Kefir: ఈ అందాల రష్యన్ పిల్లికి.. ఎంతమంది ఫ్యాన్సో..!
తన అందం, ఆకారంతోనే కాదు.. మంచి అలవాట్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన ఈ రష్యన్ పిల్లి కథేంటో.. తన యజమాని యులియానే అడిగి తెలుసుకుందాం రండి..
(Photos: Instagram)
అమ్మాయిలు పెట్ లవర్స్. పిల్లల్లాగే వాటిని ముద్దు చేయడమే కాదు.. వాటితో ఫొటోలు దిగుతూ, సోషల్ మీడియాలో పంచుకుంటూ మురిసిపోతుంటారు కూడా! రష్యాకు చెందిన యులియా మినినా కూడా అంతే! పిల్లుల్ని ఎక్కువగా ఇష్టపడే ఆమె.. మూడేళ్ల క్రితం ఓ పిల్లిని ఇంటికి తెచ్చుకుంది. తన ఇద్దరు పిల్లలతో సమానంగా తన పెట్‌పై ప్రేమ చూపేదామె. అయితే ఓసారి సరదాగా తన పిల్లితో దిగిన ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది యులియా. అంతే.. నిమిషాల్లోనే ఆ ఫొటోలు వైరలై.. ప్రపంచవ్యాప్తంగా తన పెట్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ పోయింది. ఇలా కొన్ని రోజుల్లోనే ఓ మినీ సెలబ్రిటీగా మారిపోయిందీ పిల్లి. తన అందం, ఆకారంతోనే కాదు.. మంచి అలవాట్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన ఈ రష్యన్ పిల్లి కథేంటో.. తన యజమాని యులియానే అడిగి తెలుసుకుందాం రండి..
చూడగానే నచ్చేసింది!
యులియా.. తన భర్త, ఇద్దరు కూతుళ్లతో రష్యాలో నివసిస్తోంది. తనకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. అయితే తన వ్యక్తిగత బాధ్యతలు, కెరీర్ దృష్ట్యా పెట్స్‌పై దృష్టి పెట్టే సమయం ఆమెకు లేకపోయింది. కానీ 2020 మార్చిలో కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో.. ఇంటికే పరిమితమైంది యులియా కుటుంబం. ఆ సమయంలోనే ఓ పిల్లిని ఇంటికి తెచ్చుకున్నామంటోందీ రష్యన్ లేడీ.
‘లాక్‌డౌన్ సమయంలో పెట్ కోసం దగ్గర్లోని క్యాటరీకి వెళ్లాం. అక్కడ ఓ తెల్ల పిల్లి నా కంట పడింది. ఎంత ముద్దుగా ఉందంటే చూడగానే నచ్చేసింది. నా ఇద్దరు కూతుళ్లూ దాన్ని ఇష్టపడ్డారు. ఇంటికి తెచ్చుకున్నాక దానికి కెఫిర్ అని పేరు పెట్టాం. మొదట్లో ఇది బక్కచిక్కిపోయినట్లుగా ఉండేది.. కానీ తర్వాత దానికి అన్ని రకాల పదార్థాలు పెట్టడం మొదలుపెట్టాను. పిల్లలతోనూ ఎంతో యాక్టివ్‌గా ఆడుకునేది. ఇలా నాలుగైదు నెలల్లోనే పొడవు పెరిగింది.. బొద్దుగా తయారైంది. ఏడాది తిరిగేసరికి.. పదేళ్ల పిల్లల్లా కనిపించేది. గతేడాదే మేము కాస్త విశాలంగా ఉండే ఇంట్లోకి మారాం. ప్రస్తుతం కెఫిర్‌కు ప్రత్యేకమైన గది ఉంది. అందులోనే అది రిలాక్సవుతుంటుంది..’ అని తన పిల్లి గురించి చెబుతోంది యులియా.
కెఫిర్.. వెరీ స్మార్ట్!
కెఫిర్.. మెనే కూన్ జాతికి చెందిన అరుదైన పిల్లి. సాధారణంగానే ఈ జాతి పిల్లులు పెద్దగా, బలమైన శరీరాకృతితో కనిపిస్తాయట! ఇక అందులోనూ కెఫిర్ మరింత పెద్దగా, మనిషిలా కనిపించడంతో.. దీన్నీ తమ కుటుంబంలో ఒక వ్యక్తిగానే భావిస్తున్నామంటోంది యులియా.
‘శరీరాకృతి పరంగా కెఫిర్ ఒక మనిషిని పోలి ఉంటుంది.. అందుకే దీన్ని పెంపుడు జంతువులా కాకుండా.. వ్యక్తిగా, మా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తాం. అందం, ఆకారంతోనే కాదు.. తనకున్న మంచి అలవాట్లతోనూ మమ్మల్ని కట్టిపడేస్తుంటుంది కెఫిర్. ముఖ్యంగా మేము డిన్నర్ చేసేటప్పుడు మాతో పాటే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని.. మాకు కంపెనీ ఇస్తుంటుంది. అఫ్‌కోర్స్.. కెఫిర్‌కి కూడా ఓ ప్రత్యేకమైన కుర్చీ ఉందనుకోండి! ఇక నా ఛాతీపై పడుకొని నిద్ర పోవడమంటే తనకు చాలా ఇష్టం. ఇదెంతో స్మార్ట్.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది.. మనిషిలాగే వివిధ రకాల హావభావాలు ప్రదర్శించగలదు. కెమెరాతో ఫొటోలూ తీయగలదు. అంతేకాదు.. కొన్నిసార్లు కెఫిర్ చేష్టలు మాకు నవ్వు తెప్పిస్తుంటాయి కూడా! ఫ్లోటింగ్ షెల్ఫ్‌లు, కంప్యూటర్ మానిటర్, వాష్‌బేసిన్‌లో.. పడుకొని తను సేదదీరడం చూస్తే భలే ఫన్నీగా అనిపిస్తుంటుంది. ఇక మేమంతా సోఫాలో కూర్చొని టీవీ చూస్తే.. కెఫిర్ సోఫా పైకి ఎక్కి.. గారాబంగా తోక ఊపుతూ మరీ సినిమాల్ని ఎంజాయ్ చేస్తుంటుంది..’ అంటూ తన పెంపుడు పిల్లి గురించి చెబుతూ మురిసిపోతోందీ పెట్ లవర్.
‘సోషల్’ సెన్సేషన్!
తన పెట్‌తో ఎంతో సరదాగా ఎంజాయ్ చేసే యులియా.. ఓసారి కెఫిర్‌తో దిగిన ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో పిల్లి అందం, భారీ ఆకారాన్ని చూసి చాలామంది నెటిజన్లు ముగ్ధులయ్యారు. కొంతమంది.. ఇదంతా ఫొటోషాప్ మాయాజాలమంటూ కొట్టిపడేశారు. కానీ.. తాను మాత్రం రోజురోజుకీ స్మార్ట్‌గా, క్యూట్‌గా మారుతోన్న తన పిల్లి ఫొటోల్ని ఇన్‌స్టాలో పంచుకుంటూనే ఉంది యులియా. ఇలా ప్రస్తుతం కెఫిర్‌కు రష్యాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇటీవలే కెఫిర్ స్వయంగా తలుపు తీసుకొని.. బయట గార్డెన్‌లో ఆడుకుంటోన్న వీడియో తెగ వైరలైంది. మరోవైపు కెఫిర్ సోఫాలో సేదదీరుతూ, తన పిల్లలతో వంటింట్లో సహాయపడుతూ, క్రేజీగా కారు నడుపుతూ, పుట్టినరోజు చేసుకుంటున్నట్లు, మంచులో పోజిస్తూ.. ఇలాంటి తన పెట్ ఫన్నీ పోజుల్ని ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పంచుకుంటోంది యులియా.. ‘చాలామంది కెఫిర్ మాకు కావాలంటూ సందేశాలు పంపుతున్నారు. కానీ ఇది మా కుటుంబంలో ఓ భాగం. దీన్నెలా వదులుకుంటాం..? అంతగా కావాలంటే కెఫిర్‌తో ఫొటోలు దిగడానికి అనుమతిస్తాం..’ అంటూ తన ముద్దుల పెట్ గురించి సరదాగా చెబుతోంది యులియా.
మరి, గుబురుగా ఉండే జూలు, భారీ ఆకారంలో తెల్లగా మెరిసిపోతోన్న కెఫిర్ క్యూట్ లుక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.