సాఫ్ట్‌వేర్‌ యువతి... దుస్తుల వ్యాపారం!

ఇప్పుడు వ్యాపారమంతా అంతర్జాతీయ స్థాయిలోనే! మీటింగ్‌లు, క్లయింట్లతో ఒప్పందాలు సర్వసాధారణం. దీంతో చాలావరకూ సంస్థలు ‘అఫీషియల్‌ వేర్‌’ తప్పనిసరి అనేస్తుంటాయి. ఇందుకోసం మనవాళ్లు విదేశీ బ్రాండ్లనే ఆశ్రయిస్తుండటం గమనించింది దీప్తి తోలానీ.

Updated : 08 Jul 2024 04:11 IST

ఇప్పుడు వ్యాపారమంతా అంతర్జాతీయ స్థాయిలోనే! మీటింగ్‌లు, క్లయింట్లతో ఒప్పందాలు సర్వసాధారణం. దీంతో చాలావరకూ సంస్థలు ‘అఫీషియల్‌ వేర్‌’ తప్పనిసరి అనేస్తుంటాయి. ఇందుకోసం మనవాళ్లు విదేశీ బ్రాండ్లనే ఆశ్రయిస్తుండటం గమనించింది దీప్తి తోలానీ. మనకంటూ దేశీ సంస్థ ఉంటే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో వ్యాపారం మొదలుపెట్టి, రూ.కోట్ల పెట్టుబడులను అందుకుంటోంది. తన ప్రయాణమిది..

ఓ సాధారణ అమ్మాయికి విదేశీ సంస్థలో ఉద్యోగం ఎంత గొప్ప? కానీ దీప్తి అలా ఆలోచించలేదు. ఒకరి కింద పనిచేయడం కాదు, మరికొందరికి ఉద్యోగమిచ్చే స్థాయికి ఎదగాలనుకుంది. ఈమెది గోవా. ఈ ఆలోచనకు కారణం నాన్నే అంటుందీమె. ఆయనెప్పుడూ కొత్త రంగాలు, ఎలా వ్యాపారం చేయొచ్చు... అనే వాటి గురించే మాట్లాడేవారట. కొత్త ప్రయోగాలెన్నో చేసేవారు. అలా వ్యాపారవేత్త అవ్వాలన్న కల చిన్నప్పుడే నాటుకుందీమెలో. ఇంజినీరింగ్‌ చేశాక పుణెలో ఉద్యోగం కూడా చేసింది దీప్తి. తర్వాత యూఎస్‌లోని ఫిన్‌టెక్‌ సంస్థలో ఉద్యోగం రావడంతో అక్కడికెళ్లింది. ‘ఆఫీసుకైనా, క్లయింట్‌ మీటింగైనా ‘అఫీషియల్‌ వేర్‌’ తప్పనిసరి. సూట్లు, బ్లేజర్లు, స్కర్టులన్నింటికీ విదేశీ బ్రాండ్లపైనే ఆధారపడాలి. మన అభిరుచులు, శరీరదార్ఢ్యం విదేశీయులతో పోలిస్తే భిన్నం. పదే పదే సైజు చేయించుకోవడమూ విసుగే. ఇక్కడున్న నాదే కాదు, దేశంలో ఉండి, విదేశీ సంస్థల కోసం పనిచేస్తున్న వారిదీ ఇదే సమస్య అని అర్థమయ్యాక దీన్నే వ్యాపారంగా మలుచుకోవాలన్న ఆలోచన వచ్చింది’ అంటుంది దీప్తి.

నిజానికి అప్పటివరకూ తనకు అనుభవమున్న సాఫ్ట్‌వేర్‌ రంగంలోనే ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్న తను ఫ్యాషన్‌ రంగంలోకి మారడం ఒకరకంగా సాహసమే. అయినా ఉద్యోగం మాని, భారత్‌కి వచ్చేసింది. వస్త్రరకాలు, వాటి తయారీదారుల గురించి తెలుసుకొని, తర్వాత ఏవేవి సౌకర్యంగా ఉంటాయన్న దానిపై పరిశోధనకే దాదాపు రెండేళ్లు కేటాయించింది. నెట్‌వర్క్, డిజైనర్లు అంతా సమకూర్చుకొని, 2016లో గుడ్‌గావ్‌లో ‘సాల్ట్‌ అటైర్‌’ ప్రారంభించింది. చందేరి, ఆర్గంజా వంటి వాటితోనూ ఆఫీసులకు అనువైన దుస్తులను రూపొందించింది. ‘ఫ్యాషన్‌గా ఉండాలి. అలాగని మరీ బిగుతుగా ఉండకూడదు. ఖరీదు తక్కువ, సౌకర్యంగా ఉండాలి. మనవాళ్ల ఆలోచనలు ఇలానే ఉంటాయి. వాటిని దృష్టిలో ఉంచుకొనే డిజైన్లు రూపొందించా. తొలిరోజుల్లో జనాల్లోకి తీసుకెళ్లడమే ఇబ్బంది అయ్యింది. పరిచయం చేయడమే కాదు, కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ తీసుకొని వారికి నచ్చినవిధంగా చేసివ్వడం మొదలుపెట్టాం. అలా అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం యూఎస్, యూకే సహా ఎన్నోదేశాలకు మా వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి’ అనే దీప్తి ఆన్‌లైన్‌ అమ్మకాలతోపాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్టోర్లనీ ఏర్పాటు చేసుకుంది. తాజాగా రూ.వంద కోట్ల పెట్టుబడులనూ అందుకుంది. ‘చేసే పనేదైనా అవరోధాలు సహజం. అలాగని ఆగిపోతేనే సమస్య. ప్రతిదాన్నీ పాఠంగా మలుచుకొని సాగగలగాలి. కొత్తరంగంలో నిలదొక్కుకోవడానికి నేను అనుసరించిన సూత్రమిదే’ అంటోన్న దీప్తి ప్రయాణం స్ఫూర్తిదాయకమే కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్