Wedding Photoshoot: ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?

పెళ్లి జ్ఞాపకాల్ని వైవిధ్యంగా, కొత్తగా భద్రపరచుకోవాలని ఆరాటపడుతున్నారు ఈతరం జంటలు. ఇందుకు ప్రతిగానే వెడ్డింగ్‌ ఫొటోషూట్స్‌కి ఆదరణ పెరిగింది. అందులోనూ రియాల్టీకి దగ్గరగా ఉండే క్యాండిడ్‌ ఫొటోగ్రఫీ కోసం ఎంతటి సాహసాలు చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఇదే కొన్నిసార్లు కొంపముంచుతుందని.....

Published : 10 Apr 2022 14:16 IST

పెళ్లి జ్ఞాపకాల్ని వైవిధ్యంగా, కొత్తగా భద్రపరచుకోవాలని ఆరాటపడుతున్నారు ఈతరం జంటలు. ఇందుకు ప్రతిగానే వెడ్డింగ్‌ ఫొటోషూట్స్‌కి ఆదరణ పెరిగింది. అందులోనూ రియాల్టీకి దగ్గరగా ఉండే క్యాండిడ్‌ ఫొటోగ్రఫీ కోసం ఎంతటి సాహసాలు చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఇదే కొన్నిసార్లు కొంపముంచుతుందని ఇటీవల జరిగిన ఓ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. కేరళలోని కడియంగడ్‌కు చెందిన రెజిల్‌, కార్తీక దంపతులు పోస్ట్‌ వెడ్డింగ్‌ షూట్‌లో భాగంగా నదిలో ఫొటోలు దిగుతుండగా.. నీట మునిగి షూట్‌ కాస్తా విషాదాంతంగా మారింది. ఇదనే కాదు.. ఇలాంటి అపశృతులు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి ఫొటోషూట్స్‌లో ఇలాంటి సాహసాలకు తావివ్వకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఒకవేళ ఇలాంటి షూటే మాకు కావాలనుకుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

ముందే ఓ అవగాహన!

అడ్వెంచరస్‌ ఫొటోషూట్స్‌లో భాగంగా.. నదులు, కొండ ప్రాంతాలు, అడవులు.. వంటి లొకేషన్లను ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు చాలామంది. నిజానికి ఇలాంటి ప్రదేశాల్లో షూట్‌ చేయించుకోవడం వల్ల మీ వెడ్డింగ్‌ ఆల్బమ్‌ వైవిధ్యంగా ఉండచ్చు.. కానీ ప్రమాదం పొంచి ఉన్న ఇలాంటి లొకేషన్లను షూట్‌ కోసం ఎంచుకునే ముందు.. ఆ ప్రదేశం గురించి ముందే పూర్తి అవగాహన పెంచుకోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలను చాలా వరకు నియంత్రించచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీరు ఎంచుకున్న ఫొటోగ్రాఫర్‌తో పాటు గైడ్‌ సహాయం తీసుకోవడం కూడా మంచిదే. ముందే ఆయా ప్రదేశాల వద్దకు వెళ్లి.. మీరు ఎక్కడైతే స్నాప్స్‌ తీయించుకోవాలనుకుంటున్నారో అక్కడ ఏవైనా ప్రమాదాలు పొంచి ఉన్నాయేమో జాగ్రత్తగా పరిశీలించండి. లేవని నిర్ధారించుకున్న తర్వాత ముందే ఒకటి రెండుసార్లు అక్కడ రిహార్సల్స్‌ చేయండి. తద్వారా కొత్త ప్రదేశం గురించి ఓ అవగాహన వస్తుంది. ఫలితంగా ప్రమాదపు ముప్పు తప్పడంతో పాటు షూట్‌ కూడా మీరు అనుకున్నట్లుగా నేచురల్‌గా వస్తుంది.

వాటికి దూరంగా..!

కొంతమందికి వైల్డ్‌లైఫ్‌ వెడ్డింగ్‌ ఫొటోగ్రఫీ అంటే ఇష్టముంటుంది. అంటే.. వన్యప్రాణులుండే చోటికి వెళ్లి షూట్‌ తీయించుకోవమన్నమాట! ఈ క్రమంలో జంతువులకు దగ్గరగా, వాటి తల నిమురుతున్నట్లుగా, ఒళ్లో కూర్చోబెట్టుకున్నట్లుగా.. ఇలా సాహసోపేతమైన పోజులు ప్రయత్నిస్తుంటారు. నిజానికి ఇది చాలా డేంజర్‌ అంటున్నారు నిపుణులు. కాబట్టి మీరు ఈ తరహా బ్రాక్‌గ్రౌండ్‌ను ఎంచుకున్నా.. ఎలాంటి ప్రమాదం జరగకుండా మీ షూటింగ్‌ స్పాట్‌ దూరంగా ఉండేలా జాగ్రత్తపడాలి. కావాలంటే జూమ్‌ చేసి స్నాప్‌ తీయడం వల్ల కూడా ఫొటోలు రియాల్టీకి చాలా దగ్గరగా వస్తాయి. అలాగే ఇలాంటి షూట్స్‌ ప్లాన్‌ చేసుకున్నట్లయితే అక్కడి అటవీ అధికారుల అనుమతి, అవసరమైతే వారి సహాయం తీసుకుంటే మరీ మంచిది.

ప్రదేశానికి తగ్గట్లుగానే..!

పెళ్లి ఫొటోషూట్‌ కోసం సాహసోపేతమైన ప్రదేశాల్ని ఎంచుకున్నప్పుడు.. అక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే.. షూట్‌ కోసం ఎంచుకునే దుస్తులతో పాటు కొన్ని సురక్షితమైన వస్తువులు కూడా వెంట ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. కొండ శిఖరంపై షూట్‌ అయితే.. సులభంగా కొండలెక్కడానికి వీలుగా బూట్లు, ట్రెక్కింగ్‌ పోల్స్‌ వెంట తీసుకెళ్లాలి. అదే సడెన్‌గా వర్షం వస్తే తడవకుండా ఉండేందుకు రెయిన్‌ కోట్‌ మంచి ప్రత్యామ్నాయం. అలాగే ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోతే మునిగిపోకుండా ఉండేందుకు వాటర్‌ ప్రూఫ్‌ జాకెట్లు వెంట ఉండాల్సిందే! ఇలా ప్రదేశాన్ని బట్టి మీరు ఎంచుకునే ఈ సేఫ్టీ కిట్స్‌తో ఓ స్నాప్‌ క్లిక్‌మనిపిస్తే.. అదీ మీ వెడ్డింగ్‌ ఆల్బమ్‌లో ఓ జ్ఞాపకంగా ఉండిపోతుంది. అలాగే మిమ్మల్ని కొన్ని ప్రతికూల పరిస్థితుల నుంచి సురక్షితంగా ఉంచుతుంది.

సహాయం తీసుకోవడంలో తప్పులేదు!

షూట్‌ జరిగే ప్రదేశాల్లో జంటతో పాటు ఓ ఫొటోగ్రాఫర్‌ మాత్రమే ఉండడం మనం చూస్తుంటాం. అయితే ఈ క్రమంలో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్లను రక్షించే వారు ఎవరూ లేకపోవడంతో ప్రాణాల మీదకొస్తుంది. అందుకే మీరు ఎంచుకునే షూట్‌ను బట్టి ఆయా ప్రదేశాల్లో అందుబాటులో ఉండే సిబ్బందిని సైతం మీ వెంటే తీసుకెళ్లండి. ఉదాహరణకు.. నదిలో షూట్‌ అనుకుంటే.. ఈత వచ్చిన వారిని, అడవిలో అయితే అటవీ సిబ్బందిని.. ఇలా వీరి సహాయం తీసుకోవడంలో తప్పు లేదు. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో నుంచి ఒకరు లేదా ఇద్దరిని మీతో పాటు షూటింగ్‌ స్పాట్‌కు తీసుకెళ్లచ్చు.

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రమాదం జరగదన్న గ్యారంటీ కూడా ఒక్కోసారి ఇవ్వలేం. కాబట్టి ఇలాంటి సాహసకృత్యాల్లో పాల్గొని ప్రమాదాలు కొని తెచ్చుకునే బదులు.. మన ఇంటి ఆవరణలో, పచ్చటి ప్రకృతి మధ్య ఉండే లొకేషన్లను ఎంచుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు.. పైగా ఫొటోలు కూడా రియాల్టీకి దగ్గరగా వస్తాయి. మరి, ఈ విషయంలో మీరేమంటారు? అడ్వెంచరస్‌ ఫొటోగ్రఫీపై మీ స్పందనేంటి? Contactus@vasundhara.net వేదికగా మాతో పంచుకోండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్