Updated : 14/01/2023 19:11 IST

పండగ వేళ.. మరింత అందంగా..!

పండగనగానే కొంచెం స్పెషల్‌గా కనిపించాలనుకోవడం సహజం. రోజూ కంటే మరింత అందంగా మెరిసిపోవాలనుకుంటాం. అందులోనూ సంక్రాంతి అంటే ఎంతో హడావిడి! మరి, ఈ పండగ వేళ ప్రత్యేకంగా కనిపించాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే..

ముచ్చటైన మోము కోసం..

అందం విషయంలో తొలి ప్రాధాన్యం ముఖానిదే! ఈ క్రమంలోనే ముఖం, కళ్లు, పెదాలు.. కళగా ఉంటేనే ముఖ సౌందర్యం ఇనుమడిస్తుంది. అందుకోసం ఈ చిట్కాలు పాటిస్తే సరి!

చివరి నిమిషంలో అందంగా కనపడాలన్న ఆలోచనతో కనుబొమ్మలు సరిచేయడం, ముఖంపై గల అవాంఛిత రోమాలను తొలగించడం చేయకూడదు. కనుబొమ్మలు మరీ ఎక్కువగా పెరిగాయనుకుంటే చుట్టూ ఉన్న కొన్ని వెంట్రుకలను మాత్రం తొలగించి, మిగిలిన వాటిని కన్సీలర్ సహాయంతో చర్మం రంగులో కలిసేలా చేయాలి. తద్వారా సహజసిద్ధంగా కనిపించే అవకాశం ఉంటుంది.

ఒకవేళ కళ్ల కింద నలుపు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే చల్లని పాలలో దూదిని ముంచి కళ్లపై పెట్టుకుని కాసేపు కునుకు తీయండి. అదే సమయంలో అందుబాటులో ఉన్న ఏదైనా ఒక పండు గుజ్జునో లేక టొమాటో రసాన్నో ముఖానికి, మెడకి ప్యాక్‌లా వేసుకుని ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే ఒకేసారి రెండు పనులూ పూర్తవుతాయి.

సరైన నిద్ర ముఖాన్ని మరింత కాంతివంతం చేస్తుందని మర్చిపోకండి. అందుకే ఎంత హడావిడిగా ఉన్నా నిద్ర సమయాన్ని మాత్రం తగ్గించకండి.

కాస్త ఉప్పు, చిటికెడు వంటసోడా కలిపి దంతాలను శుభ్రం చేసుకుంటే దంతాలు మిలమిలా మెరుస్తాయి.

పెదాలను చక్కెరతో స్క్రబ్ చేసి, కడిగిన తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

కురులు కూడా ముఖ్యమే!

హెయిర్ ప్యాక్ వేసుకునే సమయం లేకపోతే నాలుగు విటమిన్-ఇ ట్యాబ్లెట్లను కత్తిరించి, అందులోని లిక్విడ్‌ని మీ వెంట్రుకలకు సరిపడేంత కొబ్బరి నూనెలో కలిపి కుదుళ్ల నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి. ఆపై ఒక ఐదు నిమిషాలు మర్దన చేసి ఇరవై నిమిషాల తర్వాత షాంపూ చేసుకోవాలి. (కళ్లకు, ముఖానికి ప్యాక్ వేసుకున్న సమయంలోనే ఈ నూనెను కూడా అప్లై చేసుకోవడం వల్ల సమయం కలిసొస్తుంది.)

మృదువైన చేతులు, పాదాల కోసం..!

మెనిక్యూర్, పెడిక్యూర్ చేయించుకునే సమయం లేనప్పుడు చేతికి, కాలికి ఉన్న గోళ్లని షేప్ చేసుకుని, హెయిర్ మాస్క్ కోసం తయారు చేసుకున్న కొబ్బరి నూనె మిశ్రమాన్ని పట్టించాలి.

మడమలకి ఉన్న పగుళ్లని, మృత చర్మాన్ని స్క్రబ్బర్‌తో తొలగించాలి.

ఇందాక తయారు చేసుకున్న ఫేస్‌ప్యాక్‌ని గోళ్ల భాగం వదిలి.. కాళ్లు, చేతులకు రాసుకుని ఆరిన తర్వాత కడిగేయాలి. కడిగిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

ఈ చిట్కాలు పాటించడంతో పాటు మీకు నచ్చిన ట్రెడిషనల్ వేర్‌లో రడీ అయితే మీరే సంక్రాంతి లక్ష్మి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని