ఈ రాధమ్మ... ఆడపిల్లల పాలిట ఆపద్భాందవి!

తనదింకా పుస్తకాలు పట్టుకునే వయసు. కానీ అప్పుడే పుస్తెల తాడు వేయాలనుకున్నారు. అయితే బాల్య వివాహాల కారణంగా తన తల్లి, అక్కలు పడిన బాధను ప్రత్యక్షంగా చూసి ‘నేను కూడా ఆ నరకంలోకి అడుగుపెట్టాలా?’ అని ధైర్యంగా ఎదురు తిరిగింది.

Published : 17 Sep 2021 17:42 IST

(Photo: Twitter)

తనదింకా పుస్తకాలు పట్టుకునే వయసు. కానీ అప్పుడే పుస్తెల తాడు వేయాలనుకున్నారు. అయితే బాల్య వివాహాల కారణంగా తన తల్లి, అక్కలు పడిన బాధను ప్రత్యక్షంగా చూసి ‘నేను కూడా ఆ నరకంలోకి అడుగుపెట్టాలా?’ అని ధైర్యంగా ఎదురు తిరిగింది. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మెడలో మూడు ‘ముళ్లు’ పడకుండా అడ్డుకుంది. ఇప్పుడు మళ్లీ పుస్తకాల బ్యాగు తీసుకుని పాఠశాలకెళుతోంది. ఆమే జార్ఖండ్‌లోని మధుబన్‌ పంచాయతీకి చెందిన 16 ఏళ్ల రాధా పాండే.

జిల్లా బ్రాండ్‌ అంబాసిడర్‌గా!

చిన్న వయసులో పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రుల నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించి గెలిచిన రాధ ధైర్యసాహసాలను అధికారులు మెచ్చుకున్నారు. ఆమెను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా బాల్యవివాహాలను నిర్మూలించేందుకు కోడెర్మా జిల్లా బ్రాండ్‌ అంబాసిడర్‌గా రాధను నియమించారు. తనకిచ్చిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తోన్న ఈ టీనేజ్‌ గర్ల్‌.. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తోంది. అదేవిధంగా ఎక్కడైనా ఇలాంటి వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే అక్కడ ప్రత్యక్షమై వాటిని ఆపేస్తోంది. అలా ఇప్పటివరకు 20కి పైగా బాల్య వివాహాలను అడ్డుకుందీ డేరింగ్‌ గర్ల్.

అలా నా పెళ్లిని ఆపాను!

‘ఉన్నత చదువులు అభ్యసించి టీచర్‌ కావాలన్నది నా కోరిక. కానీ మా నాన్న నాకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలనుకున్నాడు. పక్క గ్రామానికి చెందిన 23 ఏళ్ల అబ్బాయితో పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్‌ చేశాడు. ‘నాకిప్పుడే పెళ్లి వద్దు. నేను బాగా చదువుకోవాలి’ అని వేడుకున్నా ఎవరూ వినలేదు. చివరకు పెళ్లి చేసుకోబోయే వరుడి తండ్రితో కూడా మాట్లాడాను. వారూ నా మాటలను పెడచెవిన పెట్టారు. దీంతో చివరి ప్రయత్నంగా కైలాస్‌ సత్యార్థి చిల్డ్రన్‌ ఫౌండేషన్ (KSCF)కు సమాచారమిచ్చాను. వారి సిబ్బంది వెంటనే మా ఇంటికి వచ్చారు. ‘బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. మా మాట కాదని మీరు ముందుకు వెళితే మాత్రం పోలీస్‌ స్టేషన్లో కూర్చోవాల్సి ఉంటుంది’ అని అమ్మానాన్నలతో పాటు వరుడి తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దీంతో నా పెళ్లి ఆగిపోయింది’ అని చెప్పుకొచ్చిందీ టీనేజ్‌ గర్ల్.

కఠిన పరిస్థితులకు ఎదురు నిలిచి మరీ తన పెళ్లి జరగకుండా చేసింది రాధ . ఈ విషయం తెలుసుకున్న జిల్లా డిప్యూటీ కమిషనర్‌ ఆమె ఇంటికి వచ్చారు. తన ధైర్యసాహసాలను మెచ్చుకుని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ‘ముఖ్యమంత్రి సుకన్య స్కీం’ పథకం కింద నెలకు 2 వేల రూపాయలు ఆ అమ్మాయికి అందేలా చేశారు. ఇక తల్లిదండ్రులకు రేషన్‌ కార్డు, వైద్యం కోసం గోల్డెన్‌ కార్డు, నెలవారీ పెన్షన్‌లు మంజూరు చేశారు. వీటితో పాటు జిల్లాలో బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలని మహిళా శిశు సంక్షేమ అధికారులకు సూచించారు. ఇందుకు రాధను జిల్లా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు.

బాల్యవివాహాలను అడ్డుకుంటూ!

KSCF సిబ్బంది, అధికారులతో కలిసి బాల్య వివాహాల అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తోందీ టీనేజ్‌ గర్ల్‌. ఇక ఎక్కడైనా ఇలాంటి వివాహాలు జరిగినట్లు తెలిసినా అధికారులతో కలిసి అక్కడకు వెళుతోంది. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తోంది. అలా ఇప్పటివరకు జిల్లాలో 20కి పైగా బాల్య వివాహాలను అడ్డుకుని ఆడపిల్లల పాలిట ఆపద్భాందవిగా నిలుస్తోంది.

‘మాది సంప్రదాయ కుటుంబం. కట్టుబాట్లు, ఆచారాలంటూ మా అమ్మ, అక్కకు కూడా చిన్న వయసులోనే పెళ్లి చేసేశారు. ఫలితంగా వారు ఎదుర్కొన్న ఇబ్బందులను నేను ప్రత్యక్షంగా గమనించాను. మరి తెలిసి..తెలిసి నేనెలా ఆ నరకంలోకి అడుగుపెట్టాలి? ఇక్కడ నాలాంటి ఎందరో చదువుకుంటున్న అమ్మాయిలు తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గి పెళ్లి చేసుకుంటున్నారు. తమ బంగారు భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. అందుకే నా భవిష్యత్‌ను నిర్ణయించే అధికారం నా కుటుంబానికి ఇవ్వకూడదనుకున్నాను. కాలం మారుతున్నట్లే తల్లిదండ్రులు కూడా తమ ఆలోచనలను మార్చుకోవాలి. తమ ఆడబిడ్డలను చదువుకోనివ్వాలి. వారి కలలు నెరవేర్చుకునేందుకు తోడ్పాటునివ్వాలి’ అని అంటోందీ డేరింగ్ గర్ల్.

ఇక తన లక్ష్యం గురించి అడిగితే ‘ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో చదవాలన్నది నా కోరిక. టీచర్‌గా స్థిరపడాలనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది రాధ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్