Divorce-sary: విడాకుల వార్షికోత్సవాన్ని సంతోషంగా జరుపుకొంది!

మీకు ‘ఆహ్వానం’ సినిమా గుర్తుందా? అందులో రమ్యకృష్ణ పెళ్లిలాగే తన విడాకుల మహోత్సవాన్నీ అందరినీ పిలిచి వైభవంగా జరుపుకొంటుంది. తద్వారా పెళ్లి, వైవాహిక జీవితం ప్రాముఖ్యాన్ని చాటి చెబుతుందామె. ముంబయికి చెందిన శాశ్వతి శివ కూడా రమ్యకృష్ణనే ఫాలో....

Published : 25 Jan 2023 19:21 IST

(Photos: Instagram)

మీకు ‘ఆహ్వానం’ సినిమా గుర్తుందా? అందులో రమ్యకృష్ణ పెళ్లిలాగే తన విడాకుల మహోత్సవాన్నీ అందరినీ పిలిచి వైభవంగా జరుపుకొంటుంది. తద్వారా పెళ్లి, వైవాహిక జీవితం ప్రాముఖ్యాన్ని చాటి చెబుతుందామె. ముంబయికి చెందిన శాశ్వతి శివ కూడా రమ్యకృష్ణనే ఫాలో అవుతోంది. కాకపోతే.. ‘ఇష్టంలేని బంధంలో కొనసాగే కంటే విడాకులు తీసుకొని మనకు నచ్చినట్లుగా జీవిద్దాం..’ అంటూ పాజిటివిటీని చాటుతోంది. ఈ సమాజంలో విడాకులు తీసుకున్న మహిళలపై ఉన్న చిన్న చూపును దూరం చేసే ప్రయత్నం చేస్తోంది. ఇది చాటి చెప్పడానికే ఇటీవల తన నాలుగో విడాకుల వార్షికోత్సవాన్ని సంతోషంగా జరుపుకొందామె. ఈ క్రమంలోనే గత నాలుగేళ్లలో తన జీవితంలో జరిగిన సానుకూల పరిణామాల్ని ఓ సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో లింక్డిన్‌లో పంచుకుంది శాశ్వతి. విడాకులు తీసుకొని ఈ సమాజం నుంచి విమర్శల్ని ఎదుర్కొంటోన్న ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపుతోన్న ఆమె పోస్ట్‌ ప్రస్తుతం వైరలవుతోంది.

పెళ్లిని ఎంత వైభవంగా జరుపుకొంటామో.. విడాకుల్ని అంత గుట్టు చప్పుడు కాకుండా తీసుకుంటాం. కారణం.. విడాకులు తీసుకున్న మహిళలపై ఈ సమాజంలో నెలకొన్న చిన్నచూపే. భాగస్వామితో తగని విభేదాలున్నా, అది హింసాత్మక బంధమైనా సరే.. అన్నీ భరిస్తూ అదే బంధంలో కొనసాగాలే తప్ప.. విడాకులు తీసుకోవడం నేరంగా పరిగణిస్తుంటుంది మన సమాజం. ఈ క్రమంలోనే వారిని అగౌరవపరిచేలా సూటిపోటి మాటలతో హింసిస్తుంటుంది. అందుకే తమ విడాకుల విషయం బయటికి తెలియకుండా గోప్యంగా ఉంచుతుంటారు చాలామంది మహిళలు. కానీ ఆ అవసరం లేదంటోంది శాశ్వతి.

ఈ నాలుగేళ్లలో ఎంతో మార్పు!

ముంబయికి చెందిన శాశ్వతి.. గత నాలుగేళ్ల క్రితం విడాకులు తీసుకుంది. అప్పట్నుంచి ఏటా విడాకుల వార్షికోత్సవం జరుపుకొంటూ వస్తోన్న ఆమె.. ఇటీవలే నాలుగో వార్షికోత్సవాన్ని సెలబ్రేట్‌ చేసుకుంది. అయితే నచ్చని బంధం నుంచి విముక్తి పొంది.. ఈ నాలుగేళ్లలో వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా ఎంతో పరిణతి సాధించానని చెబుతూ.. ఆ అనుభవాలను ఓ సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో లింక్డిన్‌లో పంచుకుందామె.

‘నేను విడాకులు తీసుకొని నాలుగేళ్లవుతోంది. ఏటా ఈ ముఖ్యమైన సందర్భాన్ని స్వేచ్ఛకు ప్రతిరూపంగా, సంతోషంగా జరుపుకొంటాను. గత 1460 రోజుల్లో ఏ రోజూ నా జీవితానికి కృతజ్ఞత చెప్పుకోకుండా ఉండలేదు. కొన్నిసార్లు ప్రణాళిక వేసుకోకుండా మొదలుపెట్టిన పనులే సఫలీకృతమవుతుంటాయి. నా జీవిత ప్రయాణంలో ఈ నాలుగేళ్లలో అలాంటి ఎన్నో పనులు మొదలుపెట్టి సక్సెసయ్యాను. వాటిలో కొన్నింటి గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నా..

వ్యక్తిగా, వక్తగా.. ఎదిగా!

