శాకాహారంతో ఆరోగ్యంగా ఉన్నా..!

కొంతమంది చికెన్‌, మటన్‌ తినకుండా ఒక్క వారమైనా ఉండలేరు.. కానీ తాను మాత్రం పూర్తి శాకాహారిగా మారి దాదాపు రెండేళ్లవుతోందంటోంది బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌. తన ఆహారం కోసం మరో ప్రాణిని హింసించకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానంటోంది. ఇలా తన ఆహార నియమాలు మార్చుకున్నాక ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానని చెబుతోన్న ఈ చక్కనమ్మ.. దీని ద్వారా పర్యావరణానికీ మేలు జరుగుతుందన్న సంతృప్తి తనకు దక్కుతోందంటోంది.

Updated : 30 Jul 2021 20:12 IST

కొంతమంది చికెన్‌, మటన్‌ తినకుండా ఒక్క వారమైనా ఉండలేరు.. కానీ తాను మాత్రం పూర్తి శాకాహారిగా మారి దాదాపు రెండేళ్లవుతోందంటోంది బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌. తన ఆహారం కోసం మరో ప్రాణిని హింసించకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానంటోంది. ఇలా తన ఆహార నియమాలు మార్చుకున్నాక ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానని చెబుతోన్న ఈ చక్కనమ్మ.. దీని ద్వారా పర్యావరణానికీ మేలు జరుగుతుందన్న సంతృప్తి తనకు దక్కుతోందంటోంది. ఈ నేపథ్యంలో శాకాహారంపై తనకున్న మక్కువను, మూగజీవాలపై ప్రేమను చాటుతూ ఇటీవలే ఇన్‌స్టాలో ఓ వీడియో పెట్టింది శ్రద్ధ.

పర్యావరణానికి హాని చేయడం ఇష్టం లేక, మూగ జీవాల్ని హింసించకూడదన్న సదుద్దేశంతో ఎంతోమంది తారలు శాకాహారులుగా, వీగన్లుగా మారుతున్నారు. ఈ జాబితాలో రెండేళ్ల క్రితం శ్రద్ధ కూడా చేరిపోయింది. మార్చుకున్న ఈ ఆహార నియమాల వల్ల తానెంతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానంటోందీ ముద్దుగుమ్మ.

 

ఇది నా సొంత నిర్ణయం!

‘నేను శాకాహారిగా మారి రెండేళ్లు పూర్తయింది. మూగ జీవాలపై నాకున్న ప్రేమ, నా వల్ల పర్యావరణానికి హాని కలగకూడదన్న ఆలోచనే నన్ను ఈ దిశగా నడిపించింది. ఇది పూర్తిగా నా సొంత నిర్ణయం. ఇందులో ఎవరి ప్రమేయం, ఒత్తిడి లేదు. ఏదేమైనా శాకాహారిగా మారిపోయినప్పట్నుంచి ఎంతో సంతోషంగా, ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నా.. ఈ తేడా నాకు స్పష్టంగా తెలుస్తోంది. కేవలం నా ఆహారం కోసం మరో ప్రాణిని హింసించడం సరికాదనిపించింది. మూగ జీవాలు, జంతువులు మన దగ్గర్నుంచి ప్రేమను ఆశిస్తాయి. అలాంటప్పుడు వాటిని చంపడం ఎంత వరకు సబబు? అందుకే ఇకనైనా కరుణతో జీవిద్దాం.. మూగజీవాలపై జాలి చూపిద్దాం..’ అంటోంది శ్రద్ధ. ఇలా తన స్ఫూర్తిదాయక సందేశంతో మరోసారి శాకాహారం ప్రాముఖ్యాన్ని తెలిపిందీ బాలీవుడ్‌ బేబ్.

ఆ విషయంలో రాజీ పడను!

శాకాహారిగా మారినంత మాత్రాన తీసుకునే ఆహారం విషయంలో అస్సలు రాజీ పడనంటోంది శ్రద్ధ. ‘నేనో పెద్ద ఫుడీని! ఏ పదార్థాన్నైనా పూర్తిగా ఆస్వాదిస్తూ తినడమంటే నాకు భలే ఇష్టం. అలాగని ఫిట్‌నెస్‌ పేరుతో అది తినకూడదు.. ఇది తినకూడదు.. అన్న నియమమేమీ పెట్టుకోను. వడాపావ్‌ తినాలనిపిస్తే తినేస్తాను.. ఆపై దాని ద్వారా నా శరీరంలోకి చేరిన క్యాలరీలను కరిగించుకోవడానికి వర్కవుట్‌ చేస్తా. లేదంటే ఆ రోజు రాత్రి భోజనంలో కేవలం సూప్‌ మాత్రమే తీసుకుంటా. శాకాహారిగా మారిపోయాక నేను ఎలాంటి ఆహారం తీసుకుంటున్నానన్న సందేహం చాలామందిలో ఉంది. సింపుల్‌.. బాదం పాలు ఎక్కువగా తీసుకుంటున్నా.. పండ్లు, అన్ని రకాల కాయగూరల్ని ఆహారంలో చేర్చుకుంటున్నా.. వీటి ద్వారానే నా శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతున్నాయి..’ అంటూ తన వెజిటేరియన్‌ డైట్‌ సీక్రెట్స్‌ని బయటపెట్టిందీ సొగసరి.

శాకాహారం.. ఆరోగ్యకరం!

శాకాహారం తీసుకోవడం వల్ల సరిపడా ప్రొటీన్లు, ఇతర పోషకాలు శరీరానికి సంపూర్ణ స్థాయిలో అందవనేది చాలామంది భావన. కానీ కేవలం శాకాహారం తీసుకుంటూనే ఆరోగ్యంగా, ఆనందంగా జీవించచ్చని నిపుణులు చెబుతున్నారు. మాంసాహారం కంటే శాకాహారం, మొక్కల ఆధారిత పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్లు 64 శాతం అధికంగా ఉంటాయట! ఫలితంగా రక్తంలో అనవసర కొవ్వులు పేరుకుపోకుండా ఇవి నియంత్రిస్తాయి. ఫలితంగా శరీరంలో వాపు.. వంటి సమస్యలు రాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. ఇదనే కాదు.. శాకాహారంతో ఆరోగ్యపరంగా బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు.

గుండెకు కొండంత అండ!

శాకాహారం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు. శాకాహారంలో శరీరానికి మేలు చేసే సంతృప్త కొవ్వులు (శ్యాచురేటెడ్ ఫ్యాట్స్) ఎక్కువగా ఉంటాయి. అదే హానికారక కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. గుండెకు హాని చేసే చెడు కొవ్వులు వీటిలో అసలు ఉండవు. అలాగే వీటి నుంచి శరీరానికి అందే పోషకాలూ ఎక్కువే! ఫలితంగా ఎలాంటి అనారోగ్యాలూ దరిచేరవు. హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. రెడ్ మీట్ తినే వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు సాధారణ వ్యక్తులతో పోలిస్తే 50 శాతం ఎక్కువగా ఉంటాయట. అదే మాంసాహారుల కంటే గుండెపోటు ముప్పు శాకాహారుల్లో 24 శాతం తక్కువగా ఉంటుందంటోందీ అధ్యయనం. అంతేకాదు.. గుండెపోటు వచ్చిన వారిలో మాంసాహారం మానేసిన కొంతకాలం తర్వాత ఆ లక్షణాలు చాలావరకు తగ్గాయని కూడా ఈ అధ్యయనంలో తేలింది.

క్యాన్సర్ ముప్పూ తక్కువే!

