అలలతో సావాసం... అలుపెరగని పోరాటం!

ఒక్కసారిగా ఎగిసిపడే అలలు... అనుక్షణం మారిపోయే గాలివాటం. ఎప్పుడెలా మారుతుందో అంచనా వేయలేని వాతావరణం... వాటిని తట్టుకోలేక ఇబ్బందిపడే శరీరం... ఈ సవాళ్లను ఎదుర్కొంటూనే పడవను ముందుకు నడిపించాలి. వీటన్నింటినీ ప్రేమించింది కాబట్టే... నాలుగేళ్లలో ప్రపంచ పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదిగింది... మాన్యారెడ్డి.

Updated : 14 Jun 2024 07:24 IST

ఒక్కసారిగా ఎగిసిపడే అలలు... అనుక్షణం మారిపోయే గాలివాటం. ఎప్పుడెలా మారుతుందో అంచనా వేయలేని వాతావరణం... వాటిని తట్టుకోలేక ఇబ్బందిపడే శరీరం... ఈ సవాళ్లను ఎదుర్కొంటూనే పడవను ముందుకు నడిపించాలి. వీటన్నింటినీ ప్రేమించింది కాబట్టే... నాలుగేళ్లలో ప్రపంచ పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదిగింది... మాన్యారెడ్డి. తాజాగా పోర్చుగల్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌కి సిద్ధమవుతోన్న ఈ తెలుగు తేజాన్ని ‘వసుంధర’ పలకరించింది.

సెయిలింగ్‌తో పరిచయం ఎప్పట్నుంచో ఉంది. అయితే అది చూడటం వరకే! సరదాగా ప్రయత్నించాకే దానిపై మనసు పారేసుకున్నా. మాది హైదరాబాద్‌. కానీ నేను పుట్టింది అమెరికాలోని బోస్టన్‌లో. నాన్న సునీల్‌ ఉద్యోగరీత్యా కొన్నాళ్లు అక్కడున్నాం. ఆయన ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌. అమ్మ దీప్తిరెడ్డి ఫిజియోథెరపిస్ట్‌. నేను మూడో తరగతిలో ఉన్నప్పుడు భారత్‌కి తిరిగొచ్చాం. సికింద్రాబాద్‌ సెయిలింగ్‌ క్లబ్‌కి అమ్మానాన్నలతో కలిసి వెళుతుండేదాన్ని. ఓసారి ఇలాగే సెయిలింగ్‌ క్యాంప్‌కి వెళ్లినపుడు అమ్మ స్నేహితురాలు ‘నువ్వూ ప్రయత్నించు’ అని ప్రోత్సహించారు. తీరా చేశాక అది నన్ను బాగా ఆకట్టుకుంది. దీంతో కొనసాగించాలన్న కోరిక బలంగా నాటుకుపోయింది. అదే ఇంట్లో చెబితే కంగారుపడ్డారు. ఆ వాతావరణం పడదు, చదువుకీ సమస్యలు వస్తాయని వాళ్ల భయం. రెంటినీ సమన్వయం చేసుకుంటానని మాట ఇచ్చాక ఒప్పుకొన్నారు.

మూడో సెయిలర్‌...

తొలిరోజు నీళ్లల్లోకి దిగడం నాకిప్పటికీ గుర్తే. భయం, కంగారు ఏమీ అనిపించలేదు. కారణం నాకు నీటితో సావాసం ఉండటమే! చిన్నప్పట్నుంచీ ఈత నేర్చుకున్నా. ఇంటర్‌ స్కూల్‌ కాంపిటీ¨షన్లలో పతకాలూ సాధించా. సెయిలింగ్‌లో చేరాక దాన్ని ఆపేశా కానీ... ఆ అనుభవం నాకు చాలా సాయపడింది. తొలిరోజుల్లో హుస్సేన్‌సాగర్‌లో సాధన చేసేదాన్ని. నా తొలి పతకాన్నీ అక్కడే సాధించా. హుస్సేన్‌సాగర్‌లో జరిగిన మాన్‌సూన్‌ రిగెటాలో... గ్రీన్‌ఫీట్‌లో వెండి పతకం గెలుచుకున్నా. తరవాత కాలిఫోర్నియాలో 18 ఏళ్లలోపు వారు నడిపే లేజర్‌ (ఇల్కా-4) బోటింగ్‌లో శిక్షణ తీసుకున్నా. కార్వార్‌ సెయిలింగ్‌ పోటీలు, థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియన్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్, మలేసియా లంకావి ఇంటర్నేషనల్‌ రిగెటాల్లోనూ పతకాలు అందుకున్నా. ఇటీవల షిల్లాంగ్‌లో జరిగిన నేషనల్‌ రిగెటాలో కాంస్యం దక్కింది. జాతీయ స్థాయిలో మూడో సెయిలర్‌గానూ గుర్తింపు పొందా.

పడవ తలకిందులైంది...

శారీరకంగానే కాదు, మానసికంగానూ దృఢంగా ఉంటేనే సెయిలింగ్‌లో రాణించగలం. దానికి వాతావరణమూ సహకరించాలి. అయితే ఈత నేర్చుకోవడం వల్ల నీళ్లంటే భయముండేది కాదు. పైగా సెయిలింగ్‌ చేసేటప్పుడు సముద్రంలో జెల్లీ ఫిష్, చేపలు లాంటివి కనిపిస్తోంటే చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. కానీ ఓసారి మైసూరులో సాధన చేస్తున్నప్పుడు ఒక్కసారిగా అలలు పెరిగాయి. దీంతో పడవ తలకిందులైంది. ఎంత ప్రయత్నించినా యథాస్థితికి తీసుకురాలేకపోయా. ఆ క్షణం చాలా భయపడ్డా. సకాలంలో కోచ్‌ గుర్తించడంతో క్షేమంగా భయపడ్డా. తొలిరోజుల్లో ఆటనీ, చదువునీ సమన్వయం చేసుకోవడం కష్టమైంది. అనారోగ్యాలూ చుట్టుముట్టాయి. తృటిలో తప్పిన విజయాలూ బోలెడు. కానీ నన్ను నేను దృఢపరుచుకుంటూ, మెలకువలు నేర్చుకుంటూ వచ్చా. ఉపాధ్యాయులు అండగా నిలిచారు. నా ఫిట్‌నెస్, ఆహారవిషయాలన్నీ అమ్మే దగ్గరుండి చూసుకుంటుంది. ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే సాయంగా ఉండొచ్చని నాకోసం బోటింగ్‌ కూడా నేర్చుకుంది. ఇవన్నీ నాలో ముందుకెళ్లాలన్న స్ఫూర్తిని రగిల్చాయి. అందుకే మరింత కఠినంగా సాధన మొదలుపెట్టా. ఫలితమే పోర్చుగల్‌లో జరిగే వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడే అవకాశం. ప్రపంచవ్యాప్తంగా 140 మంది అమ్మాయిలు ఎంపికైతే, దేశం నుంచి ఇద్దరికి అవకాశం వచ్చింది. అందులో నేనొకరిని. జూన్‌లో జరిగే ఈ పోటీలకోసం స్పెయిన్‌లో సాధన చేస్తా. నా భవిష్యత్తు కోసం అమ్మానాన్నలు ఎన్నో త్యాగాలు చేశారు. మరిన్ని విజయాలతో వారికి పేరు తేవాలన్నదే నా కల.

మంత్రి భాస్కర్, ఈటీవీ


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911 కు వాట్సప్, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్