Updated : 16/01/2023 16:36 IST

సంకురాత్రి.. దేశమంతటా సందడే సందడి!

సంక్రాంతి పండగను తెలుగు ప్రజలు ఎంత సంబరంగా జరుపుకొంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటిరోజు భోగిమంటలు వేసి, వాటి దగ్గర చలి కాచుకుంటారు. బుజ్జి పాపాయిలకు భోగిపండ్లు పోస్తారు. రెండో రోజు రంగురంగుల ముగ్గులతో వాకిలంతా నింపేసి, కొత్త బట్టలు, చక్కెర పొంగలి, పిండివంటలు, పతంగులతో సందడి చేస్తారు. ఇక మూడోరోజు కూడా పండగ హడావిడి ఏమాత్రం తగ్గకుండా కనుమ జోరును కొనసాగిస్తారు. అయితే ఇదంతా తెలుగు రాష్ట్రాల్లో కనిపించే సంక్రాంతి సందడి. ఈ పండగను కేవలం ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల సంప్రదాయం ప్రకారం ఘనంగా నిర్వహిస్తారు.

సూర్య పొంగల్..!

తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే తమిళనాడులో కూడా సంక్రాంతి పండగను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా ఆ రాష్ట్రంలోని పల్లెటూళ్లలో సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటుతాయి. కొత్త పంట చేతికి వచ్చాక, రైతుల ఆనందోత్సాహాలకు ప్రతీకగా నిర్వహించే పొంగల్ రోజు సూర్యుణ్ని పూజిస్తారు. ఇలా జరుపుకొనే మూడురోజుల పండగలో మొదటిరోజును 'భోగి పొంగల్' అంటారు. ఆ రోజు రుచికరమైన వంటలు తయారుచేసుకొని, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. దానధర్మాలు చేస్తారు. రెండో రోజు 'సూర్య పొంగల్'. ఆ రోజు సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మూడో రోజును 'మట్టు పొంగల్' అని పిలుస్తారు. ఈ రోజున పాడిపశువులను అలంకరించి, పూజిస్తారు. పండగ సందర్భంగా చెన్నైలోని కందస్వామి ఆలయం నుంచి మొదలయ్యే రథయాత్ర వేడుక కన్నులపండువలా ఉంటుంది.

నోరూరించే కర్ణాటక 'ఎల్లు'..

చేతికందిన కొత్తపంటతో సంక్రాంతి రోజు సంబరాలు చేసుకునే ఆచారం కర్ణాటకలో కూడా కనిపిస్తుంది. అక్కడ ఈ పండగను 'సుగ్గి' అని పిలుస్తారు. మొదటి రోజు భగభగ మండే భోగిమంటల్లో చలి కాచుకుంటారు. ఇల్లంతా శుభ్రం చేసి, గోడలకు సున్నం వేస్తారు. సూర్యోదయం కాకముందే తలస్నానాలు ముగించి, ఇంటి ముందు ముగ్గులు వేసి, వాటి మధ్య పేడతో తయారుచేసిన 'గుగ్గిళ్లు' (గొబ్బెమ్మలు) పెడతారు. అలాగే సంక్రాంతి రోజు బియ్యప్పిండితో ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. మట్టికుండను కొని అందులో బియ్యం, బెల్లం, పప్పు, పాలు వేసి పొంగలి వండుతారు. ఈ వంటకాన్ని ముందు దేవుడికి నైవేద్యంగా పెట్టి, ఆ తర్వాత పాడిపశువులకు పెడతారు. కొన్ని ప్రాంతాల్లో ఆవు, గేదెల కొమ్ములను రంగులతో అలంకరిస్తారు. పండగ రోజు బెల్లం, తెల్లనువ్వులు, ఎండుకొబ్బరి, వేరుశెనగ, వేయించిన శెనగపప్పు కలిపి తయారుచేసిన 'సంక్రాంతి ఎల్లు' అనే ప్రత్యేక వంటకాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆరగిస్తారు. దీంతో పాటు గుమ్మడికాయ, చిలగడదుంపతో తయారుచేసిన చిత్రాన్నం, పాయసం, వడలు వంటి విభిన్న రకాల వంటకాలను కూడా సిద్ధం చేస్తారు. సాయంత్రం పూట ఎల్లుతో పాటు, ఎవరి పొలంలో పండిన చెరకు గడలను వారు ఇంటికి తెచ్చి, ఇరుగుపొరుగు వారితో పంచుకుంటారు. ఈ సంప్రదాయాన్ని కన్నడంలో 'ఎల్లు బిరోదు' అంటారు.

పతంగుల కోలాహలంలో మహారాష్ట్ర..

సంక్రాంతి దగ్గర పడుతుందంటే చాలు.. మహారాష్ట్రలో పతంగుల కోలాహలం మొదలైపోతుంది. పండగ రోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆకాశమంతా రంగురంగుల పతంగులతో సందడిగా ఉంటుంది. బెల్లం, నువ్వులు కలిపి చేసిన 'తిల్ గుల్' (నువ్వుల లడ్డూలు) ఇక్కడ పండగ ప్రత్యేక వంటకం. పెళ్త్లెన మహిళలు పండగ రోజు పత్తి, నూనె, నువ్వులను దానం చేస్తారు. ఇలా చేస్తే వారితో పాటు, వారి కుటుంబ సభ్యులు కూడా కలకాలం సుఖసంతోషాలు, భోగభాగ్యాలతో వర్ధిల్లుతారని నమ్మకం. ఇంట్లో కొత్త కోడలుంటే, ఆమె ఆజన్మాంతం సుమంగళిగా ఉండేందుకు, ఇరుగుపొరుగు మహిళలను ఇంటికి ఆహ్వానించి, వారికి పసుపు, కుంకుమను పంచుతారు.

యూపీలో కమ్మని 'కిచిడీ'

బియ్యం, వివిధ రకాల పప్పులు కలిపి తయారు చేసే వంటకం 'కిచిడీ'. సంక్రాంతి రోజున ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్ర ప్రజలు తప్పకుండా వండుకునే ఈ వంటకం పేరు మీదనే ఇక్కడ సంక్రాంతిని 'కిచిడీ పర్వ్' అని కూడా అంటారు. నువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలు కూడా ఆ రోజు ప్రత్యేకమే. అందుకే దీన్ని 'తిల్ సంక్రాంతి' అని కూడా పిలుస్తారు. తిల్ అంటే హిందీలో నువ్వులు. సంక్రాంతి రోజున నువ్వులు, బెల్లం, కిచిడీని పేదలకు పంచుతారు. ఉన్ని వస్త్రాలు, దుప్పట్లను దానమిస్తారు. పెళ్లయిన అమ్మాయిలు అత్తగారింట్లో అందరికీ బట్టలు పెడతారు. పండగ రోజు అహ్మదాబాద్‌లోని ప్రయాగ (గంగ, యమున, సరస్వతి కలిసే చోటు), హరిద్వార్ వంటి పవిత్ర స్థలాల్లో నదీస్నానాలు (మాఘ్ స్నాన్) ఆచరిస్తారు. సంక్రాంతి రోజున చేసే నదీస్నానాల వల్ల మోక్షం కలుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం. చాలామంది కుటుంబ సమేతంగా గాయత్రీ మంత్రాన్ని పఠిస్తారు. అలాగే పండగ రోజు చాలామంది ఇంట్లో వండిన రుచికరమైన వంటకాలను ఆవుకు పెడతారు. ఉత్తరాయన్‌గా పిలిచే ఈ పండగ రోజు పతంగుల హడావిడి ఉత్తరప్రదేశ్‌లో కూడా కనిపిస్తుంది.

పంజాబ్ 'లోహ్రి'

మకర సంక్రాంతిని పంజాబ్‌లోనూ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. పండగకు ఒక రోజు ముందుగా వచ్చే 'లోహ్రి'ని ఇక్కడి ప్రజలు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. లోహ్రి రోజు 'మక్కీ కీ రోటీ', 'సర్సో కా సాగ్' పంజాబీలు తప్పకుండా చేసే ప్రత్యేకమైన వంటలు. ఆ రోజు ఇళ్ల ముందు చలిమంటలు పెట్టి, వాటిలో మిఠాయిలు, బియ్యం, పాప్‌కార్న్ విసిరే సంప్రదాయం ఇక్కడ కనిపిస్తుంది. మహిళలంతా ఈ మంటల చుట్టూ తిరుగుతూ పంజాబ్ చరిత్ర, మనిషి జీవితంలో సూర్యుని పాత్ర, భగవద్గీతలో శ్రీకృష్ణుని లీలలు వంటి అంశాలపై ప్రసిద్ధి చెందిన పంజాబీ పాటలను ఆలపిస్తారు. చిన్న పిల్లలకు, కొత్తగా పెళ్త్లెన యువతులకు, వారి జీవితాల్లో మొదటి లోహ్రి చాలా ప్రత్యేకమైనదిగా పంజాబీలు భావిస్తారు. లోహ్రినే ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతిగా వ్యవహరిస్తారు. పంజాబ్‌లో మకరసంక్రాంతిని ‘మాఘి’ అని కూడా పిలుస్తారు.

