బెబో ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ ఇవేనట!

వయసు పెరుగుతున్నా వన్నె తరగని అందాన్ని, తల్లైనా నాజూకైన శరీరాకృతిని సొంతం చేసుకుంటుంటారు కొందరు అందాల తారలు. బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇద్దరు పిల్లల తల్లిగా ఓవైపు బిజీగా ఉంటూనే.. మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తోందామె.

Updated : 05 Feb 2022 17:18 IST

వయసు పెరుగుతున్నా వన్నె తరగని అందాన్ని, తల్లైనా నాజూకైన శరీరాకృతిని సొంతం చేసుకుంటుంటారు కొందరు అందాల తారలు. బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇద్దరు పిల్లల తల్లిగా ఓవైపు బిజీగా ఉంటూనే.. మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తోందామె. అంతేనా.. బిడ్డ పుట్టిన కొన్ని నెలల్లోనే ప్రసవానంతర బరువును తగ్గించుకొని అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. అందుకే ఈ ముద్దుగుమ్మ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ తెలుసుకోవాలని చాలామంది ఆరాటపడుతుంటారు. అయితే ఆ రహస్యాల గురించి ఇటీవలే పంచుకున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. స్వయానా బెబో న్యూట్రిషనిస్ట్‌ అయిన ఆమె.. తన ఆడియో బుక్‌ ‘ఈటింగ్‌ ఇన్‌ ది ఏజ్‌ ఆఫ్‌ డైటింగ్‌’లో కరీనా ఆహారపుటలవాట్లు, ఫిట్‌నెస్‌ రహస్యాల గురించి చెప్పుకొచ్చారు. మరి, ఇంతకీ ఏంటా సీక్రెట్స్‌? మనమూ తెలుసుకుందాం రండి..

వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌కి చక్కటి ఉదాహరణగా నిలుస్తుంటుంది అందాల కరీనా. ఓవైపు తన ఇద్దరు బిడ్డల ఆలనా పాలన చూసుకుంటూనే మరోవైపు సినిమాల్లోనూ కొనసాగుతోంది. అయితే తను గర్భిణిగా ఉన్నప్పుడు, తల్లయ్యాక ఇంత ఉత్సాహంగా ఉండడానికి ఆమె పాటించే ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, చేస్తోన్న వ్యాయామాలే కారణం అంటున్నారు రుజుత. బెబో వ్యక్తిగత న్యూట్రిషనిస్ట్‌ అయిన ఆమె.. సందర్భానుసారం ఈ ముద్దుగుమ్మ ఫిట్‌నెస్‌ రహస్యాలను పంచుకుంటూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే తన ఆడియోబుక్‌ ‘ఈటింగ్‌ ఇన్‌ ది ఏజ్‌ ఆఫ్‌ డైటింగ్‌’లో బెబో అనుసరించే కొన్ని ఫిట్‌నెస్‌, డైట్‌ సీక్రెట్స్‌ని పొందుపరిచారామె. వాటి గురించి ఇటీవలే పంచుకున్నారు.

గంటన్నర ముందే!

శరీరంలోని అదనపు క్యాలరీలు కరిగించుకోవడానికే చాలామంది వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఈ ప్రక్రియ మరింత ప్రభావవంతంగా జరగాలంటే వర్కౌట్‌కి ముందు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు రుజుత. ‘వ్యాయామం చేయడానికి గంట లేదా గంటన్నర ముందు పండ్లు, కాయగూరలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే దీనివల్ల శరీరంలో కండరాల సామర్థ్యం పెరుగుతుంది. ఇది శరీరంలోని అదనపు క్యాలరీలు కరగడానికి దోహదం చేస్తుంది. ఫలితంగా తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాలు ఆశించచ్చు..’ అంటూ బెబో రోజూ తీసుకునే అల్పాహారం గురించి చెప్పుకొచ్చారామె.

భోజనం తర్వాత నిమ్మరసం ఎందుకంటే..!

మధ్యాహ్నం భోంచేశాక నిద్ర రావడం, మగతగా అనిపించడం మనలో చాలామందికి అనుభవమే! అయితే ఈ భావన రాకూడదంటే కరీనా పాటించే ఈ చిన్న చిట్కా పాటిస్తే సరిపోతుందంటున్నారు రుజుత. ‘చాలామంది మధ్యాహ్నం ఓ ముద్ద ఎక్కువగా తిని ఆయాసపడడం చూస్తుంటాం. అయితే మితంగా తినడంతో పాటు భోజనం తర్వాత ఓ గ్లాసు నిమ్మరసం తాగితే అద్భుత ఫలితాలు సొంతం చేసుకోవచ్చు. ఈ నిమ్మరసంలో కొద్దిగా నల్ల ఉప్పు, అల్లం, రెండు మూడు కుంకుమ పూరేకలు వేసుకొని తీసుకుంటే.. నిద్ర, మగతగా అనిపించడం వంటివన్నీ దూరమై శరీరం చురుగ్గా ఉంటుంది. కుంకుమ పువ్వు చర్మానికి, జుట్టుకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇక నల్ల ఉప్పు, అల్లం కలిపి తీసుకోవడం వల్ల కడుపుబ్బరం దూరమై తేలిగ్గా అనిపిస్తుంది. తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమై జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు..’ అంటూ లంచ్‌ తర్వాత చాలామందికి ఎదురయ్యే సమస్యకు చెక్‌ పెట్టారామె.

డిన్నర్‌లోకి ఇవి!

రోజంతా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలకే ప్రాధాన్యమిచ్చే ఈ అందాల అమ్మ.. రాత్రి భోజనం విషయంలోనూ తగిన జాగ్రత్తలు పాటిస్తుందని చెబుతున్నారు రుజుత. ‘పడుకోవడానికి రెండు మూడు గంటల ముందే భోజనం చేయడం మంచి అలవాటు. కరీనా కూడా ఇదే చిట్కాను అనుసరిస్తుంటుంది. రాత్రి భోజనంలోకి పప్పన్నం-నెయ్యి లేదంటే కిచిడీ-పెరుగు, అదీ కాకపోతే జొన్న రొట్టె-సొరకాయ సబ్జీ-నెయ్యి.. ఇలా వీటిలో ఏదో ఒక కాంబినేషన్‌ తన డిన్నర్‌లో ఉండాల్సిందే!’ అంటున్నారామె.

యోగాతో 25 కిలోలు తగ్గాను!

బరువు తగ్గాలన్నా, ఫిట్‌గా మారాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా.. తీసుకునే ఆహారంతో పాటు చేసే వ్యాయామాలూ ముఖ్యమే అంటోంది బెబో. ఈ క్రమంలోనే రోజూ యోగా, పిలాటిస్‌ వ్యాయామాలు చేయడానికి తానెక్కువగా ఇష్టపడతానంటోంది. ‘2006లో తషాన్‌, జబ్‌ వుయ్‌ మెట్‌.. సినిమాలకు సంతకం చేసినప్పుడే నా యోగా జర్నీని కూడా ప్రారంభించా. ఈ వ్యాయామం నన్ను శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారుచేసింది. అంతెందుకు.. రెండుసార్లు ప్రసవానంతర ఒత్తిడి నుంచి కొన్ని నెలల్లోనే బయటపడగలిగానంటే యోగా వల్లే సాధ్యమైంది. ఇక జెహ్‌ కడుపులో పడ్డాక సుమారు 25 కిలోలు పెరిగా.. ఈ బరువు తగ్గడంలోనూ నాకు యోగా, పిలాటిస్‌ వ్యాయామాలే మేలు చేశాయి.. అలాగే నా డైటీషియన్‌ రుజుత సూచించిన ఆహార నియమాలు తు.చ. తప్పకుండా పాటించా.. కొత్తగా తల్లైన వారికి అన్ని ఒత్తిళ్లు తొలగిపోవాలన్నా, త్వరగా బరువు తగ్గి పూర్వపు స్థితికి చేరుకోవాలన్నా మానసిక దృఢత్వం చాలా ముఖ్యం.. అందుకూ యోగానే చక్కటి మార్గం!’ అంటూ ఇటీవలే ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది బెబో.

అయితే మహిళలందరి శరీరతత్వాలు ఒకేలా ఉండవు కాబట్టి నిపుణుల సలహా మేరకు వారు సూచించిన ఆహార నియమాలు పాటిస్తూ, చక్కటి వ్యాయామాలు చేస్తే తప్పకుండా ఆశించిన ఫలితం ఉంటుందని తన స్వీయానుభవంతో చెబుతోందీ అందాల అమ్మ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్