నేను విడాకులు తీసుకునే క్రమంలో.. ఈ సమాజంలో దీనిపై ఎలాంటి మూసధోరణులు నెలకొన్నాయో అవగతమైంది. ఈ విషయంలో మహిళలపై ఎంత వివక్ష ఉందో మరింత లోతుగా తెలుసుకోగలిగా. అయితే వాటిని అంగీకరించడం కాకుండా బద్దలుకొట్టాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలో విడాకుల గురించి ఆన్‌లైన్‌లో చర్చించడం మొదలుపెట్టా. ఇప్పటిదాకా 75కి పైగా సపోర్ట్‌ గ్రూప్‌ వీడియో సెషన్స్‌, వ్యక్తిగత సెషన్స్‌ నిర్వహించా. ప్రస్తుతం 500 మందికి పైగా సభ్యులున్న టెలిగ్రామ్‌ సపోర్ట్‌ గ్రూప్‌ను నడుపుతూ.. విడాకుల వల్ల దొరికిన ఈ ఖాళీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో సలహాలిస్తున్నా.

విడాకుల తర్వాత నాకు దొరికిన ఈ ఖాళీ సమయం నేను వక్తగా మారే గొప్ప అవకాశం నాకు కల్పించింది. ఈ క్రమంలో టెడెక్స్‌ స్పీకర్‌గా పలు వేదికలపై నా జీవితానుభవాల్ని పంచుకున్నా. అలాగే పదికి పైగా ఆడియో ఫైల్స్, షార్ట్‌ వీడియోల్లోనూ నా అనుభవాలు పంచుకున్నా. పలు మీడియా సంస్థలూ నా గురించి ఆర్టికల్స్‌ ప్రచురించాయి.

‘కౌవతి’ పేరుతో వీగన్‌ ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించా. అయితే కరోనా సమయంలో తీవ్ర నష్టాలు చవిచూడడంతో ఇబ్బంది పడ్డా. కానీ ఆ తర్వాత తిరిగి నా వ్యాపారాన్ని గాడిలో పెట్టగలిగా. ప్రస్తుతం నా వ్యాపార ప్రయాణం లాభదాయకంగానే ఉంది.

నాకొచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్వాతంత్ర్యం సాధించగలిగాను. బృందంతో కలిసి పనిచేస్తూ నా నైపుణ్యాల్ని పెంచుకుంటూ.. ఇతర అవకాశాల్నీ అందుకోగలిగాను.

ముంబయి నుంచి బెంగళూరు మకాం మార్చడం, అక్కడ నా సొంతింటిని నిర్మించుకోవడం నా జీవితంలోనే కీలక మలుపు. ప్రస్తుతం నా కలల సౌధంలో ఒంటరిగా, నాకోసం నేను జీవించడం చాలా సంతోషంగా ఉంది.

థెరపీతో ప్రశాంతతను సొంతం చేసుకోగలిగాను. స్వీయ ప్రేమను పెంచుకోవడానికి ప్రాధాన్యమిచ్చాను.

దూకుడుగా కాకుండా నెమ్మదిగా ఆలోచించి అడుగు ముందుకు వేయాలని నిర్ణయించుకున్నా. తద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాన్నీ కాపాడుకోవడం సులభమవుతుందన్న విషయం గ్రహించా.

ఈ నాలుగేళ్లలో నేను రచయితగానూ మారాను. ‘డివోర్స్‌ ఈజ్‌ నార్మల్‌’ పేరుతో నా తొలి పుస్తకం రాశాను.

ఒకప్పుడు అస్థిరత్వంతో కూడిన నా జీవితాన్ని క్రమంగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగాను.. కాబట్టే ఇప్పుడు నా జీవితంపై పూర్తి పట్టు సాధించగలిగాను. ఈ ప్రయాణంలో నా కుటుంబం, స్నేహితులు, నా సహోద్యోగులు నాకు ఎంతో అండగా నిలిచారు.. నన్ను ప్రోత్సహించారు..’ అంటూ తన మనసులోని మాటల్ని అక్షరీకరించింది శాశ్వతి. ఈ పోస్ట్‌కు తన ఇంటి ఆవరణలో ప్రశాంతంగా కాఫీ తాగుతోన్న ఓ అందమైన ఫొటోనూ జతచేసిందామె.

సూపర్‌ హీరో!

విడాకులు తీసుకోవడం తప్పు కాదని, అంత మాత్రానికే మన అస్తిత్వాన్ని కోల్పోయినట్లు కాదని అర్థం వచ్చేలా శాశ్వతి పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. చాలామంది స్పందిస్తూ.. ‘సూపర్‌ హీరో’, ‘విడాకులు తీసుకోవడం వల్ల జీవితం వ్యర్థం.. అన్న వైరాగ్య భావనలోకి కూరుకుపోయిన మహిళలందరికీ మీరే స్ఫూర్తి!’ అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే శాశ్వతి ఇలా స్ఫూర్తిదాయక పోస్టులు పెట్టడం ఇది తొలిసారేమీ కాదు.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె.. ఆ వేదికగా విడాకులపై సానుకూలంగా స్పందిస్తూ పోస్టులు పెడుతుంటుంది. అంతేకాదు.. ఈ విషయంలో ఇతర మహిళల సమస్యలు వింటూ వారికి తగిన సలహాలిస్తుంటుంది. తద్వారా వారిలో సానుకూల దృక్పథం నింపడంతో పాటు తమ కాళ్లపై తాము నిలబడేందుకు స్ఫూర్తినిస్తుంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్