Published : 01/03/2022 20:56 IST

షీట్‌మాస్క్‌తో మెరిసిపోదామిలా..!

అందంగా కనిపించేందుకు క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్‌తో పాటు అప్పుడప్పుడూ ఫేస్‌మాస్క్‌లు వేసుకోవడం, ఫేషియల్స్ చేయించుకోవడం వంటివి మామూలే. ఇటు ఇంట్లో అందుబాటులో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే కాదు.. అటు మార్కెట్లో లభ్యమయ్యే ఫేషియల్ క్రీమ్‌లతోనూ మాస్క్‌లు వేసుకుంటూ ఉంటాం. అయితే వీటి కంటే షీట్‌మాస్క్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందంటున్నారు సౌందర్య నిపుణులు.. సంప్రదాయ మాస్కుల కంటే వీటిని ఉపయోగించి చర్మాన్ని మరింత కాంతిమంతంగా, మృదువుగా మార్చుకునే వీలుంటుందట. మరి, మనమూ వీటి గురించి తెలుసుకొని ఈ తరహా మాస్కులను ప్రయత్నిద్దాం రండి..

ఏంటీ మాస్కులు?

షీట్ మాస్కులంటే ముఖం ఆకృతిలో ఉన్న ఫ్యాబ్రిక్ షీట్.. పేపర్, ఫ్యాబ్రిక్ వంటివన్నీ కలిపి తయారుచేసిన ఈ మాస్క్‌ని పోషకాలు నిండిన సీరంలో నానబెట్టి తర్వాత ఆరబెడతారు. మనం చూసే జెల్ లేదా పేస్ట్‌లాంటి ఫేస్‌మాస్క్‌లకి ఇది ఎంతో భిన్నమైంది. సాధారణంగా ఫేస్‌మాస్క్ వేసుకోవాలంటే మిశ్రమం నుంచి కొద్దిమొత్తాన్ని చేతిలోకి తీసుకొని దాన్ని ముఖానికి రుద్దుకోవడం చేస్తుంటాం. కానీ ఈ తరహా మాస్కులను వేసుకుంటే చేతులు కడుక్కోవడం, ముఖానికి రుద్దుకోవడం వంటి పనులు కాస్త ఎక్కువగా ఉంటాయి. వీటికి బదులుగా షీట్ మాస్క్‌తో మరింత సులువుగా, వేగంగా మోముని మెరిపించవచ్చు. కేవలం కాసేపు దీన్ని ముఖం మీద ఉంచుకుంటే చాలు. అయితే ఇలా షీట్ పెట్టుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం అస్సలు మర్చిపోకూడదు. ఇరవై నుంచి ముప్ఫై నిమిషాల పాటు దీన్ని ముఖంపై ఉంచి తీసేస్తే సరిపోతుంది. చదువుకుంటున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు.. ఈ షీట్‌ని ముఖంపై ఉంచి మన పని మనం చేసుకోవచ్చు.

ఎన్నో ప్రయోజనాలు..

ఈ షీట్ మాస్కులు ముందుగా దక్షిణ కొరియాలో ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించి సౌందర్య ఉత్పత్తుల పరిశ్రమలో తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాయి. ఎంతోమంది సెలబ్రిటీలు వీటిని తరచూ ఉపయోగిస్తూ తమ ఫొటోలను పోస్ట్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. విటమిన్లు, చర్మానికి మేలు చేసే కెమికల్స్‌లో ముంచి ఆరబెట్టిన ఈ తరహా మాస్కుల వల్ల చర్మానికి సాధారణ మాస్కుల కంటే మరింత మేలు జరుగుతుందట. సాధారణ మాస్కులు చాలా త్వరగా ఆరిపోతాయి. కానీ ఈ షీట్ మాస్కుల్లో ఉన్న ఫ్యాబ్రిక్ తేమను బయటకు పోకుండా కాపాడుతుంది. దీంతో ఎక్కువసేపు మాస్కుని ధరించి ఉంచుకునే వీలుంటుంది. దీనివల్ల ఎక్కువ మోతాదులో చర్మానికి అవసరమైన విటమిన్లు, ఇతర పదార్థాలు చర్మం లోపలి పొరల్లోకి వెళ్లి సాధారణం కంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది.

జాగ్రత్తలు తప్పనిసరి..

షీట్ మాస్కులు ఎంత ప్రయోజనకరమైనవి అయినా.. వాటి వినియోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మాస్క్ వేసుకోవడానికి ముందు మన చర్మాన్ని చక్కటి క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి. కావాలంటే ఎక్స్‌ఫోలియేషన్ కూడా ముందే చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మన చర్మంలో ఉన్న మలినాలను ముందే తొలగిస్తే మాస్క్ ద్వారా చర్మానికి పోషకాలు ఎక్కువగా అందుతాయి. కానీ ఒకసారి మాస్క్ వేసి తొలగించిన తర్వాత కనీసం రెండు, మూడు రోజుల వరకూ ఎక్స్‌ఫోలియేషన్ జోలికి వెళ్లకూడదు. అలాగే మాస్క్‌ని తీసేసిన తర్వాత కూడా ఎప్పుడూ చర్మాన్ని తుడుచుకోవడం కానీ కడగడం కానీ చేయకూడదు. దీనివల్ల చర్మం పైపొరల్లో ఉండే పోషకాలు తొలగిపోతాయి. మాస్క్ తీసి ముఖాన్ని అలాగే ఆరనివ్వాలి. ఒకవేళ తొలగించిన తర్వాత ముఖం జిడ్డుగా అనిపిస్తే ఆ మాస్క్ మీకు తగినది కాదని అర్థం. అలాంటి మాస్క్‌ని మరోసారి ఉపయోగించకండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని