Published : 27/05/2022 18:51 IST

Blackswan : కొరియన్‌ పాప్‌ బ్యాండ్‌లో మన శ్రేయ!

(Photos: Instagram)

సంగీతానికి రాళ్లను కరిగించే శక్తి కూడా ఉందంటుంటారు. అందులోనూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పాప్‌ సంగీతం వింటూ మైమరచిపోని మనసుండదంటే అతిశయోక్తి కాదు. మరి, అలాంటి మ్యూజిక్‌ బ్యాండ్‌లో పాడే అవకాశం రావడమంటే పెట్టి పుట్టాలి. అంతటి అరుదైన అవకాశాన్ని తాజాగా అందుకుంది ఒడిశా రాక్‌స్టార్‌ శ్రేయా లెంకా. సంగీతం, డ్యాన్స్‌ అంటే ప్రాణం పెట్టే ఈ చిన్నది.. కొరియన్‌ పాప్‌ బ్యాండ్‌ బ్లాక్‌స్వాన్‌లో చేరిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ యంగ్‌ సెన్సేషన్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి..

ఆఖరి రెండు స్థానాల్లో ఆ ఇద్దరు..!

పాప్‌ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులున్నారని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటి పాప్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌లలో దక్షిణ కొరియాకు చెందిన ‘బ్లాక్‌స్వాన్‌’ ఒకటి. 2020లో మొత్తం ఐదుగురు అమ్మాయిలతో ఏర్పడిన ఈ సంగీత బృందం నుంచి అదే ఏడాది నవంబర్‌లో హేమే అనే అమ్మాయి తప్పుకుంది. దీంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌ వేదికగా ఆడిషన్స్‌ నిర్వహించింది ఈ బ్యాండ్‌ మాతృక సంస్థ డీఆర్‌ మ్యూజిక్‌. ఇందులో భాగంగానే భారత్‌కు చెందిన శ్రేయా లెంకా, బ్రెజిల్‌ అమ్మాయి గ్యాబ్రియెలా దాల్సిన్‌ తుది పోటీలకు అర్హత సాధించారు. నెల రోజుల సుదీర్ఘ శిక్షణలో భాగంగా పోటాపోటీగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వీరిద్దరినీ ‘బ్లాక్‌స్వాన్‌’ పాప్‌ బృందంలో ఐదు, ఆరు స్థానాల కోసం ఎంపిక చేశారు. దీంతో కొరియన్‌ పాప్‌ బ్యాండ్‌లో చేరిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది శ్రేయ.

‘Cygnus Project కోసం శ్రేయ, దాల్సిన్‌లను ఎంపిక చేశాం. ప్రతిభ ఉన్న పాప్‌ స్టార్స్‌ని ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇవ్వడమే ఈ ప్రాజెక్ట్‌ ముఖ్యోద్దేశం. వీరిద్దరూ ఈ ప్రాజెక్ట్‌ తొలి తరం స్టార్స్‌. బ్లాక్‌స్వాన్‌లో మమేకమైన వీళ్ల ప్రతిభను త్వరలోనే మీకు పరిచయం చేస్తాం..’ అంటూ అధికారిక పోస్ట్‌ పెట్టింది డీఆర్‌ మ్యూజిక్.

యోగా రక్తంలోనే ఉంది!

ఒడిశా స్టీల్‌ సిటీగా పేరుగాంచిన రూర్కెలాలో 2003లో జన్మించింది శ్రేయా లెంకా. యోగా అంటే ప్రాణం పెట్టే కుటుంబంలో పుట్టిన ఆమె.. పెరిగి పెద్దయ్యే క్రమంలో ఈ వ్యాయామంపై ప్రేమ పెంచుకుంది. దీంతో చిన్న వయసు నుంచే తన కుటుంబ సభ్యులతో పాటు యోగాసనాలు వేయడం సాధన చేసేది. అంతేకాదు.. ఒడిస్సీ నృత్యం సాధన చేసే అక్కను చూసి తానూ ఎలాగైనా ఆ నృత్యం నేర్చుకోవాలని పట్టుబట్టింది. ఇక అప్పటికే యోగాతో తన శరీరాన్ని విల్లులా వంచడం అలవాటు చేసుకున్న శ్రేయకు ఒడిస్సీ నేర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాలేదు. ఇలా తనలోని తపనను గుర్తించిన ఆమె తల్లిదండ్రులు ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే అయినా వాటన్నింటినీ పక్కన పెట్టి ఆమెను వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఇలా తన పట్టుదల, ఇంట్లో వాళ్ల ప్రోత్సాహంతో స్థానికంగా పలు నృత్య ప్రదర్శనల్లో సత్తా చాటింది శ్రేయ. పలు అవార్డులు సైతం అందుకుంది. ఒడిస్సీతో పాటు పలు సమకాలీన నృత్య రీతుల్ని సైతం అవపోసన పట్టింది.

ఆ క్రెడిటంతా మా బామ్మదే!

నిజానికి ఇలా డ్యాన్సే కాదు.. అద్భుతమైన గాత్రం ఈ యంగ్‌ సెన్సేషన్‌కి దేవుడిచ్చిన వరం అంటుంటారు ఆమె సన్నిహితులు. అయితే తనలో దాగున్న ఈ ప్రతిభను గుర్తించింది మాత్రం తన బామ్మే అంటోంది శ్రేయ.

‘నాకు నృత్యం అంటే ఎంత మక్కువో.. సంగీతమన్నా అంతే ఇష్టం. అయితే నాలో దాగున్న ఈ సంగీత ప్రతిభను గుర్తించింది మాత్రం మా బామ్మే. తనే నాకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించి ఆరితేరేలా చేసింది. ఇక పాశ్చాత్య సంగీతానికి సంబంధించిన మెలకువల్ని మాత్రం ఆన్‌లైన్‌ వీడియోలు చూసి నేనే సొంతంగా నేర్చుకున్నా..’ అంటోంది శ్రేయ. 18 ఏళ్ల వయసులోనే విభిన్న నృత్య, గాత్ర మెలకువల్ని అవపోసన పట్టిన ఈ చిన్నది.. ఇప్పటికే కొన్ని కొరియన్‌ పాప్‌ పాటలకు సంబంధించిన కవర్‌ సాంగ్స్‌ కూడా చేసింది. అంతేకాదు.. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ మరింతమంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఏకంగా ఏనుగు కుంభస్థలాన్నే కొట్టినట్లుగా.. ప్రతిష్టాత్మక బ్లాక్‌స్వాన్‌లో చోటు దక్కించుకోవడంతో తన ప్రతిభను మరింత నిరూపించుకునే సువర్ణావకాశం దొరికిందంటోందీ యువ పాప్‌ స్టార్.

కంగ్రాట్స్‌ శ్రేయ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి