Published : 20/02/2023 20:56 IST

ఇవి ‘వృథా’ కావు!

వంట చేసే క్రమంలో మనం ఎన్నో పదార్థాల్ని వృథా అంటూ పడేస్తుంటాం. కానీ ‘ఈ సృష్టిలో ఏదీ వ్యర్థం కాద’న్నట్లు.. వాటితోనూ ఏదో ఒక ఉపయోగం ఉంటుందంటున్నారు నిపుణులు. ఆ విషయం తెలుసుకుంటే.. వంటింట్లో వ్యర్థంగా భావించే వివిధ పదార్థాల్ని సద్వినియోగం చేస్తూ పర్యావరణాన్ని సైతం కాపాడుకోవచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఏంటా పదార్థాలు? తెలుసుకుందాం రండి..

⚛ ఆకుకూరల ఆకుల్ని వేరు చేసి.. కాడల్ని పడేయడం మనకు అలవాటే! నిజానికి ఇందులో ఫైబర్‌తో పాటు ఇతర పోషకాలు అమితంగా ఉంటాయి. కాబట్టి వీటిని వృథాగా పడేయకుండా వెజిటబుల్‌ స్టాక్స్‌, సలాడ్స్‌, సూప్స్‌తో పాటు టాసింగ్‌గానూ వాడుకోవచ్చు.

⚛ కళ్లు మంట పుడుతున్నాయా? శరీరంపై ఎక్కడైనా గాయాలయ్యాయా? అయితే బంగాళాదుంప తొక్కలున్నాయిగా.. వాటిని సమస్య ఉన్న చోట పెట్టుకొని కాసేపు సేదదీరితే సరి.

⚛ కళ్ల కింద నల్లటి వలయాల్ని తొలగించడానికి, కంటి అలసటను దూరం చేయడానికి.. యాపిల్‌ తొక్కల్ని ఉపయోగించుకోవచ్చు. ఈ క్రమంలో ముందుగా కాసేపు వీటిని ఫ్రిజ్‌లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత ఈ తొక్కలతో సమస్య ఉన్న చోట రుద్దుకుంటే ఫలితం ఉంటుంది. అలాగే స్టీలు పాత్రలపై పడిన మరకల్ని కూడా వీటితో తొలగించచ్చు.

⚛ బ్రెడ్‌ గట్టిపడితే కొందరికి నచ్చదు.. దాంతో వృథా అంటూ పక్కన పడేస్తుంటారు. నిజానికి ఈ బ్రెడ్‌ ముక్కల్ని క్రష్‌ చేసుకొని బ్రెండ్‌ క్రంబ్స్‌ తయారుచేసుకోవచ్చు. వంటకాల్లో క్రిస్పీనెస్‌ కోసం ఈ క్రంబ్స్‌ని వాడుకోవచ్చు.. అలాగే దీనివల్ల రుచీ పెరుగుతుంది.

⚛ ఉల్లి, వెల్లుల్లి పొట్టుని చాలామంది పడేస్తుంటారు. అయితే వీటిని సూప్స్‌, స్టాక్స్‌లో భాగం చేసుకుంటే అందులోని పోషక విలువలు వృథాగా పోవు. అలాగే వాటి రుచీ పెరుగుతుంది.

⚛ విరిగిన పాలను పడేయకుండా వాటితో వెండి నగల్ని శుభ్రం చేసుకోవచ్చు.

⚛ బటర్‌ని ఉపయోగించుకున్నాక ఆ ప్యాకెట్స్‌/షీట్స్‌ని పడేస్తుంటారు చాలామంది. నిజానికి ఆ షీట్‌ లోపలి వైపు అంటుకున్న బటర్‌ని బేకింగ్‌ ట్రే గ్రీజులా వాడుకోవచ్చు.

⚛ పుచ్చకాయ, తర్బూజా.. వంటి తొక్కల్ని పడేయడం సహజం. అయితే వాటితో మురబ్బా, జామ్‌.. వంటివి తయారుచేసుకోవచ్చు.

⚛ ఆన్‌లైన్‌లో తెప్పించుకున్న కాయగూరలు, పండ్లు మెష్‌ బ్యాగ్స్‌లో ప్యాక్‌ చేసి రావడం సహజమే! అయితే ఆయా పదార్థాల్ని వాడుకొని బ్యాగ్స్‌ని వృథాగా పడేస్తుంటారు కొంతమంది. నిజానికి ఇవే బ్యాగ్స్‌లో కాయగూరలు, పండ్లని ఉంచి రిఫ్రిజిరేటర్లో భద్రపరచుకోవచ్చు. తద్వారా వీటికి ఉండే రంధ్రాల ద్వారా గాలి తగిలి అవి ఎక్కువ రోజులు తాజాగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ బ్యాగ్స్‌ మరీ డ్యామేజ్‌ అయితే వాటిని గిన్నెలు తోమే స్క్రబ్బర్స్‌గానూ ఉపయోగించుకోవచ్చు.

⚛ పేపర్‌ టవల్‌ని వాడుకున్నాక మిగిలిన రోల్స్‌ని పడేయకుండా.. వాటిని కేబుల్‌/వైర్‌ ఆర్గనైజర్‌గా వాడుకోవచ్చు. తద్వారా అవి చిక్కులు పడకుండా, బయటికి కనిపించకుండా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని