ఏడేళ్ల శాన్వీ.. ఆ సినిమా చూసి ఎవరెస్ట్ ఎక్కేయాలనుకుంది!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ‘ఎవరెస్ట్’.. ఎత్తుతో పాటు దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే చాలామంది పర్వతారోహకులు ఈ శిఖరం అధిరోహించడాన్ని తమ లక్ష్యంగా పెట్టుకుంటారు. పంజాబ్‌కు చెందిన శాన్వీసూద్‌ అనే అమ్మాయి కూడా ఈ శిఖరం గురించి తెలిసిన.....

Published : 14 Jun 2022 21:00 IST

(Photos: Twitter)

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ‘ఎవరెస్ట్’.. ఎత్తుతో పాటు దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే చాలామంది పర్వతారోహకులు ఈ శిఖరం అధిరోహించడాన్ని తమ లక్ష్యంగా పెట్టుకుంటారు. పంజాబ్‌కు చెందిన శాన్వీసూద్‌ అనే అమ్మాయి కూడా ఈ శిఖరం గురించి తెలిసిన దగ్గర్నుంచి ఎలాగైనా సరే దానిని అధిరోహించాలనుకుంది. సాధారణంగా ఇలాంటి పెద్ద లక్ష్యాలను పెట్టుకున్నప్పుడు దానికోసం చిన్నప్పటి నుంచి సాధన చేసి కాస్త పెద్దయ్యాక వాటిని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. శాన్వీ మాత్రం దీనికి భిన్నంగా ఏడు సంవత్సరాల వయసులోనే ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ను చేరుకుంది. తద్వారా ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ను అధిరోహించిన పిన్న వయస్కురాలిగా ఘనత సాధించింది.

ఆ సినిమా స్ఫూర్తితో...

పంజాబ్‌కి చెందిన శాన్వీ సూద్ రెండో తరగతి చదువుతోంది. ఆమె తండ్రి హిమాచల్‌ ప్రదేశ్‌లో సివిల్ కాంట్రాక్టర్గా పని చేస్తున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని చూసిన శాన్వీ కొండలను ఎక్కడంపై ఇష్టం పెంచుకుంది. ఒక రోజు శాన్వీ టీవీలో ‘ఎవరెస్ట్‌’ చిత్రాన్ని చూసింది. అప్పట్నుంచి ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాలని నిశ్చయించుకుంది. అనుకుందే తడవుగా తండ్రితో తన మనసులోని కోరికను చెప్పింది. అయితే ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించడానికి తన వయసు సరిపోదని తెలియడంతో నిరాశ చెందింది. దాంతో ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్ (5364 మీటర్లు) వరకైనా వెళ్దామని అనుకుంది. బేస్‌ క్యాంప్‌ని చేరుకోవడానికి కనీస వయసు ఏడు సంవత్సరాలే. దాంతో తండ్రి దీపక్‌తో కలిసి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

బలమైన గాలులను తట్టుకొని...

ఎవరెస్ట్ శిఖర అధిరోహణలో బేస్ క్యాంప్‌ అయినా సరే అసాధారణ పరిస్థితులను దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఎత్తుకి వెళ్లే కొద్దీ ప్రాణవాయువు తగ్గుతుంటుంది. దీనికి తోడు చలి, బలమైన గాలులు వీస్తుంటాయి. ఇక వెళ్లే మార్గంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. కానీ, శాన్వీ వేటినీ లెక్క చేయలేదు. ఎంతో ధైర్యంతో గమ్యం వైపు పయనించింది. ఈ క్రమంలో దాదాపు 65 కిలోమీటర్ల ట్రాక్‌ని దాటి ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ని చేరుకుంది. ఈ క్రమంలో బేస్‌ క్యాంప్‌పై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. తద్వారా ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ని అధిరోహించిన పిన్న వయస్కురాలిగా ఘనత సాధించింది. బేస్‌ క్యాంప్‌ చేరుకోవడానికి శాన్వీకి తొమ్మిది రోజులు పట్టింది.

ఈ సందర్భంగా శాన్వీ తండ్రి మాట్లాడుతూ ‘ఎవరెస్ట్‌’ సినిమాతో శాన్వీ స్ఫూర్తి పొందింది. నేను హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్నప్పుడు తనకు పర్వతారోహణపై ఆసక్తి కలిగింది. ఆ సినిమా చూసిన తర్వాత నాతో పాటు చిన్న చిన్న కొండలను ఎక్కింది. అలా ఒక రోజు ఎవరెస్ట్ ఎక్కుదామని అడిగింది. అయితే ఏడేళ్ల వయసున్న పిల్లలను బేస్ క్యాంప్‌ దాటి పైకి ఎక్కనివ్వరు. అంతేకాదు.. అందుకు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ముందు బేస్ క్యాంప్ వరకైనా పూర్తి చేయాలనుకుంది’ అని చెప్పారు. శాన్వీకి సైక్లింగ్, స్కేటింగ్ లో కూడా ప్రవేశం ఉండడం గమనార్హం.

శాన్వీ కంటే కొన్ని రోజుల ముందే దక్షిణ ముంబయి వర్లి ప్రాంతానికి చెందిన రిథమ్‌ మమానియా అనే అమ్మాయి ఈ ఫీట్‌ని సాధించింది. రిథమ్‌ పదేళ్ల వయసులో తన తల్లిదండ్రులతో కలిసి ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ని చేరుకుంది. ఇందుకు ఆమెకు 11 రోజుల సమయం పట్టింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్