ఈ పొదుపు.. పర్యావరణానికే కాదు.. బడ్జెట్‌కూ మంచిదే!

అంతగా పట్టించుకోము కానీ మనం నిత్యం వాడే నీరు, గ్యాస్, విద్యుత్తు- వీటి విషయంలో జాగ్రత్తగా మసలుకుని, ఉన్నంతలో పొదుపు చేయగలిగితే మనం కూడా సహజ వనరులను కాపాడుతున్నట్లే.. పర్యావరణానికి మన వంతు సాయం...

Published : 05 Jun 2023 20:05 IST

అంతగా పట్టించుకోము కానీ మనం నిత్యం వాడే నీరు, గ్యాస్, విద్యుత్తు- వీటి విషయంలో జాగ్రత్తగా మసలుకుని, ఉన్నంతలో పొదుపు చేయగలిగితే మనం కూడా సహజ వనరులను కాపాడుతున్నట్లే.. పర్యావరణానికి మన వంతు సాయం చేస్తున్నట్లే.. మరి అదెలాగో ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం రండి..

ఆదా ఇలా..

నీరు, గ్యాస్, విద్యుత్తు ఈ మూడింటినీ పొదుపు చేయడం వల్ల పర్యావరణానికే కాదు.. మన బడ్జెట్‌కీ ప్రయోజనకరమే! వంటిల్లు, బాత్రూం దగ్గరి నుంచి ఇంట్లో వాడే వివిధ విద్యుత్‌ ఉపకరణాలతో ఈ పొదుపు చేయొచ్చు. ఫ్రిజ్, మైక్రోవేవ్ అవెన్‌, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, మిక్సీ, గ్రైండర్, డిజిటల్ గడియారం, వాషింగ్ మెషీన్, గీజర్.. ఇలా లిస్టు కొనసాగుతూనే ఉంటుంది. ఈ వస్తువులన్నింటినీ మితంగా ఉపయోగిస్తే విద్యుత్తు బిల్లు ఆదా అయినట్లే. అంతేకాదండోయ్.. ఎలక్ట్రిక్ ఉపకరణాల వాడకంలో మనం చేసే మరో పొరపాటేంటంటే.. వాటిని వాడిన తర్వాత అలాగే వదిలేయడం. అదేంటి? మేం స్విచ్ ఆఫ్ చేస్తున్నాంగా.. అనుకోకండి. కేవలం స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోదు.. వాటి ప్లగ్‌లను సాకెట్ నుంచి తొలగించాలి. ఇక గీజర్ ఆఫ్ చేసే విషయంలో కూడా చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు.

ఫ్రిజ్‌తో జాగ్రత్త...

వంటింట్లో కరెంటు ఎక్కువగా వృథా అయ్యేది ఫ్రిజ్ వల్లే.. ఫ్రిజ్ డోరును మాటిమాటికీ తెరవడం, ఎక్కువసేపు తెరచి ఉంచడం వల్ల కూడా విద్యుత్తు వృథా అవుతుంది. అలాగే డోరు చుట్టూ ఉండే రబ్బరు సీల్ ఎక్కడైనా సరిగ్గా అతుక్కోకపోతే ఫ్రిజ్‌లోని చల్లదనమంతా అందులోంచి బయటకు లీక్ అవుతూ ఉంటుంది. తిరిగి ఫ్రిజ్‌ని చల్లబర్చడానికి ఎక్కువ విద్యుత్తు అవసరమవుతుంది. కాబట్టి ఈ రెండూ జరగకుండా జాగ్రత్త పడితే ఎంతో విద్యుత్తును ఆదా చేసిన వాళ్లమవుతాం..

నీటి వృథాకు కళ్లెం..

కిచెన్, బాత్రూంలలో మనం వృథా చేసే వాటిలో నీటిదే ప్రథమ స్థానం. గిన్నెలు తోమేటప్పుడు ట్యాప్ తిప్పి వదిలేస్తాం.. కొన్నిసార్లు కుళాయి లీకవుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాం. ఇలా ఎన్ని నీళ్లు వృథా అవుతాయో పట్టించుకోం. షవర్ కింద స్నానం చేయడానికి కనీసం మూడు నుంచి నాలుగు బకెట్ల నీళ్లు పడతాయి. ఈ నీటిని వృథా కాకుండా ఆపడం మరీ కష్టమేమీ కాదు. సాధ్యమైనంత వరకు అవసరమున్నప్పుడే ట్యాప్ తిప్పండి. అవసరం పూర్తవగానే గట్టిగా కట్టేయడం మర్చిపోవద్దు. షవర్ స్నానం కాకుండా బకెట్‌ నీటితో స్నానం చేయడం ఉత్తమం. వీటిన్నింటి కంటే మంచి పద్ధతి లో-ఫ్లో-ఎయిరేటర్స్‌ని వాడటం. వీటివల్ల కుళాయి, షవర్ హెడ్‌ల నుంచి ప్రవహించే నీటిలో గాలి కలుస్తుంది. దీని వల్ల ఇంతకు ముందున్నంత స్పీడ్‌లోనే నీళ్లొస్తాయి. కానీ గాలి, నీరు రెండూ కలవడం వల్ల అందులోని నీటి పరిమాణం తగ్గుతుంది. ఇలా రావడం వల్ల తక్కువ నీటితోనే ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు. బాత్రూం ఫ్లష్ బాక్స్ సైజు తగ్గించడం వల్ల కూడా నీటిని పొదుపు చేయొచ్చు. అదేవిధంగా వీలైన అన్ని చోట్ల ప్రత్యేక సెన్సర్ల సహాయంతో పని చేసే పంపులు వాడడం వల్ల నీటి వృథాను అరికట్టచ్చు. ఇలా మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా నీటి పొదుపు చేసే మార్గాలు పాటించేలా చూడండి.

గ్యాస్ పొదుపు

గ్యాస్‌ను పొదుపు చేయడం వల్ల మన బడ్జెట్‌కు ఎక్కువ ప్రయోజనకరం! త్వరగా వేడెక్కే గిన్నెలను ఉపయోగించడం, సిమ్‌లో పెట్టి కూరలు వండటం, ప్రెషర్ కుక్కర్ వాడకం.. ఇలాంటివన్నీ గ్యాస్ ఆదా చేయడానికి మనకు తెలిసిన చిట్కాలే.. ఇక పొద్దున్నే ఒక కప్పు కాఫీ కావాలంటే మొత్తం పాలన్నింటినీ కాచేస్తాం. అందులోంచి కొన్ని పాలను మాత్రమే తీసుకొని కాఫీ పెట్టుకుంటాం. మిగిలినవి మళ్లీ చల్లారిపోతాయి. వాటిని ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. ఇలా చేయడం వల్ల ఒక కప్పు కోసం మిగిలిన పాలన్నింటినీ అనవసరంగా వేడి చేసినట్లే అవుతుంది. అందుకే మీకెంత మొత్తంలో అవసరమో అంత మొత్తం ఆహారాన్నే వండండి లేదా వేడి చేయండి. అలాగని పదే పదే వండటం వల్ల కూడా గ్యాస్ వృథా అవుతుంది. అందుకే వీలైనంత మేరకు అందరికీ కలిసొచ్చేలా ఒకేసారి కాఫీ కాయడం, వంట చేయడం మొదలైన పద్ధతులు ఫాలో అవండి..

రేడియేషన్‌ తగ్గిస్తూ..!

పర్యావరణాన్ని కాపాడటమంటే కేవలం సహజ వనరులను పొదుపుగా వాడటమే కాదు.. కృత్రిమ పురుగు మందులను, కృత్రిమ పదార్థాలను వాడకుండా ఉండటం కూడా ఇందులో భాగమే.. వీటి వల్ల ప్రకృతికి ప్రయోజనకరం, మనమూ అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు. ఈ క్రమంలో- వీలైనంత వరకు నాన్-టాక్సిక్ క్లీనర్ల (వెనిగర్, వంటసోడా, ఉప్పు మొదలైనవి)తో ఇంటిని శుభ్రపర్చుకోవాలి. అలాగే వివిధ ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు సంబంధించి 'రేడియేషన్ ఫ్రీ' ఉత్పత్తులు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. రేడియేషన్ తక్కువగా ఉండే అలాంటి ఉత్పత్తులను వాడడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో మన వంతు పాత్ర పోషించిన వారమవుతాం. ఫలితంగా మన ఆరోగ్యాన్నీ కాపాడుకున్నవాళ్లమవుతాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్