Sania Mirza: సూపర్ సమంతా.. నీ స్ఫూర్తికి నేను ఫిదా!

ఆడపిల్లల పట్ల సమాజంలో ఇప్పటికీ కొన్ని ఆంక్షలు, కట్టుబాట్లు ఉన్నాయి. రాత్రిళ్లు గడప దాటకూడదని, కెరీర్‌ కంటే వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యమివ్వాలని, పురుషాధిక్య ప్రపంచానికి ఆమడ దూరంలో ఉండాలని.. ఇలాంటి ఆంక్షలెన్నో వారిని తమ కలల ప్రపంచానికి దూరం చేస్తున్నాయి. అయితే మనం సమాజానికి....

Updated : 07 May 2023 11:19 IST

(Photos: Instagram)

ఆడపిల్లల పట్ల సమాజంలో ఇప్పటికీ కొన్ని ఆంక్షలు, కట్టుబాట్లు ఉన్నాయి. రాత్రిళ్లు గడప దాటకూడదని, కెరీర్‌ కంటే వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యమివ్వాలని, పురుషాధిక్య ప్రపంచానికి ఆమడ దూరంలో ఉండాలని.. ఇలాంటి ఆంక్షలెన్నో వారిని తమ కలల ప్రపంచానికి దూరం చేస్తున్నాయి. అయితే మనం సమాజానికి నచ్చినట్లుగా కాకుండా.. మనకు నచ్చినట్లుగా ఉన్నప్పుడే ఎదగగలమంటోంది టాలీవుడ్‌ అందాల తార సమంత. అమ్మాయిలు-మహిళల్లో స్ఫూర్తి నింపే నేపథ్యంలో ఇటీవలే రూపుదిద్దుకున్న ఓ ప్రకటనలో నటించిన సామ్‌.. తన నటన, స్ఫూర్తిదాయక డైలాగులతో ఎంతోమంది మహిళల్లో ప్రేరణ కలిగించింది. వారిలో టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కూడా ఒకరు. ఈ క్రమంలో సామ్‌ను ప్రశంసిస్తూ తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

అమ్మాయిలు, మహిళలపై సమాజంలో నెలకొన్న మూసధోరణుల్ని స్ఫూర్తిగా తీసుకొని సినిమాలే కాదు.. పలు ప్రకటనల్ని కూడా రూపొందిస్తుంటాయి ఆయా సంస్థలు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ శీతల పానీయ సంస్థ ఇటీవల ఓ యాడ్‌ చిత్రీకరించింది. అందులో సమంత నటించింది.

ఇంతకీ యాడ్‌లో ఏముందంటే..?!

ఈ సమాజంలో ఆడవారి పట్ల ఉన్న మూసధోరణుల్ని ప్రతిబింబిస్తూ, వాటిని తిప్పి కొట్టే డైలాగులతో సాగుతుందీ యాడ్‌. ఇందులో భాగంగా సమంత మొత్తం మూడు పాత్రల్లో కనిపిస్తుంది..

మొదట పెళ్లికూతురిగా దర్శనమిస్తూ.. ‘అమ్మాయిలంటే అందరికీ ఏదో ఒక సమస్య’ అనగానే.. ఆ పెళ్లికి హాజరైన ఓ మహిళ.. ‘అనుకున్న సమయానికి అమ్మాయిల పెళ్లి అయిపోవాలి..’ అంటుంది. దానికి సమంత స్పందిస్తూ.. ‘అనుకున్న సమయానికి కాదు.. నచ్చినప్పుడు చేసుకోవాలి..’ అంటూ ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ విసురుతుంది.

ఇక రెండోసారి మోడ్రన్‌ డ్రస్‌లో ముస్తాబై అటువైపుగా వస్తున్న సమంతను చూసిన గార్డ్.. ‘ఏ పని అర్ధరాత్రి 12 గంటలకు పూర్తవుతుంది?’ అనడుగుతాడు. దానికి స్పందిస్తూ.. ‘12 గంటలకు కూడా పూర్తవదు..’ అంటూ ఆడపిల్లలు పగలే కాదు.. రాత్రుళ్లూ ధైర్యంగా గడప దాటగలరు, అన్ని పనులు చేయగలరు.. అనే అర్థం వచ్చేలా డైలాగ్‌ చెబుతుంది సామ్.
ఇక మరో సన్నివేశంలో భాగంగా.. యాక్షన్‌ దుస్తుల్లో ఓ సినిమా సెట్‌లోకి వస్తున్న సమంతను చూసి ఆ సినిమా హీరో.. ‘యాక్షన్ అయితే హీరోనే చేస్తాడు కదా!’ అంటాడు. ‘కానీ ఈ సినిమాకు హీరో నేనే..’ అన్న డైలాగ్‌తోనే కాదు.. యాక్షన్‌ సీన్‌తోనూ అదరగొడుతుంది సమంత. ఆఖర్లో ‘అందరూ చెప్పేది వింటే.. నీకు నచ్చింది ఎప్పుడు చేసుకుంటావ్‌.. నువ్వు నీకు నచ్చినట్లు ఉండు.. #RiseUpBaby’ అనే అర్థవంతమైన డైలాగ్‌తో యాడ్‌ ముగుస్తుంది.


‘ఎంత దూరం వెళ్లగలదో చూద్దాం!’ అన్నారు!

మహిళలకు స్ఫూర్తిదాయకంగా ఉన్న ఈ ప్రకటనపై చాలామంది స్పందిస్తున్నారు. ‘మోటివేషనల్‌ యాడ్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిలో తానూ ఉన్నానంటోంది టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా. ఇదే యాడ్‌ను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేస్తూ.. తన కెరీర్‌లో తనకెదురైన విమర్శలు, చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుందామె.

‘ఈ యాడ్‌ చూశాక నా కెరీర్‌లోని గత జ్ఞాపకాలు నా మదిలో మెదిలాయి. నేను టెన్నిస్‌ను ఎంచుకున్నప్పుడు చాలామంది ‘ఇది మహిళల ఆట కాదు.. అలాంటప్పుడు ఈ క్రీడలో మహిళేం సాధించగలదు? ఎంత దూరం వెళ్లగలదు?’ అంటూ నిరుత్సాహకరంగా మాట్లాడారు. కానీ నేను వాళ్ల మాటలు పట్టించుకోలేదు.. నా కలను నమ్ముకున్నా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాను.. సక్సెసయ్యాను. నా పట్టుదల, అంకితభావం, సంకల్ప బలం ముందు ఇలాంటి సందేహాలు, విమర్శలు చిన్నబోయాయి. తమ కలల్ని సాకారం చేసుకునే క్రమంలో ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతోన్న యువతులు, మహిళలకు సామ్‌ నటించిన ఈ యాడ్‌ స్ఫూర్తిగా నిలుస్తుంది. నువ్వు సూపర్ సామ్‌.. #RiseUpBaby’ అంటూ అటు ప్రకటనను, ఇటు సమంత స్ఫూర్తిని కొనియాడిందీ హైదరాబాదీ.

విమర్శలే సోపానాలుగా..!

తన సుదీర్ఘ టెన్నిస్‌ కెరీర్‌కు ఇటీవలే వీడ్కోలు పలికిన సానియా.. మహిళల డబుల్స్‌ విభాగంలో ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ అందుకుంది. ఇతర జాతీయ, అంతర్జాతీయ పోటీల్లోనూ ఎన్నో మెడల్స్‌ సాధించింది. అయితే టెన్నిస్‌ క్రీడాకారిణిగా తన డ్రస్సింగ్‌ స్టైల్‌ విషయంలో, పాకిస్థానీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను వివాహమాడినప్పుడు జాతి వివక్ష పరంగా, పెళ్లయ్యాక కెరీర్‌లో సెటిలయ్యే విషయంలో, కొడుకు ఇజాన్‌ పుట్టాక తిరిగి సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించినప్పుడు.. ఇలా పలు సందర్భాల్లో ఆమెపై విమర్శలొచ్చాయి. అయినా అవేవీ పట్టించుకోకుండా తన ఆట పైనే పూర్తి దృష్టి పెట్టింది సానియా. పట్టుదలతో తాను సక్సెసవడంతో పాటు ఎంతోమంది యువతులకు మార్గనిర్దేశనం చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్