ప్రదర్శన చేస్తుండడం కూడా గొప్పగా ఉంది. పోటీ ఏదైనా పతకం సాధించాలనే ధ్యేయంతోనే పరుగు తీస్తా. ఆ స్ఫూర్తితోనే ఎక్కువ దూరం వేగంగా పరుగెత్తడాన్ని అలవాటు చేసుకున్నా. కష్టం ఫలించి ఒలింపిక్స్‌కు ఎంపికవ్వడం సంతోషంగా ఉంది. ఇక్కడా గెలిచి, అండగా నిలిచిన కోచ్‌లు, నాన్న గర్వపడేలా చేయడం నా ముందున్న కర్తవ్యం’  అని చెప్పుకొచ్చింది 23 ఏళ్ల జ్యోతిక శ్రీ. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్