మాంసాహారులతో పోల్చితే శాకాహారులకు క్యాన్సర్ ముప్పు చాలా తక్కువగా ఉంటుందట. మాంసాహారం మానేసిన వారిలోనూ క్యాన్సర్ ముప్పు తగ్గడాన్ని గమనించామంటున్నారు నిపుణులు. దీనికి కారణం.. మాంసాహారం వండినప్పుడు విడుదలయ్యే కార్సినోజెన్స్‌కి దూరంగా ఉండడమేనని వారు నిర్ధారించారు. ప్రాసెస్‌ చేసిన మాంసం తినే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ సర్వేలో తేలింది. ఇందుకు కారణం.. వీటిలో ఉండే కార్సినోజెన్స్ మాత్రమే కాదు.. మాంసాహారం తీసుకోవడం వల్ల వాటి నుంచి లభించే కొవ్వులు శరీరంలో ఎక్కువగా చేరిపోతాయి. దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత ఎదురై, అది హార్మోన్ సంబంధిత క్యాన్సర్లకు దారితీస్తుందట. అమెరికాకి చెందిన ట్రయాథ్లెట్‌ రుత్ హెడ్రిచ్ మొదట క్యాన్సర్ బారిన పడింది. అయితే దాన్నుంచి తేరుకున్న ఆమె తన ఆహారపుటలవాట్లను పూర్తిగా మార్చుకుంది. ఈ క్రమంలో మాంసాహారాన్ని మానేసిన ఆమె క్యాన్సర్ జయించడమే కాదు.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతోంది.

బరువు అదుపులో!

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువశాతం మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యమైనది వూబకాయం. దీనికి దారితీసే ముఖ్య కారణాల్లో మాంసాహారం కూడా ఒకటంటున్నారు నిపుణులు. శాకాహారిగా మారిపోవడం వల్ల బరువు అదుపులో ఉండడంతో పాటు ఇతర అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ప్రపంచం మొత్తం మీద శాకాహారులు మాంసాహారుల కంటే సగటున సుమారు పది కిలోలు తక్కువ బరువుంటారట. దీనికి వారి ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లే కారణమని చెప్పవచ్చు.

ఆయుష్షు పెరుగుతుంది!

శాకాహారం తింటే వయసు తగ్గుతుందట. అదేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే.. మాంసాహారం తినేవారితో పోల్చితే శాకాహారులు సగటున ఆరు సంవత్సరాలు ఎక్కువ జీవిస్తారట. అంతేకాదు.. నవయవ్వనంగా కనిపిస్తారట. దీనికి వారి ఆహారంలో ఉండే ప్రొటీన్లే కారణమంటున్నారు నిపుణులు. అంతేకాదు.. శాకాహారులకు బీపీ, డయాబెటిస్ వంటి.. దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశాలూ తక్కువేనట! అన్ని రకాల పోషకాలూ వారికి అందుతాయి కాబట్టి పోషకాల లేమితో వారికి ఎలాంటి సమస్యలూ ఎదురవ్వవు. తద్వారా రోగనిరోధక శక్తి మెరుగుపడి చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

ఇవి కూడా!

* వెజిటేరియన్లు అందులోనూ వీగన్‌ డైట్‌ పాటించే వారిలో ఆస్తమా లక్షణాలు చాలావరకు తగ్గుతాయంటోంది ఓ అధ్యయనం! ఇలా ఓ ఏడాది పాటు కచ్చితంగా ఈ ఆహార నియమాలు పాటిస్తే మందులపై అంతగా ఆధారపడాల్సిన అవసరం ఉండదంటోంది.

* మాంసాహారం తీసుకున్న వారి శరీరం నుంచి క్యాల్షియం ఎక్కువగా బయటికి వెళ్లిపోతుందట! తద్వారా ఎముకలు బలహీనపడడం, ఆస్టియోపొరోసిస్‌.. వంటి సమస్యలొస్తాయి. అదే శాకాహారం ఎముకల్ని దృఢంగా మార్చడంతో పాటు వీటికి సంబంధించిన ఎలాంటి సమస్యలు దరిచేరకుండా చేస్తుందట!

ఇలా ఎలా చూసినా శాకాహారం ఆరోగ్యకరం అన్న విషయం అర్థమవుతోంది కదూ. మరి, మీరు కూడా శాకాహారులా? జంతువుల నుంచి వచ్చే ఏ పదార్థాలూ ముట్టుకోకుండా వీగన్లుగా మారారా? అయితే మీ డైట్‌ సీక్రెట్స్‌ని, ఆరోగ్య రహస్యాల్ని మాతో పంచుకోండి. అందరికీ ఆరోగ్య పాఠాలు నేర్పండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్