దేశమంతా అదే జోరు..!

కేరళలో కూడా మకరసంక్రాంతిని ఘనంగా జరుపుకొంటారు. అయితే ఇక్కడ పండగ రోజు అయ్యప్ప స్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆ రోజు అయ్యప్ప పూజ చేస్తే సంవత్సరమంతా సుఖసంతోషాలతో ఉంటారని కేరళ ప్రజల నమ్మకం.

గుజరాత్‌లో ఈ పండగ కళే వేరు. సంక్రాంతిని ఇక్కడ ఉత్తరాయన్ అని పిలుస్తారు. పతంగులను ఎగరేయడంలో గుజరాతీలు మహారాష్ట్ర ప్రజలను మించిపోతారు. తెలుగు రాష్ట్రాల్లో కోడిపందేల జోరు ఎలా కొనసాగుతుందో, గుజరాత్‌లో పతంగులను ఎగరేయడంలో కూడా అలాంటి ఉత్సాహాన్నే కనబరుస్తారు. ఉందియు, చిక్కీ అనే ప్రత్యేక వంటకాలు ఇక్కడ పండగ ప్రత్యేకం.

అసోంలో ఈ పండగను 'భోగాలీ బిహు' లేదా 'మాఘ్ బిహు' అంటారు. జనవరి నెల మధ్యలో పంట మొత్తం చేతికి వచ్చాక ఇక్కడి రైతులంతా కలిసి జరుపుకొనే అతి పెద్ద పండగ ఇది. స్థానిక సంస్కృతితో ముడిపడ్డ పాటలు పాడడం, సంప్రదాయ నృత్యాలు చేయడం, ప్రత్యేకమైన వంటలు చేయడం.. తదితర కార్యక్రమాలతో అసోం ప్రజలు పండగ రోజంతా ఉల్లాసంగా గడుపుతారు.

దిల్లీ, హరియాణాలో ఈ పండగను సక్రాత్ లేదా సంక్రాంతి అంటారు. ఆ రోజు ప్రత్యేక వంటకం 'చుర్మా'ను తయారుచేసి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకుంటారు. ఇరుగుపొరుగు వారికి ఆ వంటకాన్ని పంచుతారు. పండగ రోజు చలిమంటల్లో నువ్వులను విసిరే సంప్రదాయం ఇక్కడ కనిపిస్తుంది.

పుష్యమాసంలో వచ్చే పండగ కాబట్టి దీన్ని పశ్చిమబంగలో 'పౌష్ సంక్రాంతి' అని పిలుస్తారు. కొత్త సంవత్సరంలో భోగభాగ్యాలను కలిగిస్తుందనే విశ్వాసంతో బహార్‌లక్ష్మీ అనే దేవతను పూజిస్తారు. పటిషప్త, కేజు తిల్‌గుల్ వంటి వంటకాలను తయారుచేస్తారు.

ఉత్తరాఖాండ్‌లో 'గుగుటి' పేరుతో ఈ పండగను చేస్తారు. పిండివంటలు చేసి పక్షులకు ఆహారంగా పెడతారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో 'మాఘసజ్జి' పేరుతో జరుపుకొంటారు. చిక్కీలు, కిచిడీ చేసుకుంటారు. గుళ్లకు వెళ్లి దానాలు చేస్తారు. పుణ్యస్నానాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా..

'ఉలావర్ తిరునాళ్' పేరుతో శ్రీలంక ప్రజలు సైతం సంక్రాంతి పండగను ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తారు. ఇక్కడి రైతులకు ఇది చాలా పెద్ద పండగ. వరి పంట చేతికి రావడానికి సూర్యుడే ముఖ్య కారకుడని భావించి, ఆరోజు మట్టి కుండల్లో బియ్యం ఉడికించి, సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

నేపాల్‌లో 'మాఘె సంక్రాంతి' పేరుతో ఈ పండగని జరుపుకొంటారు. ఉదయాన్నే నదీ స్నానాలు ఆచరించి, ఇంట్లో తల్లి ఆశీర్వాదం తీసుకోవడం ఇక్కడి సంప్రదాయం. లడ్డూలు, నెయ్యి, నువ్వులు, చిలగడదుంపను బంధువులు, ఇరుగుపొరుగు వారికి పంచుతారు.

ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, మయన్మార్ దేశాల్లో ఉన్న తమిళులు, తెలుగు ప్రజలు స్థానికంగా ఉండే హిందూ ఆలయాల్లో సామూహికంగా సంక్రాంతి పండగని వేడుకలా నిర్వహిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని