మురికివాడ నుంచి మైక్రోసాఫ్ట్ దాకా.. ఈ అమ్మాయి విజయ గాథ విన్నారా?

మురికివాడల్లో నివసించే వారి జీవనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి వాడల్లో పెరిగే పిల్లలకు పాఠశాలలో చేరడమే పెద్ద విజయం. ఇక కంప్యూటర్‌ వంటి సాధనాలను ఉపయోగించడమంటే అందని ద్రాక్షే. కానీ ముంబయికి చెందిన షహీనా అత్తర్‌వాలా ఇలాంటి ఎన్నో సవాళ్లను దాటుకుని టెక్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌లో కొలువు సాధించింది. ఆమె ఓ వెబ్‌సిరీస్‌ చూస్తుండగా అందులో వారు గతంలో మురికివాడలో ఉన్న ఇంటిని గమనించింది.

Published : 30 Jan 2022 08:50 IST

(Photo: Twitter)

మురికివాడల్లో నివసించే వారి జీవనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి వాడల్లో పెరిగే పిల్లలకు పాఠశాలలో చేరడమే పెద్ద విజయం. ఇక కంప్యూటర్‌ వంటి సాధనాలను ఉపయోగించడమంటే అందని ద్రాక్షే. కానీ ముంబయికి చెందిన షహీనా అత్తర్‌వాలా ఇలాంటి ఎన్నో సవాళ్లను దాటుకుని టెక్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌లో కొలువు సాధించింది. ఆమె ఓ వెబ్‌సిరీస్‌ చూస్తుండగా అందులో వారు గతంలో మురికివాడలో ఉన్న ఇంటిని గమనించింది. దాంతో ఆ ఫొటోలను, దానికి సంబంధించిన కొన్ని అనుభవాలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఆ ట్వీట్‌ కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. ఈ క్రమంలో మురికివాడ నుంచి మైక్రోసాఫ్ట్‌కు చేరుకున్న షహీనా విజయ ప్రస్థానం గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందామా...

నా పేరు షహీనా అత్తర్‌వాలా. నేను ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ పేద కుటుంబంలో జన్మించాను. మా కుటుంబం చిన్నప్పుడే ముంబయికి వలస వచ్చింది. బాంద్రా రైల్వే స్టేషన్‌కు దగ్గర్లోని దర్గా గల్లీ అనే మురికివాడలో మా నివాసం. నాన్న ఓ చిన్న వీధి వ్యాపారి. కొన్నిసార్లు పూట గడవడం కూడా కష్టంగా ఉండేది.  ఆ పరిస్థితుల్లో నాకు చిన్నవయసులోనే పెళ్లి చేయాలని చూశారు. కానీ నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఆ పెళ్లిని అడ్డుకోగలిగాను. మురికివాడల్లో జీవితం చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ లింగ వివక్ష, లైంగిక వేధింపులు, జీవన విధానం.. మహిళలకు ఇబ్బందిగా ఉంటాయి. అయితే ఆ పరిస్థితులే నన్ను ఒక కొత్త జీవితాన్ని ఎంచుకోవడానికి ప్రేరేపించాయి. దానికి మొదటగా చదువుకోవడం ఒక్కటే పరిష్కారం అనిపించింది. అందుకే ఎన్ని అవాంతరాలు ఎదురైనా చదువుకోవాలని నిశ్చయించుకున్నాను.

అలా ఓ పాఠశాలలో చేరాను. ఆ క్రమంలో ఓసారి స్కూల్లో కంప్యూటర్‌ని చూశాను. దానిని చూడగానే ఎందుకో నా మనసంతా ఆ కంప్యూటర్ పైనే పడింది. ఆ సమయంలో కంప్యూటర్‌ ముందుంటే మంచి అవకాశాలు వస్తాయనే నమ్మకం కలిగింది. అదే సమయంలో చదువుకోవడానికి నాకు సరైన వసతులు ఉండేవి కావు. దాంతో మార్కులు కూడా తక్కువగా వచ్చేవి. ఫలితంగా కంప్యూటర్‌ తరగతులకు పోవాల్సిన నేను కుట్లు, అల్లికల పనికి పోవాల్సి వచ్చేది. అయినా కంప్యూటర్‌ నేర్చుకోవాలన్న తపన మాత్రం నాలో పోలేదు. దాంతో మా నాన్నతో అప్పు చేయించి మరీ కంప్యూటర్‌ తరగతులకు హాజరయ్యాను. కానీ, నేర్చుకున్న తరగతులు ప్రాక్టీస్‌ చేయాలంటే సొంతంగా కంప్యూటర్‌ ఉండాలి. మా దగ్గర అంత డబ్బులు ఉండేవి కావు. దాంతో కంప్యూటర్‌ కోసం డబ్బులు కూడబెట్టుకోవడానికి ఒక్కోసారి మధ్యాహ్నం భోజనం కూడా మానేసేదాన్ని. ఇంటికి నడిచి వెళ్లేదాన్ని. ఆ తర్వాత ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌లో శిక్షణ పొందాను. కొన్ని రోజుల తర్వాత ప్రోగ్రామింగ్‌ నేర్చుకోవడం మానేసి డిజైనింగ్‌ని కెరీర్‌గా ఎంపిక చేసుకున్నాను. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీ అవసరం ఎక్కువగా ఉంటుంది. దానికి డిజైనింగే సరైన కెరీర్‌ అనిపించింది. అలా కంప్యూటర్‌ నేర్చుకుంటూనే ఎస్‌ఎస్‌సీ మొదటి తరగతిలో పాసయ్యాను.

ఇక అప్పటి నుంచి నేను వెనుతిరిగి చూడలేదు. హెచ్‌ఎస్‌సీలో కూడా మొదటి తరగతిలో ఉత్తీర్ణత సాధించాను. ఆ తర్వాత ముంబయి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందాను. డిగ్రీ చేస్తుండగానే డిజైనింగ్‌కు సంబంధించి వివిధ కోర్సులను కూడా పూర్తి చేశాను. చదువు పూర్తయిన తర్వాత పలు కంపెనీల్లో డిజైనింగ్‌ విభాగంలో పని చేశాను. రెండేళ్ల క్రితమే ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే అవకాశం వచ్చింది. ప్రస్తుతం అక్కడ డిజైనింగ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. గతేడాది మేము కొత్త అపార్ట్‌మెంట్‌కు మారాం. అక్కడ అన్ని వసతులూ ఉన్నాయి. మురికివాడలో రోడ్డు పైన నిద్రించే దుర్భర స్థితి నుంచి ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాను. ఎన్నో అవరోధాలను ధైర్యంగా ఎదుర్కొన్నాను. దానికి అదృష్టం కూడా కలిసివచ్చింది. గతంలో నాలాంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిలకు నేను చెప్పేది ఒక్కటే.. చదువు, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం కోసం ఏదైనా చేయండి. అదే మీ జీవితంలో పెను మార్పులు తీసుకువస్తుంది.

మురికివాడ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు ఎదిగిన షహీనా విజయ గాథ ఎందరినో ఆకట్టుకుంటోంది.. ఎంతోమందిలో స్ఫూర్తి రగిలిస్తోంది!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్