Updated : 04/03/2023 20:20 IST

వైద్య పరికరాలు ఆన్‌లైన్‌లో డెలివరీ చేస్తోంది!

ఆరోగ్య పరీక్షల కోసం లేదంటే ఇతర అనారోగ్యాల రీత్యా మనం ఆస్పత్రికి వెళ్లినప్పుడు.. అక్కడ ఆయా పరీక్షలకు సంబంధించిన వైద్య పరికరాలు ఉండకపోవచ్చు.. ఒకవేళ ఉన్నా అవి పనిచేయకపోవచ్చు.. ఒక్కోసారి వాటి సర్వీస్‌, మెయింటెనెన్స్‌ డాక్టర్లకు తలనొప్పిగా మారే అవకాశమూ లేకపోలేదు. క్షేత్రస్థాయిలో వైద్యులు పడే ఇలాంటి సమస్యల్నే అర్థం చేసుకుంది హైదరాబాద్‌కు చెందిన వైష్ణవీ రెడ్డి. ఈ క్రమంలోనే ‘సిగ్నెల్‌ బయోమెడికల్‌’ పేరుతో ఓ వెబ్‌-యాప్‌కు రూపకల్పన చేసిన ఆమె.. ఈ వేదికగా వైద్య పరికరాల్ని ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. అంతేకాదు.. వాటిలో తలెత్తే సమస్యలకూ పరిష్కారం చూపుతూ ‘బయో మెడికల్‌ పరికరాలకు వన్స్టాప్‌ సొల్యూషన్‌’గా నిలుస్తోన్న తన స్టార్టప్‌ జర్నీ గురించి ‘వసుంధర.నెట్‌’తో ప్రత్యేకంగా పంచుకున్నారు వైష్ణవి.

మాది హైదరాబాద్‌. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ‘EEE’ విభాగంలో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన నేను.. జర్మనీలో ‘మెడికల్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌’ విభాగంలో మాస్టర్స్‌ పూర్తిచేశాను. ఆపై వైద్య రంగానికి చెందిన పలు సంస్థలు, స్టార్టప్స్‌లో ‘మెషీన్‌ లెర్నింగ్ కన్సల్టెంట్’గా, ‘సీటీఓ’గా కొన్నేళ్ల పాటు పనిచేశాను. ఈక్రమంలోనే కొంతమంది డాక్టర్లు తమ క్లినిక్స్‌/ఆస్పత్రుల కోసం.. సంబంధిత వైద్య పరికరాల కొనుగోలు, వాటి సర్వీస్‌-మెయింటెనెన్స్‌.. వంటి విషయాల్లో ఇబ్బందులు పడడం గమనించాను. ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నా. ఈ ఆలోచనతోనే ఉద్యోగం వదిలి వ్యాపారం ప్రారంభించే దిశగా అడుగులు వేశాను.

డిజిటల్ పరిష్కారం చూపాలని..!

ఇలా ఆలోచిస్తున్న క్రమంలోనే నా మనసులో ఓ ఆలోచన తట్టింది. వివిధ వైద్య పరికరాలను ఆన్‌లైన్‌లో నే ఆర్డరిచ్చి కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తే బాగుంటుందనిపించింది. ఇదే 2021లో ‘సిగ్నెల్‌ బయోమెడికల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థకు తెరతీసింది. ఇందులో భాగంగా ఓ వెబ్‌సైట్‌ను, యాప్‌ను రూపొందించాం. ఈ క్రమంలో డాక్టర్లకు కావాల్సిన వైద్య పరికరాలేంటో ముందుగా కనుక్కుంటాం. వాటి గురించి సంబంధిత తయారీదారు, పంపిణీదారుతో చర్చలు జరిపి.. అంతిమంగా నాణ్యమైన పరికరాల్ని, అందుబాటు ధరల్లో వైద్యులకు ఆన్‌లైన్‌లో విక్రయించడమే మా డిజిటల్‌ వేదిక ముఖ్యోద్దేశం. అక్కడితో చేతులు దులిపేసుకోకుండా.. ఆయా పరికరాల్లో ఏవైనా సమస్యలు తలెత్తినా పరిష్కరించడం, వాటి మెయింటెనెన్స్‌ను పర్యవేక్షించడం మా ప్రత్యేకత! ఇందుకోసం మా వద్ద ప్రత్యేకమైన నిపుణుల బృందం కూడా ఉంది. అయితే ఈ సేవల్ని మరింత ఆధునికీకరించడానికి కృత్రిమ మేధతో ప్రస్తుతం ఓ టూల్‌ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. తద్వారా వైద్య పరికరాల కొనుగోలు దగ్గర్నుంచి వాటి మెయింటెనెన్స్‌ వరకు ప్రతి దశలో అయ్యే అధిక ఖర్చును నియంత్రించచ్చు.

1500లకు పైగా..!

వైద్యులు, వారి ఆస్పత్రి అవసరాల్ని బట్టి మా వద్ద అన్ని రకాల వైద్య పరికరాలు లభిస్తాయి. సిరంజి, థర్మామీటర్‌, స్టెతస్కోప్‌.. వంటి చిన్న చిన్న వైద్య పరికరాల దగ్గర్నుంచి యూరాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఈఎన్‌టీ, ఆఫ్తల్మాలజీ, జనరల్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్‌.. ఇలా వేర్వేరు వైద్య విభాగాలకు సంబంధించిన అన్ని రకాల వైద్య పరికరాలు మా వద్ద లభిస్తాయి. అలాగే దంత వైద్యానికి సంబంధించిన ఉత్పత్తులు, ల్యాబ్స్‌లో ఉపయోగించే డిస్పోజబుల్స్, ఆస్పత్రి పరిశుభ్రత కోసం వాడే ఉత్పత్తులు, ఆస్పత్రి బెడ్స్‌.. కూడా అందుబాటు ధరల్లో ఆయా ఆస్పత్రులకు డెలివరీ చేస్తున్నాం. ఇలా మొత్తంగా 1500 లకు పైగా తిరిగి ఉపయోగించే వైద్య పరికరాలు/వస్తువులు, వాడి పడేసే వస్తువుల్ని సరఫరా చేస్తున్నాం. తద్వారా కొత్తగా మెడికల్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించే వారి దగ్గర్నుంచి తమ ఆస్పత్రుల అవసరాలకు కావాల్సిన వస్తువులన్నీ వైద్యులు ఒకే చోట పొందేందుకు వీలుగా మా వెబ్‌-యాప్‌ను అభివృద్ధి చేశాం.

భవిష్యత్తులో ఇలా!

వైద్య పరికరాల్లో తలెత్తే సమస్యల్ని పరిష్కరించడానికి ప్రస్తుతం మా వద్ద ప్రత్యేకమైన బయోమెడికల్‌ సర్వీస్‌ టీమ్‌ సిద్ధమవుతోంది. అంతేకాదు.. సర్వీస్‌ టెక్నీషియన్‌ను బుక్‌ చేసుకోవడానికి యాప్‌లో మరో సదుపాయాన్నీ తీసుకురాబోతున్నాం. అలాగే మేం సరఫరా చేసిన వైద్య పరికరాల పనితీరును ట్రాక్‌ చేసే వ్యవస్థనూ భవిష్యత్తులో అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంది. ఇక వ్యాపారాభివృద్ధిలో వీహబ్‌ అందించిన మెంటర్‌షిప్‌ మెలకువలు, తోటి మహిళల బిజినెస్‌ టిప్స్‌ నాకు మరింతగా ఉపయోగపడ్డాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన Startup India Seed Fund Scheme (SISFS) పథకం నుంచీ మాకు నిధులు అందుతున్నాయి.

వివక్ష కాదు.. మద్దతు కావాలి!

ఇప్పటికీ మన దేశంలో చాలాచోట్ల అమ్మాయిలను కెరీర్ కంటే వ్యక్తిగత జీవితానికే పరిమితం చేయాలని చూస్తారు. పెళ్లి, పిల్లలు, ఇతర కుటుంబ బాధ్యతలు.. ఇవే వారి లక్ష్యాలన్నట్లుగా చెబుతారు. ఒక దశలో నాకూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. కానీ నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను అనుకున్న రంగంలో రాణించగలుగుతున్నా. ప్రతి మహిళకు ఇంటి నుంచి ఇలాంటి మద్దతే అందాలి. ఇక వినియోగదారుల సమస్యల్ని అర్థం చేసుకొని.. వారి వైపు నుంచి పరిష్కార మార్గాలు వెతికితే వాళ్లకు నాణ్యమైన సేవలు అందించినవారమవుతాం.. అదే సమయంలో వ్యాపారంలోనూ రాణించగలుగుతాం. ప్రస్తుతం నేను పాటిస్తోన్న వ్యాపార సూత్రమిదే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని