Published : 01/07/2022 18:57 IST

గర్భిణిగా ఉన్నప్పుడు ప్రయాణాలా..? ఇవి గుర్తుపెట్టుకోండి!

గర్భం ధరించామని తెలియగానే కొంతమంది తమ పనులు తాము చేసుకోవడానికి కూడా వెనకా ముందూ అవుతుంటారు. ఇంకొంతమందైతే అత్యవసర పరిస్థితుల్లో తప్ప డెలివరీ అయ్యే దాకా ప్రయాణాలు కూడా మానుకుంటారు. ఇలా తమ పనుల వల్ల కడుపులోని బిడ్డకు ఏదైనా అసౌకర్యం కలుగుతుందేమో అని జాగ్రత్తపడుతుంటారు కాబోయే అమ్మలు. అయితే ప్రెగ్నెన్సీ అనేది అనారోగ్యం కాదని, ఈ క్రమంలో శరీరం, ఆరోగ్యం సహకరిస్తే ఎవరికి వారు అన్ని పనులు చేసుకోవచ్చని, తద్వారా మరింత చురుగ్గా ఉండగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. గర్భంతో ఉన్నప్పుడు ప్రయాణాలు కూడా చేయచ్చని, అయితే అందుకు ముందుగా డాక్టర్‌ సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక దీంతో పాటు ప్రయాణం చేయాలనుకునే గర్భిణులు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించడం అన్ని విధాలా శ్రేయస్కరమంటున్నారు. మరి, ఇంతకీ అవేంటో తెలుసుకుందాం రండి..

మన శరీరంలో ఉండే ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ గర్భాశయానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ క్రమంలో గర్భాశయ ముఖద్వారాన్ని బిగుతుగా ఉంచడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఫలితంగా మెట్లెక్కడం, ప్రయాణాలు, చిన్నపాటి వ్యాయామాలు.. వంటివి చేయడం వల్ల పిండానికి ఎలాంటి ఇబ్బందీ కలగదని చెబుతున్నారు నిపుణులు. అయితే గర్భం ధరించిన మహిళల్లో ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. ఈ క్రమంలో కొందరు చురుగ్గా ఉంటే.. మరికొందరు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. ఏదేమైనా కాబోయే అమ్మలు మాత్రం ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు నిపుణులు.

తేలికైన ఆహారం.. సౌకర్యవంతమైన దుస్తులు!

గర్భం ధరించిన మహిళల్లో వికారం, వాంతులు.. వంటి లక్షణాలు కొన్ని నెలల పాటు కొనసాగుతాయి. అందుకే ప్రయాణాల్లో ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే సులభంగా జీర్ణమయ్యే పోషకాహారాన్ని తక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రయాణ సమయంలోనూ తేలికపాటి ఆహారమే మంచిది.

మధ్యమధ్యలో తినడానికి వీలుగా ఇంటి నుంచే ఆరోగ్యకరమైన స్నాక్స్‌, పండ్లు, ఇతర పదార్థాలు తీసుకెళ్లడం మంచిది. పైగా కరోనా భయం ఇంకా అలాగే ఉంది కాబట్టి ఇంట్లో వండిన ఆహారమే సురక్షితం కూడా! అలాగే మాస్క్‌, శానిటైజేషన్‌, సామాజిక దూరం పాటించడం.. వంటివి మరవద్దు.

మీ ప్రెగ్నెన్సీ రిపోర్టులు, డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్స్‌, మందులు.. వంటివన్నీ ఎప్పుడూ మీ బ్యాగ్‌లో మీతో పాటే ఉంచుకోవాలి. తద్వారా ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే వెంటనే అక్కడికి దగ్గర్లోని ఆస్పత్రిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవచ్చు.

ఓ నీళ్ల బాటిల్‌ను వెంట ఉంచుకోవడమూ మరవద్దు. అలాగే మధ్యమధ్యలో వీలుంటే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో నీటి స్థాయులు పడిపోకుండా ఉంటాయి.. అలాగే శరీరానికి తక్షణ శక్తి కూడా వస్తుంది. ఇక పండ్ల రసాలు తాగాలనుకున్న వారు ఇంటి నుంచే తయారుచేసి పట్టుకెళ్లడం ఉత్తమం.

ప్రయాణాల్లో బిగుతైన దుస్తులు కాకుండా వదులుగా, సౌకర్యవంతంగా ఉండే బట్టలు వేసుకోవడం మంచిది. తద్వారా కూర్చున్నా ఇబ్బందిగా అనిపించదు. అలాగే చెప్పుల విషయంలోనూ ఫ్లాట్స్‌ని ఎంచుకుంటే కంఫర్టబుల్‌గా నడవడానికి వీలవుతుంది.

ఇక మధ్యమధ్యలో టాయిలెట్స్‌కి వెళ్లే వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ క్రమంలో ఆయా వాష్‌రూమ్స్‌ డోర్స్‌, నాబ్స్‌ని తాకినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడానికి వీలుగా మీ వెంటే ఓ మినీ హ్యాండ్‌వాష్‌ బాటిల్‌ను ఉంచుకోవడం మంచిది. అలాగే మధ్యమధ్యలో చేతులు శానిటైజ్ చేసుకోవాలి.

జెస్టేషనల్‌ డయాబెటిస్‌ లేదంటే మల్టిపుల్‌ ప్రెగ్నెన్సీ (కవలలు, ట్రిప్లెట్స్‌కు జన్మనివ్వబోయే తల్లులు).. ఉన్న వారు విమానాల్లో ప్రయాణించకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. అలాగే గర్భం ధరించి 35 వారాలు దాటిన వారు కూడా విమాన ప్రయాణానికి నో చెప్పడమే మంచిదట! ఎందుకంటే ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రి-మెచ్యూర్‌ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట!

ఇక కారులో వెళ్లే వారు సీట్‌బెల్టు పెట్టుకోవడం, మధ్యమధ్యలో ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్రదేశంలో వాహనాన్ని ఆపి కాసేపు రిలాక్సవడం, అటూ ఇటూ తిరగడం వల్ల ప్రయాణ అలసటను దూరం చేసుకోవచ్చు.


ఈ సమస్యలుంటే వద్దే వద్దు!

అయితే కొన్ని అనారోగ్యాలున్న గర్భిణులు మాత్రం ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో..

గతంలో గర్భస్రావం లేదా ప్రి-మెచ్యూర్‌ డెలివరీ అయిన వారు

గర్భాశయంలో ఏదైనా సమస్యలుంటే..

గర్భం దాల్చిన తొలి నెలల్లో రక్తస్రావం లేదా ఇతర సమస్యలెదురైతే..

ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ (గర్భాశయం వెలుపల పిండం పెరగడం), లేటు వయసులో గర్భం ధరించడం, కవలలు లేదా ట్రిప్లెట్స్‌ తమ గర్భంలో పెరుగుతున్నప్పుడు (మల్టిపుల్‌ ప్రెగ్నెన్సీ).. ఇలాంటి వారు ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు మానుకోవడమే ఉత్తమమట!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని