ఫేస్ వ్యాక్సింగ్.. సహజమే మంచిది!
అవాంఛిత రోమాలు మహిళల అందాన్ని దెబ్బతీస్తుంటాయి. ముఖ్యంగా పైపెదవి, గడ్డం, కొంతమందికి బుగ్గల పైనా ఇవి పెరుగుతుంటాయి. ఈ అసౌకర్యాన్ని దూరం చేసుకోవడానికి చాలామంది వ్యాక్సింగ్ పద్ధతిని ఆశ్రయిస్తుంటారు.
అవాంఛిత రోమాలు మహిళల అందాన్ని దెబ్బతీస్తుంటాయి. ముఖ్యంగా పైపెదవి, గడ్డం, కొంతమందికి బుగ్గల పైనా ఇవి పెరుగుతుంటాయి. ఈ అసౌకర్యాన్ని దూరం చేసుకోవడానికి చాలామంది వ్యాక్సింగ్ పద్ధతిని ఆశ్రయిస్తుంటారు. అయితే ముఖంపై వ్యాక్సింగ్ చేయడం వల్ల పలు దుష్ప్రభావాలు ఎదురవుతాయంటున్నారు నిపుణులు. అందుకే సహజసిద్ధమైన పద్ధతుల్లోనే ముఖంపై అవాంఛిత రోమాల్ని తొలగించుకోవడం మేలంటున్నారు.
దుష్ప్రభావాలు..
⚛ ఫేస్ వ్యాక్సింగ్ వల్ల కొంతమందిలో ముఖంపై దద్దుర్లు, ఎరుపెక్కడం, వాపు.. వంటి సమస్యలొస్తాయి.
⚛ వ్యాక్సింగ్‌లో భాగంగా.. స్ట్రిప్‌ని వ్యతిరేక దిశలో లాగినప్పుడు.. వెంట్రుకల మూలాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల వెంట్రుకలు లోపలికి మొలవడం ప్రారంభమవుతుంది. ఫలితంగా ఆ ప్రదేశంలో గడ్డల్లాగా ఏర్పడుతుంటాయి. కొంతమందిలో ఇది మృతచర్మానికి దారితీసే అవకాశాలూ లేకపోలేదు.
⚛ వ్యాక్సింగ్ ప్రక్రియ అన్ని చర్మతత్వాల వారికీ సరిపడకపోవచ్చు.. అలాగే ఆయా స్ట్రిప్స్ తయారీలో వాడిన రసాయనాలూ పడకపోవచ్చు. ఈ క్రమంలో అలర్జీ, దురద.. వంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయి. ఇది ముఖమంతా వ్యాపించి లేనిపోని సమస్యల్ని తెచ్చిపెడుతుంది.
⚛ ఎపిడెర్మిస్ అనేది చర్మపు పైపొర. ఇది అన్ని దుష్ప్రభావాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. అయితే కొంతమందిలో ఫేస్ వ్యాక్సింగ్ చేసుకున్నప్పుడు ఇది వెంట్రుకలతో పాటే తొలగిపోతుంటుంది. దీనివల్ల చర్మం మరింత సున్నితంగా తయారవుతుంది. ఎలా చూసినా చర్మ ఆరోగ్యానికి ఇది మంచిది కాదంటున్నారు నిపుణులు.
⚛ అరుదే అయినా.. ఫేస్ వ్యాక్సింగ్ వల్ల ఒక్కోసారి ఆ భాగంలో నల్లమచ్చలు ఏర్పడే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇందుకు ఎండ ప్రభావం, ఇన్ఫెక్షన్.. వంటివి కారణం కావచ్చంటున్నారు.
సహజమే మంచిది!
ఫేస్ వ్యాక్సింగ్ వల్ల కోరి సమస్యలు కొని తెచ్చుకోవడం కంటే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలతో ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. వీటితో నొప్పి తెలియకుండానే శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఎక్కువంటున్నారు.
⚛ రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున చక్కెర, నిమ్మరసానికి.. పది టేబుల్‌స్పూన్ల నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇది కాస్త చిక్కపడే దాకా మరిగించుకొని చల్లార్చుకోవాలి. సమస్య ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకొని.. అరగంటయ్యాక గుండ్రంగా రుద్దుతూ తొలగించుకోవాలి.
⚛ రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున చక్కెర, నిమ్మరసం తీసుకొని.. దానికి టేబుల్‌స్పూన్ తేనె కలుపుకోవాలి. దీన్ని ఐదు నిమిషాల పాటు వేడి చేస్తే చిక్కబడుతుంది. ముందు వెంట్రుకలు ఉన్న చోట కార్న్‌స్టార్చ్ అప్లై చేసుకొని.. చల్లారిన చక్కెర మిశ్రమాన్ని వెంట్రుకలు మొలిచే దిశలో అప్లై చేసుకోవాలి. అరగంటయ్యాక ఒక కాటన్ క్లాత్ సహాయంతో గుండ్రంగా రుద్దుతూ తొలగించుకోవాలి.
⚛ బాగా పండిన అరటిపండును రెండు టేబుల్‌స్పూన్ల ఓట్‌మీల్‌తో కలిపి పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట అప్లై చేసి.. పదిహేను నిమిషాల పాటు మర్దన చేయాలి. ఆపై చల్లటి నీటితో ముఖం కడిగేసుకోవాలి.
⚛ టేబుల్‌స్పూన్ చొప్పున తేనె, నిమ్మరసం తీసుకొని.. దానికి ఐదు టేబుల్‌స్పూన్ల బంగాళాదుంప రసం కలుపుకోవాలి. మరోవైపు రాత్రంతా నానబెట్టిన శెనగపప్పును పేస్ట్ చేసుకోవాలి. వీటన్నింటినీ కలుపుకొని సమస్య ఉన్న చోట అప్లై చేసుకోవాలి. ఆరిన తరవాత చల్లటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది.
⚛ టేబుల్‌స్పూన్ చొప్పున కార్న్‌స్టార్చ్, చక్కెర తీసుకొని.. అందులో గుడ్డులోని తెల్లసొన కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట అప్లై చేసుకొని ఆరనివ్వాలి. తద్వారా ఇది ఒక పొర మాదిరిగా ఏర్పడుతుంది. ఆపై తొలగించుకుంటే సరిపోతుంది.
అయితే ఇన్ని చిట్కాలు పాటించినా సమస్య నుంచి విముక్తి పొందకపోయినా, ఈ క్రమంలో ఇతర దుష్ప్రభావాలేమైనా ఎదురైనా.. ఆలస్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.