Summer Gadgets: మొక్కలు ఎండిపోవిక!
వెకేషన్ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేవి రెండే రెండు.. ఒకటి-పెట్స్, రెండోది-మొక్కలు. చాలావరకు పెంపుడు జంతువుల్ని మనతో పాటు తీసుకెళ్లచ్చు.. కానీ మొక్కల్ని వెంటేసుకు తిరగలేం కదా! అలాగని.. ఈ వేసవిలో వాటిని....
వెకేషన్ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేవి రెండే రెండు.. ఒకటి-పెట్స్, రెండోది-మొక్కలు. చాలావరకు పెంపుడు జంతువుల్ని మనతో పాటు తీసుకెళ్లచ్చు.. కానీ మొక్కల్ని వెంటేసుకు తిరగలేం కదా! అలాగని.. ఈ వేసవిలో వాటిని అలాగే వదిలేస్తే.. అవి ఎండిపోతాయి. ఎంత నీళ్లు పెట్టినా.. ఈ వేడికి మట్టిలో తేమ ఒకట్రెండు రోజులకు మించి ఉండదు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే ప్రస్తుతం ‘సెల్ఫ్ వాటరింగ్ గ్లోబ్స్’ మార్కెట్లోకొచ్చేశాయి.
పేరుకు తగ్గట్లే గ్లోబ్ మాదిరిగా ఉండి.. దానికి ఒక చిన్న ట్యూబ్ అనుసంధానమై ఉంటుంది. చూడ్డానికి రసాయన ప్రయోగశాలలో కనిపించే ఫ్లోరెన్స్ ఫ్లాస్క్‌ను పోలి ఉంటుందిది. అయితే మనం చేయాల్సిందల్లా.. ముందుగా మొక్క కుండీలో ఉన్న మట్టిని తడిసేలా నీళ్లు నింపాలి. ఆపై ఈ గొట్టం ద్వారా గ్లోబు నిండా నీళ్లు నింపి.. నెమ్మదిగా దీన్ని మొక్క ఉన్న కుండీ మట్టిలోకి చొప్పించాలి. ఈ చిన్న రంధ్రం నుంచి చుక్కలు చుక్కలుగా నీళ్లు మట్టిలోకి చేరి మట్టిని తేమగా ఉంచుతాయి. ఇలా ఒకసారి గ్లోబులో నింపిన నీళ్లు సుమారు వారం నుంచి రెండు వారాల పాటు మట్టిని తేమగా ఉంచేందుకు.. తద్వారా మొక్క ఎండిపోకుండా కాపాడేందుకు దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఇలాంటి సెల్ఫ్ వాటరింగ్ గ్లోబ్స్ ప్రస్తుతం మార్కెట్లో విభిన్న డిజైన్లలో లభిస్తున్నాయి. స్టార్, పుట్టగొడుగులు, వివిధ రకాల పక్షులు-జంతువులు, క్యారట్, జార్.. వంటి ఆకృతుల్లో ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్నాయి. గాజు, ప్లాస్టిక్, చెక్క.. ఇలా విభిన్న మెటీరియల్స్‌తో రూపొందించిన గ్లోబ్స్‌తో పాటు ఇరిగేషన్ తరహా టూల్స్ కూడా దొరుకుతున్నాయి. వీటిని మూతగా బాటిల్‌కు బిగించి.. కుండీ మట్టిలో చొప్పిస్తే సరి.. వాటికి ఉన్న డ్రాపింగ్ అమరిక ద్వారా.. నీళ్లు ఎంత వేగంగా మట్టిలో పడాలో కూడా సెట్ చేసుకోవచ్చు. మరి, ఇన్ని ఉపయోగాలున్న ఈ సెల్ఫ్ వాటరింగ్ గ్లోబ్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి!
Photos: Amazon.in
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.