Published : 25/07/2021 15:14 IST

ఆషాఢంలో ఇవి తప్పనిసరి..

ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు.. మహిళలందరికీ పండగే. చక్కగా గోరింటాకు పెట్టుకుని మందారంలా పండిన చేతుల్ని చూసుకుంటూ మురిసిపోతుంటారు. 'నీ కంటే నాకే గోరింటాకు ఎర్రగా పండింది..' అని చిన్న పిల్లలు తమ స్నేహితురాళ్ల దగ్గర గొప్పలు పోతూ ఉంటారు. గోరింటాకు ఒక్కటే కాదు.. నేరేడు, మునగాకు, గుగ్గిళ్లు... ఇలా ఆషాఢంలో కచ్చితంగా తీసుకోవాల్సిన పదార్థాలు కొన్ని ఉన్నాయి. మరి, వీటి వెనుక ఉన్న సంప్రదాయ, శాస్త్రీయ కారణాలను తెలుసుకుందామా..

సౌభాగ్యానికి ప్రతీక..

‘గోరింటా పూసింది కొమ్మా లేకుండా.. మురిపాలా అరచేత మొగ్గా తొడిగింది..' అంటూ గోరింటాకు అందాల్ని ఓ సినీకవి పొగిడాడు. నిజమే ఎర్రగా.. ముద్దమందారంలాగా పండిన అరచేతుల్ని చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. ఆషాఢం వచ్చిందంటే చాలు మహిళలంతా చేతులకు గోరింటాకు పెట్టుకొని మరీ మురిసిపోతారు. గోరింటాకుని సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు. అందుకే పెళ్లయినవారు గోరింటాకు పెట్టుకుంటే కలకాలం సౌభాగ్యం నిలిచి ఉంటుందని.. పెళ్లికాని వారు పెట్టుకుంటే మంచి భర్త వస్తాడని నమ్ముతూ ఉంటారు. దీనికి శాస్త్రీయమైన కారణం కూడా లేకపోలేదు. గ్రీష్మం పూర్త్తె వర్ష రుతువులోకి ప్రవేశించే సమయంలో ఆషాఢం వస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. అప్పటి వరకు గ్రీష్మతాపానికి గురైన శరీరం ఒక్కసారిగా వర్షాలకు చల్లబడిపోతుంది. ఫలితంగా వ్యాధులు విజృంభించే అవకాశం ఉంటుంది. గోరింటాకు ఈ సమయంలోనే చిగురు తొడుగుతుంది. అంతేకాదు అది ఈ కాలంలో విజృంభించే వ్యాధులను కూడా అరికడుతుంది. చర్మవ్యాధులను రాకుండా చేస్తుంది. అందుకే ఆషాఢంలో తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు.

సత్తువ పెరిగేందుకు..

ఆషాఢంలో కచ్చితంగా తినాల్సిన పదార్థాల జాబితాలో మునగాకు కూడా ఉంది. మునగాకును పప్పు, నువ్వుల పిండితో కలిపి వండి నువ్వుల నూనెతో తాలింపు వేసి తీసుకుంటూ ఉంటారు చాలామంది. దీని వెనుకా శాస్త్రీయ కారణం లేకపోలేదు.  దీనిలో శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, ఆమ్లాలు, బీటాకెరోటిన్, ఐరన్, సల్ఫర్, విటమిన్ 'ఎ', 'సి' లాంటివి పుష్కలంగా దొరుకుతాయి. దీనిలో ఉన్న పోషకాలు ఎముకలు దృఢంగా తయారవ్వడానికి ఉపయోగపడటంతో పాటు.. ముఖ వర్ఛస్సు పెరిగేలా చేస్తాయి. అలాగే కంటి చూపును మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి. అందుకే ఈ కాలంలో శరీరానికి సత్తువనిచ్చే మునగాకును తినాలంటారు.

జీర్ణవ్యవస్థ శుభ్రంగా..

నేరేడు పళ్లు ఆషాఢంలో మాత్రమే కాపుకి వస్తాయి. అందుకే ఈ సమయంలో వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. వాటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్నాయి. మనకి తెలియకుండానే కొన్ని వెంట్రుకలు, ఇతర చెడు పదార్థాలు మన కడుపులో చేరతాయి. నేరేడుపండు వాటన్నింటిని విచ్ఛిన్నం చేసి బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది. అలాగే రుతువుల పరంగా వచ్చే వ్యాధులను సైతం రాకుండా చేస్తుంది. అందుకే ఆషాఢంలో ఒక్క నేరేడు పండైనా తినాలి అని పెద్దలు అంటూ ఉంటారు.

సీజనల్ వ్యాధులు రాకుండా..

ఆషాఢంతోనే వర్షాకాలం మొదలవుతుంది. ఈ సమయంలో కురిసే అధిక వర్షాల వల్ల వాతావరణ, శరీర ఉష్ణోగ్రతల్లో మార్పు వస్తుంది. ఫలితంగా రకరకాల వ్యాధులకు గురవుతూ ఉంటాం. ఇవి మనపై ప్రభావం చూపించకుండా ఉండటానికే గుగ్గిళ్లలో సరిపడినంత ఉప్పు వేసి నీటిలో ఉడకబెట్టి తింటూ ఉంటారు. అలాగే ఈ కాలంలో నీరు కలుషితమవడం వల్ల కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. గుగ్గిళ్లను తినడం వల్ల కామెర్లు రాకుండా చూసుకోవచ్చు. అందుకే కామెర్ల బారిన ఎవరైనా పడితే వారిచేత గుగ్గిళ్లు ఉడకబెట్టిన నీరు తాగిస్తూ ఉంటారు పెద్దలు. ఇలా చేస్తే త్వరగా కామెర్లు తగ్గిపోతాయని చెబుతుంటారు. అలాగే కొన్ని రకాల చర్మవ్యాధులను రాకుండా కూడా అడ్డుకుంటుంది. అందుకే ఆషాఢంలో కచ్చితంగా గుగ్గిళ్లను తినాలని పెద్దలు చెబుతూ ఉంటారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి