ఇలాంటి విషయాల్లో ‘నో’ చెప్పడమే మంచిది!

చాలామంది ఏదైనా విషయంలో తమకు నచ్చకపోయినా ‘నో’ చెప్పకపోవడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. అవతలి వ్యక్తులు బాధపడతారేమోనని అనుకోవడం కూడా ఇందుకు కారణమే. అయితే జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని సందర్భాల్లో ‘నో’ చెప్పడం....

Updated : 04 Oct 2022 13:13 IST

చాలామంది ఏదైనా విషయంలో తమకు నచ్చకపోయినా ‘నో’ చెప్పకపోవడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. అవతలి వ్యక్తులు బాధపడతారేమోనని అనుకోవడం కూడా ఇందుకు కారణమే. అయితే జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని సందర్భాల్లో ‘నో’ చెప్పడం నేర్చుకోవాలంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. కొంతమంది సున్నిత మనస్తత్వం ఉన్నవారు ‘నో’ చెప్పడానికి వెనకాడుతుంటారు. దీనివల్ల పలు ఇబ్బందులను కొనితెచ్చుకుంటుంటారు. అయితే కొన్ని అంశాల్లో మాత్రం కచ్చితంగా ‘నో’ చెప్పడమే  సరైన మార్గం అంటున్నారు నిపుణులు.

ఆ అవకాశం నచ్చకపోతే..

చదువు పూర్తైన తర్వాత చాలామంది విద్యార్థులు ఉద్యోగాన్వేషణ చేస్తుంటారు. ఈ క్రమంలో అనేక ఇంటర్వ్యూలకు హాజరవుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వివిధ సంస్థలే విద్యార్థులకు అవకాశాలు ఇస్తుంటాయి. ఇలాంటప్పుడు మీకు వచ్చిన ఉద్యోగం మీ అభిరుచులకు తగ్గట్టుగా లేకపోతే ముందే ‘నో’ చెప్పడం మంచిదంటున్నారు నిపుణులు. అవసరమైతే కొంత సమయం తీసుకున్నా మీ కలల కొలువును సొంతం చేసుకోవడమే మేలంటున్నారు.

అందుకు సిద్ధంగా ఉన్నారా?

చాలామంది తమ కలలను సాకారం చేసుకోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో అనుకోకుండా కొన్ని అవకాశాలు కూడా లభిస్తుంటాయి. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే అందుకు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండాలి. ఉదాహరణకు మీరో వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు. మీ స్నేహితులో, బంధువులో పెట్టుబడి కోసం ఆర్ధిక సహకారం అందించడానికి ముందుకొచ్చారనుకుందాం.. అయితే వెంటనే వ్యాపారం మొదలుపెట్టడానికి అవసరమైన ఇతర వనరులు మీ దగ్గర లేకపోతే- వారికి సున్నితంగా వద్దని చెప్పడమే మంచిది. వాళ్లు ఆర్ధిక సహకారం అందిస్తానన్నారు కదా అని వద్దంటే బాగుండదనో, లేదంటే తర్వాత మళ్లీ ఆ అవకాశం వస్తుందో రాదోనని- మీరు వ్యాపారానికి పూర్తిగా సిద్ధంగా లేకుండానే అందులో దిగితే తర్వాత దాని నిర్వహణ కష్టమవుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో అసలు విషయం వారికి మర్యాదగా చెప్పి, వ్యాపార నిర్వహణకు సిద్ధంగా ఉన్నప్పుడు వారి సహాయం స్వీకరిస్తానని తెలియచేయాలి.

రెండోసారి వద్దు...

తప్పులు చేయడం మానవ సహజం. దీనికి ఎవరూ అతీతులు కారు. కానీ, జరిగిన తప్పు పునరావృతం కాకుండా చూసుకోవడం మాత్రం మీదే బాధ్యత. దీనికి మీ మనస్తత్వం కారణం కాకూడదంటున్నారు నిపుణులు. ఉదాహరణకు ఇంతకుముందు మీ స్నేహితురాలితో కలిసి చేసిన వ్యాపారంలో విభేదాలు వచ్చి నష్టాలు వస్తే.. మరోసారి అదే అవకాశం వచ్చినప్పుడు ‘నో’ చెప్పడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు.

వాటిని విస్మరించకూడదు...

ప్రతి ఒక్కరికీ తమకంటూ కొన్ని ప్రాధాన్యాలుంటాయి. ఇవే వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంటాయి. ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా వాటిని విస్మరించకపోవడం మంచిదంటున్నారు నిపుణులు. కానీ, కొన్ని సందర్భాల్లో ప్రస్తుత అవసరాల కోసం మన ప్రాధాన్యాలను దూరం చేసే అవకాశాలు, ప్రతిపాదనలు వస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లోనూ ‘నో’ చెప్పడం ఉత్తమం. లేదంటే భవిష్యత్తులో మన ఉనికే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంటుంది.

అది మంచిది కాదు..

సున్నిత మనస్తత్వం ఉన్నవారు ప్రతి దానికీ ‘ఎస్‌’ చెప్పడానికే మొగ్గు చూపిస్తుంటారు. మరికొంతమంది ఏదైనా విషయంలో ఇతరులు చెప్పింది తమకు నచ్చితే వెంటనే ‘ఓకే’ చెప్పేస్తుంటారు. ఈ రెండూ మంచి పద్ధతులు కావంటున్నారు నిపుణులు. ప్రతిదానికి ‘సరే’ అనడం వల్ల అవతలి వ్యక్తికి మీపై చులకన భావం కలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అన్నీ సరిగ్గా ఉండి మీకు నచ్చితే దానికి కొంత సమయం కావాలని అడగండి. ఆ తర్వాత మీ నిర్ణయాన్ని తెలియజేయండి. దీనివల్ల మీరు ఆలోచించుకునే అవకాశం దొరకడంతో పాటు మిమ్మల్ని డీల్‌ చేయడం అంత సులభం కాదని అవతలి వారికి అర్థమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్