నిద్ర మాత్రలు వాడుతున్నారా?

రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోయినా, ఏవైనా ఒత్తిళ్లతో సతమతమైపోతున్నా.. వెంటనే గుర్తొచ్చేది నిద్రమాత్ర. చాలామంది నిద్ర కోసం ఈ పద్ధతినే ఫాలో అవుతుంటారు. తరచూ ఇవి వాడటం వల్ల అదే అలవాటుగా మారుతుంది. కానీ ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. నిద్రమాత్రలు తరచూ మింగడం....

Published : 24 Apr 2022 13:16 IST

రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోయినా, ఏవైనా ఒత్తిళ్లతో సతమతమైపోతున్నా.. వెంటనే గుర్తొచ్చేది నిద్రమాత్ర. చాలామంది నిద్ర కోసం ఈ పద్ధతినే ఫాలో అవుతుంటారు. తరచూ ఇవి వాడటం వల్ల అదే అలవాటుగా మారుతుంది. కానీ ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. నిద్రమాత్రలు తరచూ మింగడం వల్ల వివిధ రకాల దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

ఎలాంటి సమస్యలు?

నిద్రమాత్రలు ఎక్కువగా వేసుకోవడం వల్ల అరచేతులు, అరికాళ్లలో మంటలేర్పడటం, తలనొప్పి, గుండెలో మంట, కడుపునొప్పి, ఆకలి తగ్గిపోవడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, మైకంగా అనిపించడం, అలసట, బలహీనంగా అయిపోవడం.. మొదలైన సమస్యలు ఏర్పడతాయి.

అలాగే కొంతమందిలో నిద్రమాత్రలు వేసుకోవడం వల్ల అలర్జీ సంబంధిత చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో నిద్రమాత్రలు మానేసి వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మేలు. అదేవిధంగా వాంతులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, కళ్లు మసకగా కనిపించడం, దురద, ఛాతీలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం.. మొదలైన దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది.

వివరంగా చెప్పండి..

ఏదైనా అలవాటైతే మానడం చాలా కష్టం. అలాగే ఒక్కసారి నిద్రమాత్రలు వేసుకోవడం మొదలు పెట్టి.. చాలా కాలం కొనసాగించారంటే ఇక అంతే సంగతులు. ఆ అలవాటు మానడమూ అంతే కష్టం. కాబట్టి నిద్ర పట్టడం లేదని మాత్రలు వేసుకొని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకోవడం కంటే ఒక్కసారి మీకు ఎందుకు నిద్ర పట్టడం లేదో డాక్టర్‌కు వివరంగా చెబితే వారే చక్కటి సలహా సూచిస్తారు.

డాక్టర్ సలహా మేరకైనా..

కొంతమంది డాక్టర్ సలహా మేరకు నిద్ర మాత్రలు వాడుతుంటారు. కానీ ఇది దీర్ఘకాలంగా కొనసాగితే వాటికే అలవాటు పడే అవకాశం ఉంటుంది. అలాగే తరచూ వాడుతుంటే కొన్ని రోజులకు ఈ మాత్రల మోతాదు శరీరానికి సరిపోదు. ఇంకా ఎక్కువ డోస్ వేసుకుంటే గానీ నిద్రపట్టదు. నిద్రలో ఉన్నప్పుడు శ్వాస ప్రక్రియలో భాగంగా ఒత్తిడి ఏర్పడి కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి డాక్టర్ సలహా మేరకే నిద్ర మాత్రలు వాడినా వారు చెప్పిన జాగ్రత్తలు పాటించడం మర్చిపోవద్దు.

ఇవి గుర్తుంచుకోండి..

* గర్భం దాల్చిన తర్వాత కొంతమందికి నిద్ర పట్టదు. ఇలాంటి సమయాల్లో నిద్రమాత్రలు వేసుకోవడం అస్సలు మంచిది కాదు.

* బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా వేసుకోకూడదు.

* అలాగే నిద్రమాత్రలు వేసుకున్న తర్వాత డ్రైవింగ్ చేయకూడదు.

* ఏ పానీయంలోనైనా నిద్ర మాత్రల్ని కలుపుకొని తాగకూడదు.

ప్రతి చిన్న విషయానికీ, పెద్ద విషయానికీ నిద్ర మాత్రలు వేసుకోకుండా, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే.. అదీ డాక్టర్ సలహా మేరకు మాత్రమే నిద్ర మాత్రలు వాడాలి.. అంతేకానీ మీ ఇష్టం వచ్చినట్లు వాడితే మీ ఆరోగ్యానికి మీరే హాని చేసుకున్నట్లవుతుంది అంటున్నారు నిపుణులు.  తస్మాత్ జాగ్రత్త!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్