కృత్రిమ గుండె.. కాలిపోయిన ముఖం.. అయితేనేం ‘మిస్ వరల్డ్ అమెరికా’ అయింది!

అందరి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే తన హృదయ స్పందన నిమిషానికి 20 సార్లు మాత్రమే. అందుకే పేస్‌మేకర్ మేకర్‌ అమర్చిన డాక్టర్లు డ్యాన్స్ చేయద్దన్నారు. కానీ పట్టుదలతో గంటల తరబడి డ్యాన్స్ ప్రాక్టీస్‌ చేసింది. మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

Updated : 05 Oct 2021 17:58 IST

(Photo: Instagram)

అందరి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే తన హృదయ స్పందన నిమిషానికి 20 సార్లు మాత్రమే. అందుకే పేస్‌మేకర్ మేకర్‌ అమర్చిన డాక్టర్లు డ్యాన్స్ చేయద్దన్నారు. కానీ పట్టుదలతో గంటల తరబడి డ్యాన్స్ ప్రాక్టీస్‌ చేసింది. మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఓ కారు ప్రమాదంలో ముఖం ఎడమవైపు పూర్తిగా కాలిపోయింది. ‘ఇక అందాల పోటీలకు ఏం వెళుతుందిలే’ అనుకున్నారు. కానీ అందరూ అసాధ్యమనుకునే పనులను సుసాధ్యం చేసే అలవాటుతో ఏకంగా ‘మిస్ వరల్డ్‌ అమెరికా’ కిరీటాన్నే అందుకుంది. ఆమే 25 ఏళ్ల శ్రీ సైని.

భారత సంతతి నుంచి..

లాస్‌ ఏంజెలిస్‌లోని ‘మిస్‌ వరల్డ్‌ అమెరికా’ ప్రధాన కార్యాలయంలో ఇటీవల ‘మిస్‌ వరల్డ్‌ అమెరికా- 2021’ పోటీలు జరిగాయి. వివిధ దేశాల అందగత్తెలు ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ కోసం పోటీ పడ్డారు. అయితే ఆ అదృష్టం మాత్రం భారత సంతతికి చెందిన శ్రీ సైనీకి దక్కింది. మాజీ మిస్‌ వరల్డ్‌లు డయానా హెడెన్, థాన్యా మెమే చేతుల మీదుగా ఈ అందాల కిరీటం అందుకుందీ యంగ్‌ బ్యూటీ. ఈ క్రమంలోనే ‘మిస్‌ వరల్డ్‌ అమెరికా’ టైటిల్‌ గెల్చుకున్న తొలి భారత సంతతి మహిళగా చరిత్ర సృష్టించింది.

అందం... అంతే మంచి మనసు!

ఈ సందర్భంగా ‘మిస్‌ వరల్డ్‌ అమెరికా’ తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో శ్రీ ఫొటోలు, వీడియోలను పంచుకుంది. ‘మిస్‌ వరల్డ్‌ అమెరికా’ అయిన శ్రీ..'నేషనల్ బ్యూటీ విత్ పర్పస్’ అంబాసిడర్ గా ప్రతిష్ఠాత్మక స్థానంలో ఉంది. అందంతో పాటు అంతే మంచి మనసున్న శ్రీ సేవా దృక్పథమే ఆమెను ఈ అందాల కిరీటానికి దగ్గర చేసింది. వైద్యులు వెళ్లలేని సరిహద్దు ప్రాంతాల్లో తను చేసిన సేవా కార్యక్రమాలను యునిసెఫ్, సుసాన్‌ జి. కొమెన్ (బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌, అమెరికా) వంటి అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. అందానికి అసలైన నిర్వచనమేంటో చెప్పిన ఆమె మా మిస్‌ వరల్డ్‌ అమెరికా మిషన్‌పై అవగాహన కల్పిస్తుంది’ అని ప్రశంసించింది.

డాక్టర్లు వద్దన్నా డ్యాన్స్‌ నేర్చుకుంది!

పంజాబ్‌లోని లూథియానాలో 1996 జనవరి 6న జన్మించింది శ్రీ. అయితే తనకు 5 ఏళ్ల వయసున్నప్పుడే కుటుంబం మొత్తం అమెరికాలోని వాషింగ్టన్‌కు వచ్చి స్థిరపడింది. దురదృష్టవశాత్తూ స్కూల్కెళ్లే వయసులోనే గుండె సంబంధిత అనారోగ్యం బారిన పడింది శ్రీ. ఆమె హృదయం నిమిషానికి కేవలం 20 సార్లు మాత్రమే కొట్టుకునేది. దీంతో వైద్యులు ఆమెకు పేస్‌మేకర్ (కృత్రిమ గుండె) అమర్చారు. అయితే అందరి పిల్లల్లా కాకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు. డ్యాన్స్‌, ఆటలు మొదలైన వాటికి దూరంగా ఉండమన్నారు. కానీ ఎక్కువ రోజులు అలా ఉండలేకపోయింది శ్రీ. పట్టుబట్టి మరీ డ్యాన్స్ ప్రాక్టీస్‌ చేసింది. డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు సాధించింది.

ముఖం కాలిపోయినా!

గుండె సమస్య చాలదన్నట్లు 12 ఏళ్ల వయసులోనే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది సైని. యాక్సిడెంట్‌లో ఆమె ముఖం ఎడమవైపు భాగం పూర్తిగా కాలిపోయింది. మామూలు మనిషి కావడానికి సుమారు ఏడాది పైనే పడుతుందని డాక్టర్లు చెప్పారు. అయితే శ్రీ మాత్రం అన్ని రోజులు ఇంట్లో ఉండదలుచుకోలేదు. వీలైనంత త్వరగా విషాదం నుంచి బయటపడాలనుకుంది. అందుకే కొన్ని వారాలు విశ్రాంతి తీసుకుని మళ్లీ తరగతి గదిలోకి అడుగుపెట్టింది.

ఆ సమస్యలపై అవగాహన కల్పిస్తూ!

గుండె సమస్య, కారు ప్రమాదం... ఈ రెండూ శ్రీ వ్యక్తిగత జీవితంపై ఎంతగానో ప్రభావం చూపాయి. దీంతో గుండె, మానసిక ఆరోగ్యానికి సంబంధించి తన అనుభవాలను అందరితో పంచుకుంది. ఇందులో భాగంగా వేలాది ఆర్టికల్స్ రాసింది. అదేవిధంగా మోటివేషనల్‌ స్పీకర్‌గా వివిధ దేశాల్లో పర్యటించి ప్రజల్లో చైతన్యం పెంచే ప్రయత్నం చేసింది.

మధ్యలోనే ఆస్పత్రి పాలైంది!

ఇక చదువు విషయానికొస్తే...యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ నుంచి జర్నలిజం పూర్తి చేసింది శ్రీసైని. అదేవిధంగా హార్వర్డ్‌ యూనివర్సిటీ, యేల్ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా నుంచి పలు సమ్మర్‌ కోర్సులు చేసింది. బ్యాలె డ్యాన్స్‌లో శిక్షణ కూడా తీసుకుంది. ఆ తర్వాత అందాల పోటీల్లో తన అదృష్టం పరీక్షించుకోవడం మొదలుపెట్టింది. 2017లో ‘మిస్‌ ఇండియా యూఎస్‌ఏ’, 2018లో ‘మిస్‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌’ టైటిళ్లు గెల్చుకుంది. ‘మిస్‌ వరల్డ్‌ అమెరికా -2019’ పోటీల్లో పాల్గొన్నప్పటికీ దురదృష్టవశాత్తూ గుండె సమస్య తిరగపెట్టింది. దీంతో పోటీల మధ్యలోనే ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. గతేడాది జరిగిన ఇవే పోటీల్లో టాప్- 10 ఫైనలిస్టుగా నిలవడంతో పాటు ‘టాప్‌ ఇన్ఫ్లుయెన్సర్ ’, ‘పీపుల్స్‌ ఛాయిస్‌ నేషనల్‌’ తదితర అవార్డులు గెల్చుకుంది.

అమ్మానాన్నలకే ఈ క్రెడిట్!

తాజాగా ‘మిస్‌ వరల్డ్‌ అమెరికా’ కిరీటం అందుకున్న శ్రీ తన తల్లిదండ్రులదే ఈ క్రెడిట్‌ అంటోంది. ‘ఇప్పుడు నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఈ ఘనత అంతా మా అమ్మానాన్నలకే చెందాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారు నాకు నచ్చిందే చేయమని ప్రోత్సహించేవారు. వారి సహకారంతోనే ఇక్కడి వరకు రాగలిగాను. ఈ ప్రతిష్ఠాత్మక కిరీటంతో నన్ను అలంకరించినందుకు మిస్‌ వరల్డ్‌ అమెరికాకు ధన్యవాదాలు’ అని అంటోందీ యంగ్‌ బ్యూటీ.

‘బ్యూటీ విత్‌ పర్పస్’!

శ్రీకి అందమైన ముఖంతో పాటు అంతకన్నా మంచి మనసు ఉంది. చిన్నప్పటి నుంచి పేదరికాన్ని చూస్తూ పెరిగిన ఆమె చుట్టూ ఉండేవాళ్లకి తన వంతు సహాయం చేస్తోంది. ఇక కరోనా సమయంలో ‘బ్యూటీ విత్‌ పర్పస్‌’ అనే క్యాంపెయిన్‌కి నేషనల్‌ అంబాసిడర్‌గా వ్యవహరించిన ఆమె కొవిడ్‌ రిలీఫ్‌ ఫండ్ కోసం పెద్ద ఎత్తున నిధులు సేకరించింది. యునిసెఫ్, అమెరికాలోని సుసాన్‌ జి. కొమెన్‌ లాంటి అంతర్జాతీయ సంస్థలు శ్రీ సేవా కార్యక్రమాలను గుర్తించాయంటే ఆమెకున్న ఔదార్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

కేవలం అందగత్తెగానే కాదు సోషల్‌ యాక్టివిస్ట్‌, మోటివేషనల్‌ స్పీకర్‌గా రాణిస్తూ ‘మల్టీ ట్యాలెంటెడ్‌’ అనిపించుకుంటోంది శ్రీ. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వివిధ సందర్భాల్లో షేర్‌ చేసుకున్న కొన్ని ఫొటోలు చూద్దాం రండి.
















Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్