Weight Loss: అలా 92 నుంచి 81 కిలోలకు తగ్గా..!

గర్భిణిగా ఉన్నప్పుడు, బిడ్డ పుట్టాక మహిళలు బరువు పెరగడం సహజమే! అయితే దీన్ని తగ్గించుకోవడమే కష్టమనుకుంటారు చాలామంది. కానీ గట్టిగా అనుకుంటే ఇదీ సాధ్యమే అంటోంది అందాల అమ్మ సమీరా రెడ్డి. తల్లయ్యాక కాస్త బరువు పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం దాన్ని తగ్గించుకునేందుకు కసరత్తులు చేస్తోంది.

Published : 14 Feb 2022 18:55 IST

(Photo: Instagram)

గర్భిణిగా ఉన్నప్పుడు, బిడ్డ పుట్టాక మహిళలు బరువు పెరగడం సహజమే! అయితే దీన్ని తగ్గించుకోవడమే కష్టమనుకుంటారు చాలామంది. కానీ గట్టిగా అనుకుంటే ఇదీ సాధ్యమే అంటోంది అందాల అమ్మ సమీరా రెడ్డి. తల్లయ్యాక కాస్త బరువు పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం దాన్ని తగ్గించుకునేందుకు కసరత్తులు చేస్తోంది. ఏడాది కాలంగా ఇదే లక్ష్యంపై దృష్టి పెట్టానని, ఇలాంటి సీరియస్‌నెస్‌ ఉంటే తప్పక ఫలితం దక్కుతుందంటోంది. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టా వేదికగా తన ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ని సైతం పంచుకుంది సమీర.

ఇద్దరు పిల్లల తల్లిగా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది బాలీవుడ్‌ మామ్‌ సమీర. ఇందుకు తన ఇన్‌స్టా పోస్టులే ప్రత్యక్ష ఉదాహరణలు. తన పిల్లలతో చేసే సరదా, అత్తగారితో చేసే అల్లరి, లైఫ్‌స్టైల్‌ వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంటుంది. మరోవైపు సందర్భం వచ్చినప్పుడల్లా బాడీ పాజిటివిటీకి సంబంధించిన స్ఫూర్తిదాయక పోస్టుల్ని కూడా షేర్‌ చేస్తుంటుంది. అంతేకాదు.. ‘ఫిట్‌నెస్‌ ఫ్రైడే’ పేరుతో తాను పాటించే ఫిట్‌నెస్‌ చిట్కాల్ని కూడా పంచుకుంటుందీ బ్యూటిఫుల్‌ మామ్.

11 కిలోలు తగ్గా!

2015లో హన్స్‌, 2019లో నైరా అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఆమె.. రెండుసార్లూ ప్రసవానంతరం బరువు పెరిగింది. అయితే ఈ క్రమంలో కొన్ని నెలల పాటు పూర్తిగా తన పిల్లల ఆలనా పాలనాకే సమయం కేటాయించింది. ప్రసవం తర్వాత తాను తిరిగి కోలుకోవడం పైనే దృష్టి పెట్టింది. అయితే ఈ క్రమంలో త్వరగా బరువు తగ్గి నాజూగ్గా మారాలని ఎప్పుడూ శరీరంపై ఒత్తిడి తీసుకురాలేదని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది సమీర. అయితే ఏడాది కాలంగా ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టానని, ఫలితంగా 11 కిలోలు తగ్గానంటూ తాను పాటిస్తోన్న ఫిట్‌నెస్‌ నియమాల్ని ఇలా పంచుకుంది.

ఇవే నా ఫిట్‌నెస్‌ సీక్రెట్స్!

‘ఏడాది కాలంగా ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టాను. తద్వారా అప్పుడు 92 కిలోల బరువున్న నేను ఇప్పుడు 81 కిలోలకు తగ్గాను. అయితే ఈ క్రమంలో బరువు తగ్గే ప్రక్రియ కాస్త నెమ్మదిగా కొనసాగుతున్నప్పటికీ నా శక్తిసామర్థ్యాలు, నాలో చురుకుదనం మరింతగా పెరిగాయి. ఇందుకోసం నేను పాటిస్తోన్న నియమాలేంటంటే..!

* బరువు తగ్గే క్రమంలో ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ (పరిమిత కాల ఉపవాసం) నాకు దోహదపడుతోంది. ముఖ్యంగా ఇది నేను అర్ధరాత్రి ఏది పడితే అది తినే అలవాటుకు చెక్‌ పెట్టింది.

* ప్రతికూల ఆలోచనలు రాకుండా జాగ్రత్తపడుతున్నా. మనసును ఎప్పుడూ సంతోషంగా, యాక్టివ్‌గా ఉంచుకుంటున్నా. తద్వారా నా శరీరం కూడా చురుగ్గా ఉంటోంది.

* ఫిట్‌నెస్‌ను బరువుగా కాకుండా సరదాగా చేస్తేనే పూర్తి ఫలితం పొందచ్చు. అందుకోసం నేను బాక్సింగ్‌, బ్యాడ్మింటన్‌.. వంటి ఆటల్ని నా ఫిట్‌నెస్‌ రొటీన్‌లో భాగం చేసుకుంటున్నా.

* సాధ్యమయ్యే పనుల్నే లక్ష్యంగా పెట్టుకుంటున్నా. అంతేకానీ.. వెంటనే బరువు తగ్గిపోవాలని నా శరీరంపై ఒత్తిడి తీసుకురావట్లేదు. ఎవరికైనా సరే.. త్వరగా బరువు తగ్గాలనుకోవడం ఆరోగ్యకరం కాదు.

* బరువు తగ్గే క్రమంలో స్వీయ ప్రేమ ముఖ్యం. దాన్ని కాదని ఇతరులతో పోల్చుకోవడం, మిమ్మల్ని మీరు అసహ్యించుకోవడం.. వంటివి చేస్తే ఒత్తిడి పెరిగిపోయి మొదటికే మోసం వస్తుంది.

* వీలైతే మీ భాగస్వామితో కలిసి వ్యాయామం చేయండి.. అలాగే వారానికోసారి బరువు తూచుకొని.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఈ విషయంలో నా భర్త అక్షయ్‌ వర్ధే నాకెంతో సహకరిస్తున్నారు.

* ఫిట్‌నెస్‌ విషయంలో అప్పుడప్పుడూ నేనూ ఏకాగ్రత కోల్పోతుంటా. అయితే ఆ వెంటనే దీన్ని గుర్తించి తిరిగి నా మనసును లక్ష్యం పైకి మళ్లిస్తా.

* అమ్మయ్యాక బరువు తగ్గి ఫిట్‌గా మారడమంటే అంత తేలిక కాదు. ఈ ప్రక్రియ నెమ్మదిగా జరగచ్చు.. తద్వారా మనపై మనకే కోపం రావచ్చు. ఇలాంటప్పుడే శరీరాన్ని క్షమించి లక్ష్యం వైపు అడుగేస్తే ఫలితం ఉంటుంది.

* హూలాహూప్‌ కేవలం వ్యాయామమే కాదు.. సరదానూ పంచుతుంది. అయితే ఎంత సాధన చేస్తే అంత త్వరగా ఇందులో ప్రావీణ్యం సంపాదించచ్చు. నిజానికి మొదట్లో దీన్ని ప్రాక్టీస్‌ చేయడం నాకూ సవాలుగా మారేది. కానీ పట్టుదలతో ప్రయత్నించా.. సక్సెసయ్యా!

* బరువు తగ్గడానికైనా, మానసిక ప్రశాంతతకైనా యోగా చేయడం తప్పనిసరి. ఇదీ నా ఫిట్‌నెస్‌ రొటీన్‌లో ఓ భాగమే!

* నచ్చని వ్యాయామాలు చేస్తూ శరీరాన్ని కష్టపెట్టుకోవడం కంటే.. నచ్చినవే ఎంచుకోండి. యోగా, డ్యాన్స్‌, రన్నింగ్‌.. వంటి సులభమైన వ్యాయామాలు కూడా చక్కటి ఫలితాల్ని అందిస్తాయి.

ఇలా బరువు తగ్గి ఫిట్‌గా మారడానికి తాను పాటిస్తోన్న కొన్ని చిట్కాల్ని పంచుకుంటూ ఎంతోమంది తల్లుల్లో స్ఫూర్తి నింపిందీ అందాల అమ్మ. మరి, ఇంకెందుకాలస్యం.. మనమూ ఇలాంటి ఓ చక్కటి ఫిట్‌నెస్‌ రొటీన్‌ని ప్రారంభించేద్దామా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్