Updated : 01/04/2022 16:00 IST

Unicorn: జంటగా మొదలుపెట్టి విడిగా ఆ ఘనత సాధించారు..!

(Photos: Facebook, LinkedIn)

ఒకప్పుడు బిజినెస్‌ అంటే కొన్ని రంగాలకు మాత్రమే పరిమితై ఉండేది. కానీ నేటి తరం యువత వినూత్నంగా ఆలోచిస్తున్నారు. పలు రకాల స్టార్టప్‌లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. తద్వారా మంచి ఫలితాలను రాబడుతున్నారు. వీరిలో మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. తాజాగా దిల్లీకి చెందిన చెందిన రుచి కల్రా (38) తన స్టార్టప్‌ని 100 కోట్ల డాలర్ల మైలురాయి దాటించి యూనికార్న్‌ స్టేటస్‌ దక్కించుకుంది. గతేడాది ఆమె భర్త ఆశిష్ మొహాపాత్ర (41) యూనికార్న్‌ లిస్ట్‌లో చేరాడు. తద్వారా భారత్‌లో విడివిడిగా తమ సంస్థలకు యూనికార్న్ స్టేటస్‌ దక్కించుకున్న తొలి జంటగా వీరు ఘనత సాధించారు. ఈ క్రమంలో వారి ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం రండి...

అలా కలిశారు!

ఆక్సిజో సీఈవో రుచి కల్రా ఐఐటీ దిల్లీలో బీటెక్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎంబీయే పూర్తి చేసింది. ఒడిశాలోని కటక్‌ ప్రాంతానికి చెందిన ఆశిష్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో పీజీపి, ఎంబీయే పూర్తి చేశాడు. అయితే చదువుకునేటప్పుడు వీళ్లిద్దరూ ఎప్పుడూ కలుసుకోలేదు. కానీ, ఒకే రకమైన చదువులు చదివిన వీరు కొద్ది కాలం తర్వాత మెకిన్సే & కంపెనీలో ఉద్యోగం సంపాదించారు. ఆశిష్‌ 2006లో ఎంగేజ్‌మెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగం సంపాదించగా కల్రా 2007లో చేరారు. ఇక్కడే వీరిద్దరి మధ్య వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి ముడి పడింది. అలా కొన్ని సంవత్సరాల పాటు కలిసి పని చేశారు. వివాహ బంధంలోకి కూడా అడుగుపెట్టారు.  ఆ తర్వాత ఇద్దరూ సొంతంగా బిజినెస్ చేయాలనుకున్నారు. దాని కోసం ఎంతో రీసెర్చ్‌ చేశారు. ఆ ఆలోచనల నుంచే ఆఫ్ బిజినెస్‌, ఆక్సిజో అంకురాలకు బీజం పడింది.

ఏడు లక్షల పరిశ్రమలతో..

ఆశిష్‌ 2016లో భార్య రుచి కల్రా సహ వ్యవస్థాపకురాలిగా, మరికొంతమంది భాగస్వామ్యంతో ఓఎఫ్‌బి టెక్ (OFB Tech) అనే అంకుర సంస్థను మొదలుపెట్టాడు. అయితే ఆశిష్‌ అంతకుముందు పలు హెల్త్‌కేర్‌ సంస్థలకు బోర్డ్‌ సభ్యుడిగానూ పనిచేశారు. ఆ తర్వాత ఓఎఫ్‌బి టెక్‌ని ఆఫ్ బిజినెస్‌గా మార్చారు. ఈ సంస్థ గురుగ్రామ్‌లో ఉంది. ఈ సంస్థ చిన్న, మధ్య తరహా (ఎస్‌ఎమ్‌ఈ) పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులు అందిస్తుంటుంది. అందులో దాదాపు 100కు పైగా ఉత్పత్తులుంటాయి. ఈ సంస్థ టెక్నాలజీని ఉపయోగించుకుని ఎస్‌ఎమ్‌ఈ పరిశ్రమలతో కనెక్ట్‌ అవుతుంటుంది. ఈ సంస్థ 35 దేశాల్లోని దాదాపు ఏడు లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో లావాదేవీలు జరుపుతుంటుంది. అయితే ఏ సంస్థకైనా వృద్ధి సాధించాలంటే పెట్టుబడులు ముఖ్యం. గత సంవత్సరం సాఫ్ట్ బ్యాంక్‌తో పాటు మరి కొంతమంది పెట్టిన పెట్టుబడులతో ఈ సంస్థ విలువ ఒక బిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటి, యూనికార్న్‌ హోదా దక్కించుకుంది. ఈ సంస్థకు ఆశిష్‌ సీఈవోగా, కల్రా సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు.

డేటా క్రంచింగ్‌ సాంకేతికతతో..

ఆశిష్‌, కల్రా జంట ఆఫ్‌ బిజినెస్‌ మొదలుపెట్టిన సంవత్సరానికే ఆక్సిజో సంస్థను మొదలు పెట్టింది. ఆక్సిజో అంటే ఆక్సిజన్, ఓజోన్ పదాల మిశ్రమం. ఆక్సిజో సంస్థను మొదట ఆఫ్ బిజినెస్‌కు అనుబంధ సంస్థగా ప్రారంభించారు. ఆఫ్ బిజినెస్ లాగానే ఈ సంస్థ కూడా చిన్న, మధ్యతరహా పరిశ్రమలే లక్ష్యంగా ఏర్పాటైంది. అయితే ఈ సంస్థ ఎస్‌ఎమ్‌ఈ పరిశ్రమలకు రుణాలిస్తుంటుంది. దీనికి వీరు డేటా క్రంచ్‌ అనే సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు. ఈ సంస్థ కూడా గురుగ్రామ్‌లోనే ఉంది. కాలక్రమేణా ఆక్సిజో బిజినెస్‌ పెరగడంతో కల్రా దీనికంటూ సొంత బృందాన్ని ఏర్పాటు చేసింది. దాంతో అప్పటిదాకా అనుబంధ సంస్థగా ఉన్న ఆక్సిజో స్వతంత్ర సంస్థగా మారింది. రుచి కల్రా ఈ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 2500 మంది క్లయింట్లు ఉన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో రుచి కల్రా దిట్ట. ఆమె తన మొదటి ప్రయత్నంలోనే ఆక్సిజో సంస్థకు 200 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులను సేకరించింది. తద్వారా ఇటీవలే తన సంస్థ విలువను 100 కోట్ల డాలర్ల మార్క్‌ని దాటించింది. దాంతో ఈ సంస్థ కూడా ‘యూనికార్న్‌’ హోదాను దక్కించుకుంది. ఇలా భారత్‌లో విడివిడిగా తమ సంస్థలకు యూనికార్న్ స్టేటస్‌ దక్కించుకున్న తొలి జంటగా వీరు ఘనత సాధించారు. ప్రత్యేకించి లాభదాయకంగా నడుస్తున్న ఫిన్‌టెక్ యూనికార్న్‌ను నెలకొల్పిన వ్యవస్థాపకురాలిగా రుచి పేరు పొందడం గమనార్హం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని