Published : 24/10/2022 12:33 IST

వెన్నెల కాంతులలో పండగల పరవళ్లు..!

వెన్నెల కాంతులతో అంబరానికే సొగసుని తీసుకొచ్చే రుతువు శరదృతువు. ఈ రుతువులో చాంద్రమాన మాసాలైన ఆశ్వయుజ, కార్తీకాల్లో పండగల వెల్లువ ప్రతిఒక్కరినీ భక్తిపారవశ్యంలో, ఆనంద డోలికల్లో ముంచెత్తుతుందంటే సందేహం లేదు. దీపావళి, కార్తీక పూర్ణిమ, నాగులచవితి.. మొదలైన పండగలు, పర్వదినాలు ఈ రుతువులోనే రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో శరదృతువులో వచ్చే కొన్ని పండగలు, పర్వదినాలు, వాటి ప్రాధాన్యం గురించి తెలుసుకుందాం..

ధన్‌తేరస్ (ధన త్రయోదశి)

ధన్‌తేరస్‌నే 'ధన త్రయోదశి' అని కూడా అంటారు. ఆశ్వయుజ కృష్ణపక్షంలోని పదమూడో రోజున వచ్చే ఈ పండగను ఉత్తరాదిలో ఎక్కువగా జరుపుకొంటారు. దీపావళి సందర్భంగా నిర్వహించే ఐదు రోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున జరుపుకొనే ఈ పండగ నాడు ప్రత్యేకంగా మహిళలు స్వర్ణాభరణాలను కొని ధరిస్తారు. తమ సకల అభీష్టాలు నెరవేరడానికి, ధన, వస్తు, కనక, వాహన సంపత్తిని పొందడానికి ఆ మహాలక్ష్మిని కొలుస్తారు.

నరకచతుర్దశి (చోటీ దివాలీ)

దీపావళికి ఒక రోజు ముందు, ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు శ్రీకృష్ణుడు జనరక్షణార్థమై తన అర్ధాంగి సత్యభామ సహాయంతో నరకాసురుడిని హతమార్చాడని పురాణాలు చెబుతున్నాయి. అదే రోజును 'నరకచతుర్దశి'గా ప్రజలు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. దీనినే కొన్ని ప్రాంతాల్లో 'చోటీ దివాలీ' అని కూడా పిలుస్తారు.

దీపావళి

ఉత్తరాదిలో 'దివాలీ'గా, దక్షిణాదిలో దీపావళిగా జరుపుకొనే ఈ దీపాల పండగ రోజునే రాముడు సతీసమేతుడై అయోధ్యకు తిరిగొచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అజ్ఞానాంధకారాలపై జ్ఞాన తేజస్సు సాధించిన విజయానికి సూచనగా కూడా దీపావళి జరుపుకొంటారు.

దివాలీ పడ్వా

దీపావళి పండగలో భాగంగా ఉత్తరాదిలో నాలుగో రోజు జరుపుకొనే వేడుకే 'దివాలీ పడ్వా'. ఈ రోజున కొత్తగా పెళ్లయిన దంపతులను ఇంటికి ఆహ్వానించి బహుమతులు, కానుకలను అందజేస్తారు. దీనికే 'గుడి పడ్వా' అని మరో పేరు కూడా ఉంది. ఇదే రోజున కొన్ని ప్రాంతాల్లో 'బలి పాడ్యమి' అనే పండగను కూడా జరుపుకొంటారు. ఈ రోజునే శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తిని తన పాదాలతో పాతాళానికి తొక్కేశాడని అంటారు. అలాగే ఈ పర్వదినాన ఉత్తరాదిలో చాలా చోట్ల 'గోవర్థన పూజ'ను జరుపుకోవడం విశేషం.

బహు బీజ్ (భగినీ హస్త భోజనం)

ఉత్తరాదితో పాటు దక్షిణాదిలో కూడా కొన్ని చోట్ల జరుపుకొనే ఈ పర్వదినాన అక్కలు, చెల్లెళ్లు తమ సోదరులను ఇంటికి ఆహ్వానించి మంచి విందు భోజనాన్ని వడ్డిస్తారు. దీనినే కొందరు 'భాయ్‌దూజ్', 'భగినీ హస్త భోజనం', 'భ్రాతృ ద్వితీయ' అనే పేర్లతో కూడా పిలుస్తారు. దీనికే 'యమ ద్వితీయ' అనే పేరు కూడా ఉంది. యముడి సోదరైన యమున తన సోదరుడిని విందు నిమిత్తం ఈ రోజే మొదటిసారి తన ఇంటికి ఆహ్వానించిందని ఓ కథ ప్రచారంలో ఉంది.

కార్తీక పౌర్ణమి (గురు పౌర్ణమి)

కార్తీక మాసం శుక్లపక్షంలో పదిహేనో రోజు వచ్చే పండగే కార్తీక పౌర్ణమి. ఈ రోజున చాలామంది శివాలయాల్లో రుద్రాభిషేకాలు చేస్తారు. మహిళలు కేదారేశ్వర వ్రతం కూడా చేస్తారు. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన భర్తలో అర్ధభాగం పొందేందుకు గాను ఈ వ్రతాన్ని ఆచరించిందని చెబుతారు. అలాగే 'కార్తీక పౌర్ణమి' రోజునే సిక్కులు 'గురు పౌర్ణమి'ని జరుపుకోవడం విశేషం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని