ఈ రెస్టరంట్లలో భోజనం చేస్తే ఆ కిక్కే వేరు..!

భాగస్వామితో బయటకు వెళ్లాలంటే మనకు మొదటగా గుర్తుకొచ్చేది రెస్టరంట్‌. అయితే రెస్టరంట్‌ అనగానే ఒక టేబుల్‌, నాలుగు కుర్చీలు, నచ్చిన వంటకం ఇవే కనిపిస్తాయి. వీటితో పాటు పక్కన జలపాతం పారుతుంటే, గాలిలో తేలుతున్నట్టు ఉంటే.. ఆ అనుభూతిని మాటల్లో....

Updated : 08 Dec 2022 14:06 IST

(Photos: Instagram)

భాగస్వామితో బయటకు వెళ్లాలంటే మనకు మొదటగా గుర్తుకొచ్చేది రెస్టరంట్‌. అయితే రెస్టరంట్‌ అనగానే ఒక టేబుల్‌, నాలుగు కుర్చీలు, నచ్చిన వంటకం ఇవే కనిపిస్తాయి. వీటితో పాటు పక్కన జలపాతం పారుతుంటే, గాలిలో తేలుతున్నట్టు ఉంటే.. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని రెస్టరంట్లు రుచికరమైన వంటకాలతో పాటు ఇలాంటి ప్రత్యేక అనుభూతినీ సొంతం చేస్తున్నాయి. ఈ క్రమంలో వాటిపై ఓ లుక్కేద్దామా...

సముద్రం గర్భంలో..

మాల్దీవుల్లో ఉన్న ఇథా రెస్టరంట్‌ పూర్తిగా సముద్రం గర్భంలో ఉంటుంది. ఇథా అంటే ముత్యాలకు తల్లి లాంటిదని అర్థం. ఈ రెస్టరంట్ పూర్తిగా పారదర్శక గ్లాస్‌తో కప్పబడి ఉంటుంది. దాంతో ఒకవైపు భోజనం చేస్తూ మరోవైపు సముద్రపు అందాలు, వివిధ రకాల చేపలను వీక్షించవచ్చు. ఇందులో ఒకేసారి 14 మంది కూర్చునే వీలుంటుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి నీటి లోపల ఉండే రెస్టరంట్గా పేరు పొందింది. ఇందులో ఆసియా, యూరోపియన్‌ వంటకాలు ఫేమస్.

 

పిచ్చుక గూళ్లలో..

గిజిగాడు గూడు ఎంతో అందంగా ఉంటుంది. అందులో పిచ్చుకలు ఎంతో హాయిగా సేదతీరుతుంటాయి. థాయిలాండ్‌లోని సొనెవా కిరి ఎకో రిసార్ట్‌ వారికి ఇలాంటి గూడు మనుషులకు కూడా ఉంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అంతే.. ఆ ఆలోచనతో మనుషులు పట్టే విధంగా కృత్రిమ గూళ్లతో ఏకంగా రెస్టరంట్‌నే తయారుచేశారు. దీని పేరే ‘బర్డ్‌ నెస్ట్‌ రెస్టరంట్’. ఈ రెస్టరంట్‌లో ఒక్కో చెట్టుకు ఒక్కో గూడు ఉంటుంది. ఒక్కో గూడుని 16 అడుగుల ఎత్తులో ఉండేట్టు తయారుచేశారు. కస్టమర్లు ఎక్కడానికి, దిగడానికి వీలుగా ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. ఇక, వెయిటర్లు జిప్‌లైన్‌ సహాయంతో ఆహారాన్ని సరఫరా చేస్తుంటారు. భలే ఉంది కదూ..!


జలపాతాల నడుమ..!

కొండకోనల నుంచి జారిపడే పాలనురగల్లాంటి జలపాతాల్ని చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. అలాంటి ప్రదేశంలో నచ్చిన వంటకంతో భోజనం చేస్తే ఎంత బాగుంటుందో కదూ..! ఫిలిప్పీన్స్‌లోని విల్లా ఎస్క్యుడెరో రిసార్ట్ వారు ఈ ఆలోచనను నిజం చేశారు. ఒక కృత్రిమ జలపాతాన్ని సృష్టించి, అందులో వెదురు కర్రలతో ఏకంగా రెస్టరంట్‌నే పెట్టేశారు. దీని పేరు  ‘లబసిన్ వాటర్‌ఫాల్‌ రెస్టరంట్’. ఇందులో ఒక పక్క పైనుంచి కిందకు జారిపడే జలపాతాల అందాల్ని వీక్షిస్తూ, మరోపక్క వేడి వేడి ఫిలిప్పీన్స్‌ వంటలను ఆస్వాదించచ్చు.


సముద్ర తీరంలో.. అందమైన గుహల్లో..

సముద్ర తీరం, సహజ సిద్ధమైన గుహలను చూడడానికి చాలామంది మక్కువ చూపిస్తుంటారు. మరి, ఆ రెండూ ఒక్క చోటే ఉండి, ఆ గుహలో రెస్టరంట్ కూడా ఉంటే ఎంతో బాగుంటుందో కదూ..! సరిగ్గా ఇలాంటి ప్రదేశమే ఇటలీలో ఉంది. దాని పేరు ‘గ్రోటా పలాజీస్ రెస్టరంట్’. ఈ రెస్టరంట్‌ ఎంతో పురాతనమైంది. దీనికి దాదాపు మూడు శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ రెస్టరంట్‌లో క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ సదుపాయం కూడా ఉంది. ఎన్నో రుచికరమైన వంటకాలను అందించే ఈ రెస్టరంట్‌కు వెళ్లాలంటే మాత్రం కొన్ని రోజులు ముందుగానే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందట.


గాల్లో తేలుతూ..

గాల్లో తేలుతుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా..! జంప్‌కింగ్‌ ఇంటర్నేషనల్‌ వారు గాల్లో తేలడమే కాకుండా.. ఏకంగా భోజనం కూడా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. అదే ఆలోచనతో ఒక రెస్టరంట్‌నే ఏర్పాటు చేశారు. ఇది హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలీలో ఉంది. ఈ రెస్టరంట్‌ క్రేన్‌ సహాయంతో పనిచేస్తుంటుంది. 160 అడుగుల ఎత్తులో ఉండే ఈ రెస్టరంట్‌లో ఒకవైపు రుచికరమైన భోజనం చేస్తూ, ఎత్తైన పర్వతాలు ఉండే మనాలీ అందాలను 360 డిగ్రీల్లో వీక్షించవచ్చు. ఈ రెస్టరంట్‌ పేరు ఫ్లై డైనింగ్‌ రెస్టరంట్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని