అప్పులు చేయకపోతేనే ‘అక్షయ’మయ్యే ఆనందం!

సిరిసంపదలతో పాటు అక్షయమైన సంతోషాన్ని, పుణ్యాన్ని అందించే పర్వదినమే అక్షయ తృతీయ.. ఈ రోజు వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా బంగారం మీద డిస్కౌంట్ల ఆఫర్లే.. ఏ నగల షాపులో చూసినా బంగారం....

Updated : 22 Apr 2023 15:47 IST

సిరిసంపదలతో పాటు అక్షయమైన సంతోషాన్ని, పుణ్యాన్ని అందించే పర్వదినమే అక్షయ తృతీయ.. ఈ రోజు వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా బంగారం మీద డిస్కౌంట్ల ఆఫర్లే.. ఏ నగల షాపులో చూసినా బంగారం కొంటున్న మహిళలే! ఇంతకీ అక్షయ తృతీయ రోజు తప్పకుండా బంగారం ఎందుకు కొనాలంటారో మీకు తెలుసా? అసలు ఈ రోజు ప్రత్యేకత ఏంటి? తెలుసుకుందాం రండి...

అక్షయం అంటే నాశనం కానిది. దినదినాభివృద్ధి చెందేది అని అర్థం.. వైశాఖ మాసం శుక్లపక్షంలోని మూడో రోజు (వైశాఖ శుద్ధ తదియ)ను అక్షయ తృతీయగా పిలుస్తారు.. పురాణ గాథల ప్రకారం అక్షయ తృతీయ ఎంతో విశిష్టమైనది.

ఈ రోజునే త్రేతా యుగం ప్రారంభమైందట. పార్వతీ దేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది కూడా ఇదే రోజని ఓ అభిప్రాయం. అలాగే వేదవ్యాసుడు మహాభారత రచనను ఆరంభించింది కూడా ఇదే రోజునట. అంతేకాదు.. ధర్మరాజుకు అక్షయపాత్ర దొరికింది కూడా ఈ రోజేనట. ఇదేవిధంగా- సంపదలకు అధిపతి అయిన కుబేరుడుకి అక్షయ తృతీయ నాడే లక్ష్మీ అనుగ్రహం సిద్ధించిందట. అలాగే గంగానది ఆ పరమేశ్వరుని జటాజూటం నుంచి భువి పైకి అవతరించిన పవిత్ర దినం కూడా ఇదేనని పురాణాలు చెబుతున్నాయి.  శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా ఆవిర్భవించిన రోజు కూడా ఇదేనట. అందుకే ఈ రోజు ఏం చేసినా అది అక్షయంగా ఉండిపోతుందని అందరి నమ్మకం. అందరూ తమ సంపద పెరగాలంటూ కొనుగోళ్లకు ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తూ ఉంటారు. ప్రత్యేకించి అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే సంపదలు అక్షయంగా పెరుగుతూనే ఉంటాయని చాలామంది నమ్ముతారు. అందుకే ఆ రోజు బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు.

లక్ష్మీ కటాక్షం కోసం...!

శ్రీమహాలక్ష్మీ అమ్మవారు సకల సిరిసంపదలను ప్రసాదించే దేవత. ఆ అమ్మ అనుగ్రహం ఉంటే చాలు.. జీవితంలో ఏ లోటూ ఉండదని పలువురి నమ్మకం. ఈ క్రమంలో- లక్ష్మీదేవి కరుణా కటాక్షాల కోసం అక్షయ తృతీయ నాడు ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.

ఈ రోజున అక్షయ తృతీయ వ్రతం చేసి లక్ష్మీదేవికి అటుకుల పాయసం నైవేద్యంగా పెట్టడం మంచిదని పురాణాలు చెబుతున్నాయి. పూజ తర్వాత ఆర్థిక స్థితిని బట్టి వీలైనంత మందికి అన్నదానం చేస్తే మంచిది. ఈ పూజ వల్ల లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ మన మీద ఉంటుందట.

పుణ్యకార్యాలూ చేయాలి!

అక్షయ తృతీయ రోజు కేవలం సంపదలు మాత్రమే కాదు.. ఈ రోజు ఏ పని చేసినా అది అక్షయమవుతుందట. అందుకే కేవలం బంగారం, వెండి లాంటివి కొనడం మాత్రమే కాదు.. చాలామంది పుణ్యకార్యాలనూ చేస్తూ ఉంటారు. ఈ రోజు వచ్చిన పుణ్యం కూడా అక్షయంగా పెరుగుతూ పోతుందట. దానధర్మాలు చేయడం, పూజలు, వ్రతాలు చేయడం వంటివి చేస్తుంటారు. భక్తితో చేసే వ్రతమైనా, పూజైనా, హోమమైనా.. ఆ ఫలం కూడా పెరుగుతూ పోతుందట.

అప్పు చేసి వద్దు!

అక్షయ తృతీయ.. మంచి రోజు.. ఏది కొన్నా అక్షయమవుతుందని చెప్పి అప్పులు చేసి మరీ బంగారం కొంటుంటారు కొంతమంది. కానీ అప్పు చేసి కొంటే రుణాలు అక్షయమయ్యే ప్రమాదం ఉంటుందని మాత్రం గుర్తుంచుకోవాలి. అందుకే బంగారం కొనకపోయినా ఫర్వాలేదు. ఉన్నంతలో ఈ రోజున నలుగురికి సాయపడితే.. అంతకు మించిన  పుణ్యం మరొకటి ఉండదు!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని