ఆ సమస్యలకు సహజసిద్ధ పరిష్కారం.. అదే ఆమె వ్యాపార సూత్రం!

ఇంటి పనులు, ఆఫీస్‌ బాధ్యతలతో.. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే తీరిక కూడా దొరకదు చాలామందికి. దీనికి తోడు నెలసరి, గర్భధారణ, ప్రసవానంతరం, మెనోపాజ్‌.. తదితర దశల్లో తలెత్తే శారీరక, మానసిక సమస్యలు....

Updated : 17 Jun 2023 19:02 IST

(Photos: Instagram)

ఇంటి పనులు, ఆఫీస్‌ బాధ్యతలతో.. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే తీరిక కూడా దొరకదు చాలామందికి. దీనికి తోడు నెలసరి, గర్భధారణ, ప్రసవానంతరం, మెనోపాజ్‌.. తదితర దశల్లో తలెత్తే శారీరక, మానసిక సమస్యలు మరో సవాలు. ఇక వీటి నుంచి బయటపడేందుకు రోజుల తరబడి మందులు వాడలేం.. నెలల కొద్దీ ఆహార పద్ధతుల్ని పాటించే ఓపికా ఉండదు. స్వీయానుభవంతో ఇలాంటి సమస్యల్ని గుర్తించిన రిచా.. సులభమైన పద్ధతుల్లో, ఒకే వేదికగా వీటికి పరిష్కారం చూపాలనుకుంది. ఈ ఆలోచనతోనే కార్పొరేట్‌ కెరీర్‌కు స్వస్తి చెప్పి.. వ్యాపారవేత్తగా మారిన ఆమె.. సహజసిద్ధమైన పద్ధతుల్లోనే మహిళలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని చేరువ చేయడానికి ప్రయత్నిస్తోంది. ‘మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ బాధ్యతనైనా సమర్థంగా నిర్వర్తించగలుగుతారు. అందుకే ముందు వారు తమ ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యమివ్వాలం’టోన్న రిచా.. తన వ్యాపార ప్రయాణం గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..

రిచా పెండేక్‌ది దిల్లీ.. ఎంబీఏ కోసం ముంబయి వచ్చిన ఆమె.. పెళ్లి తర్వాత ఇక్కడే సెటిలయ్యారు. చదువు పూర్తయ్యాక కార్పొరేట్‌ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. 12 ఏళ్ల పాటు విభిన్న హోదాల్లో పనిచేశారు. ‘నాది వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం.. అయినా నేను ఈ రంగంలోకి రావాలని కానీ, వస్తానని కానీ ఎప్పుడూ అనుకోలేదు. కార్పొరేట్‌ రంగంలోనే అంచెలంచెలుగా ఎదిగి సీఈఓ స్థాయికి చేరుకోవాలని కలలు కనేదాన్ని..’ అంటున్న రిచా.. అనుకోకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు.

అడుగడుగునా ప్రోత్సహించే వారే..!

తన తల్లిదండ్రులకు రిచా ఒక్కర్తే కూతురు. దాంతో అల్లారుముద్దుగా ఆమెను పెంచారు. అన్ని విషయాల్లోనూ ప్రోత్సహించేవారు. ఇక భర్త, అత్తమామలు కూడా ఇలాంటి వారే దొరకడం తన అదృష్టమంటున్నారామె. ‘మనలోని తపనకు కుటుంబ ప్రోత్సాహం తోడైతే ఏదైనా సాధించగలం. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. అమ్మానాన్నలతో పాటు అత్తమామలు, భర్త కూడా నన్ను ప్రోత్సహించే వారే దొరికారు. ఇక నేను అమ్మనయ్యాక మా అత్తయ్య నాతో ఓ మాట అంది.. ‘ఇంత చదువు చదివి ఇంట్లో కూర్చోవడమెందుకు? బేబీని నేను చూసుకుంటా.. నువ్వు నీ కెరీర్‌పై దృష్టి పెట్టు’ అని! ఆ మాటలు నాలో సరికొత్త ఉత్సాహం నింపాయి.. ఆ తర్వాత తిరిగి కార్పొరేట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టా..’ అంటోందామె.

వాళ్ల సమస్యలు చూశాక..!

ఇలా 12 ఏళ్ల పాటు ఈ రంగంలో పనిచేసిన ఆమె.. ఎంత బిజీగా ఉన్నా.. తన ఆరోగ్యంపై దృష్టి పెట్టేది. ముఖ్యంగా పోషకాహారానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడమన్నా, వాటి గురించి ఇతరులకు వివరించడమన్నా ఆమెకు మక్కువ ఎక్కువ. ఇలా తన కెరీర్‌లో భాగంగా ఎంతోమంది సహోద్యోగుల జీవనశైలిని దగ్గర్నుంచి గమనించింది రిచా. ఈ క్రమంలో వారు తమ ఆరోగ్యాన్ని, ఇతర పనుల్ని బ్యాలన్స్‌ చేసుకోలేకపోవడం.. ఫలితంగా పలు అనారోగ్యాలకు గురవడం.. గుర్తించింది. మరోవైపు నెలసరి దగ్గర్నుంచి గర్భధారణ, ప్రసవానంతరం, మెనోపాజ్‌.. వంటి దశల్లో మహిళలు ఎదుర్కొనే శారీరక, మానసిక సమస్యల్ని స్వీయానుభవంతో తెలుసుకుంది. అప్పుడే వీటికి పరిష్కారం చూపాలన్న ఆలోచన వచ్చిందంటోంది రిచా.

‘చాలామంది మహిళలు ఇంటి బాధ్యతలపై పెట్టినంత శ్రద్ధ తమ ఆరోగ్యంపై పెట్టరు. ఫలితంగా వివిధ రకాల అనారోగ్యాల బారిన పడుతుంటారు. మా ఇంట్లో ఆడవాళ్ల సంఖ్య ఎక్కువ! దీంతో ఇలాంటి అనుభవాలు నేను ప్రత్యక్షంగా చూశాను. ఇక నేను పనిచేసే చోట నా కొలీగ్స్‌లో చాలామంది ఇలాంటి సమస్యలే నా దృష్టికి తెచ్చేవారు. మరోవైపు నా ప్రెగ్నెన్సీ, ప్రసవానంతర సమయాల్లోనూ కొన్ని సమస్యలు నాకు సవాలు విసిరాయి. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడే ఎలాగైనా వీటన్నింటికీ సమాధానం చూపాలనిపించింది. మహిళల్లో వివిధ దశల్లో తలెత్తే సమస్యలకు విరుగుడుగా ఓ వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన చేశాను.. ఇదే 2019లో నా భర్తతో కలిసి ‘న్యూట్రిజో’ అనే సంస్థను ప్రారంభించేందుకు కారణమైంది..’ అంటోందీ టెకీ.

స్ట్రిప్స్‌, బార్స్‌ రూపంలో..!

ఎలాంటి అనారోగ్యాన్నైనా దూరం చేసుకోవాలంటే.. నెలల తరబడి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.. దీనికి తోడు జీవనశైలిలోనూ మార్పులు చేసుకోవాలి. అయితే అంత ఓపిక, తీరిక అందరికీ ఉండకపోవచ్చు. అలాంటి మహిళల కోసం సహజసిద్ధమైన, సులభమైన పరిష్కారాలు చూపడమే తన సంస్థ ముఖ్యోద్దేశం అంటోంది రిచా. ఈ క్రమంలో నెలసరి దగ్గర్నుంచి గర్భధారణ, ప్రసవానంతరం, మెనోపాజ్‌.. దాకా ఆయా సమస్యల్ని బట్టి పోషకాలతో కూడిన సహజసిద్ధమైన స్ట్రిప్స్‌, బార్స్‌, బైట్స్‌ తయారుచేస్తున్నారు రిచా.

‘మా ఉత్పత్తుల తయారీలో వాడే ప్రతి పదార్థం ప్రయోగశాలల్లో పరీక్షించాకే, FSSAI ఆమోదం పొందాకే ఉపయోగిస్తుంటాం. నెలసరి నొప్పిని నివారించే ఓరల్ స్ట్రిప్స్‌, తల్లిపాల ఉత్పత్తికి తోడ్పడే లాక్టో బార్స్‌/బైట్స్‌, గర్భిణిగా ఉన్నప్పుడు వేవిళ్లకు పరిష్కారంగా ఓరల్ స్ట్రిప్స్‌, గర్భిణులకు పోషకాలతో కూడిన స్ట్రిప్స్‌, మహిళల చర్మ-కేశ సౌందర్యాన్ని ఇనుమడించే బార్స్‌.. వంటి ఉత్పత్తులు ప్రస్తుతం మా వద్ద లభిస్తున్నాయి. వీటన్నింటిలోకెల్లా లాక్టో బార్స్‌కి ఎక్కువ డిమాండ్‌ ఉంది. డేట్స్‌, మెంతులు, క్రాన్‌బెర్రీ, అలీవ్ గింజలు, మునగాకులు, బఠానీ.. వంటి సహజ పదార్థాల్ని ఈ బార్స్‌ తయారీలో వాడతాం. అలాగే ఇతర ఉత్పత్తుల్లోనూ పూర్తిగా సహజసిద్ధంగా దొరికే పదార్థాల్నే ఉపయోగిస్తాం. ఇక వీటి తయారీలో కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్స్‌, షుగర్స్‌.. వంటివేవీ ఉండవు. కాబట్టి ఇవి వంద శాతం సహజసిద్ధమైనవి. అలాగే తయారీ దగ్గర్నుంచి ప్యాకింగ్‌ దాకా మేం ఉపయోగించే నానోటెక్నాలజీ వల్ల పదార్థాలు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండడంతో పాటు.. 40 సెకన్ల లోపే వాటిలోని పోషకాల్ని శరీరం గ్రహించగలదు..’ అని చెప్పుకొచ్చిందామె.

విదేశాలకూ విస్తరిస్తా!

ప్రస్తుతం తన ఉత్పత్తుల్ని తన వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్స్‌లోనూ విక్రయిస్తోన్న రిచా.. స్థానికంగా పలు ఆస్పత్రులతోనూ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘త్వరలోనే నా వ్యాపారాన్ని యూఏఈ, సింగపూర్‌.. వంటి దేశాలకూ విస్తరించాలనుకుంటున్నా. అలాగే రొమ్ముక్యాన్సర్‌, పీసీఓఎస్‌.. తదితర సమస్యలకూ సహజసిద్ధమైన పరిష్కారాలు చూపే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. మహిళలకు సంబంధించిన ప్రతి ఆరోగ్య సమస్యకూ సులభమైన, సహజసిద్ధమైన పరిష్కార మార్గాలు కనుక్కుంటూ, విశ్వసనీయమైన బ్రాండ్‌గా ఎదగడమే నా లక్ష్యం..’ అంటూ తన భవిష్యత్‌ ప్రణాళికల్ని పంచుకున్నారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని