బోనాల పండగ: ఉప్పొంగే ఉత్సాహం.. విలువైన మహోత్సవం!

తీన్‌మార్ నృత్యాలు.. పోతురాజుల వీరంగం... శివసత్తుల పూనకాలు.. పులిరాజుల సందడి.. అమ్మవారికి కుంకుమార్చనలు.. బోనం సమర్పణలు.. వెరసి తెలంగాణ సంస్కృతికి మకుటాయమానంగా నిలిచిన పలు సంబరాల కలయిక 'బోనాల పండగ'. విశిష్ట చరిత్ర కలిగిన ఈ మహత్తరమైన వేడుక జానపదుల...

Published : 17 Jul 2022 07:20 IST

తీన్‌మార్ నృత్యాలు.. పోతురాజుల వీరంగం... శివసత్తుల పూనకాలు.. పులిరాజుల సందడి.. అమ్మవారికి కుంకుమార్చనలు.. బోనం సమర్పణలు.. వెరసి తెలంగాణ సంస్కృతికి మకుటాయమానంగా నిలిచిన పలు సంబరాల కలయిక 'బోనాల పండగ'. విశిష్ట చరిత్ర కలిగిన ఈ మహత్తరమైన వేడుక జానపదుల జీవనశైలికి ప్రతీక. తెలంగాణ రాష్ట్ర పండగగా 'బోనాల పండగ' విశేష ప్రాముఖ్యం సంతరించుకుంది.

బోనాలంటే..

బోనం అంటే 'భోజనం' అని అర్థం. ఇది అమ్మవారికి నైవేద్య రూపంలో సమర్పించే భోజనం. మట్టికుండల్లో, రాగికుండల్లో అన్నంతో పాటు కొన్ని సందర్భాల్లో పాలు, బెల్లాన్ని కూడా అమ్మవారికి బోనాల రూపంలో సమర్పిస్తారు. మహిళలు వేపరెమ్మలతో, పసుపు కుంకుమలతో బోనాల కుండలను అలంకరిస్తారు. అలాగే, చిన్న ముంతలో పానకం తయారు చేస్తారు. వూరపండగ, వూరడ, పెద్దపండగ అనే వివిధ పేర్లతో గ్రామీణులు పిలుచుకొనే ఈ పండగలో అమ్మవారి రథానికి గొర్రెపోతులను కట్టి తీసుకెళ్లడం ప్రధాన ఆకర్షణ. అదే విధంగా తొట్టెలు తీసుకెళ్లడం కూడా ఈ పండగ సంప్రదాయంలో ఒక భాగం.

గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు...

బోనాల పండగ కేవలం ఒక దేవతకే పరిమితమైంది కాదు. తెలంగాణ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు గ్రామ దేవతలందరికీ ఈ పండగ నెలవే. ఇక హైదరాబాద్‌లో చూసుకుంటే గోల్కొండ ఖిల్లాలోని జగదాంబిక, బల్కంపేటలోని ఎల్లమ్మ తల్లి, సికింద్రాబాద్‌లో ఉజ్జయినీ మహంకాళి, లాల్‌దర్వాజ మాతేశ్వరి, శాలిబండ ముత్యాలమ్మ, గండిపేట మైసమ్మలతో పాటు పోచమ్మ, మారెమ్మ, పోలేరమ్మ తదితర దేవతలందరూ కూడా బోనాల వేళ సకల పూజలందుకుంటూ, భక్తులు కుంకుమార్చనలు చేసే వేళ ఒక దివ్య తేజస్సుతో వెలిగిపోతుంటారు.

గ్రామ రక్షణ కోసం..

జనులు కొలిచే ఏడుగురు ప్రధాన గ్రామదేవతలకు తమ్ముడే పోతురాజని, గ్రామాలకు రక్షకుడని భక్తుల అభిప్రాయం. బోనాలప్పుడు పోతురాజు వేషం వేసేవారు చేసే వీరంగం అంతా ఇంతా కాదు. తొట్టెలు వూరేగిస్తున్నప్పుడు పోతురాజులు చాలా విచిత్రమైన రీతిలో విన్యాసాలు చేస్తుంటారు. కాలికి గజ్జెలు ధరిస్తారు. ఒళ్లంతా పసుపు పూసుకుని కొరడాతో బాదుకుంటూ తాండవం చేస్తుంటారు. వీరికి ఈ రోజు ప్రత్యేకం. వీరిలో సాక్షాత్తూ ఆ పోతురాజు అంశే ఉంటుందని, దేవతలు వీరిపై పూనుతారని భక్తులు నమ్ముతుంటారు.

'బోనం జ్యోతి' అంటే...

బోనం వండే కొత్త మట్టి కుండకు సున్నం వేసి, పసుపు రాసి, కుంకుమ దిద్ది, దాని మీద కంచుడులో నూనె వేసి దీపం వెలిగిస్తారు. ఇదే 'బోనం జ్యోతి'. మహిళలు ఈ కుండను జాగ్రత్తగా ఎత్తుకొని తలపై పెట్టుకుంటారు. వీళ్లంతా నడివీధిలో వూరేగింపుగా వస్తున్నప్పుడు, పురుషులు వీళ్లపై నీడ పడేలా చేసేందుకు, తెల్లని బట్టను నలుగురూ నలువైపులా పట్టుకొని పైకప్పు మాదిరిగా పట్టుకుంటారు. దీన్ని 'ఉప్లూడ' అంటారు. వీరి వెనకాలే డప్పుమోతలతో, మేళతాళాలతో భక్తులు, యువకులు తీన్‌మార్ నృత్యాలు చేసుకుంటూ గుడిదాకా వస్తారు.

ఇతర విశేషాలు...

బోనాల పండగను ఆషాఢ మాసంలో ఆదివారం పూటే జరుపుకొంటారు.

బోనాలప్పుడు కొందరు భక్తురాళ్లకు పూనకం వస్తుందని అంటారు. పచ్చికుండ మీద ఎక్కి భవిష్యత్తు చెప్పే భక్తురాలిని అమ్మవారు ఆవహిస్తుందని నమ్ముతారు. ఆమె ద్వారా అమ్మవారు మాట్లాడుతుందని వారి భావన. అందుకే ఆమె మాట్లాడే మాటలను భక్తులంతా శ్రద్ధగా వింటారు. ఈ తంతునే 'రంగం' అంటారు.

రంగం ముగిశాక, అమ్మవారి రూపంలో అలంకరించిన రాగికలశాన్ని పూజారి వీధుల్లో వూరేగించుకుంటూ తీసుకొస్తారు. ఆ కలశాన్నే 'ఘటం' అంటారు.

ఊరేగింపు జరిగాక, అమ్మవారి ఆలయం ఉండే చోటు చేరగానే అంతకు ముందే శుభ్రం చేసి అలికి ముగ్గులు వేసిన చోట, బోనాలు దించుతారు.

అలాగే బోనాలప్పుడు భక్తులు కొలిచే దేవతలకు, వారి పేర్లకు కూడా ప్రాముఖ్యం ఉంది. మైసమ్మ అంటే పశువులను రక్షించే తల్లి అని, బాలమ్మ అంటే పిల్లలను బాలారిష్టాల నుంచి కాపాడే దేవత అని, ఎల్లమ్మ అంటే వూరి ఎల్లల (వూరి పొలిమేరలు) జోలికి వచ్చే దుష్టశక్తులను తరిమేసే తల్లి అని, పోచమ్మ అంటే మశూచి నుంచి కాపాడే శక్తి అని భక్తుల విశ్వాసం.

ఈ పండగప్పుడు దేవాలయాల దగ్గర పెద్ద కుంకుమబొట్టుతో, మెడలో రుద్రాక్షమాలలతో, పూసల దండలతో, చేతి నిండా గాజులతో, కాళ్లకు కడియాలతో, పసుపు పారాణితో, వేపమండలు ధరించే స్త్రీలు దైవస్తోత్రాలు చేస్తూ కనిపిస్తారు. సంవత్సరమంతా దాదాపు అమ్మవారి సేవలోనే గడిపే వీరిని 'శివసత్తు'లంటారు. బోనాల పండగప్పుడు వీరికి పూనకం వస్తుందని భక్తులు భావిస్తారు.

బోనాల పండగ తెలంగాణ ప్రాంతాల్లోనే కాకుండా, రాయలసీమలోని కొన్ని పల్లె ప్రాంతాల్లో కూడా ఆదరణకు నోచుకోవడం గమనార్హం.

తెలంగాణ సంస్కృతిలో బోనాలంటేనే ఓ కోలాహలం... ఉరకలెత్తించే ఓ ఉత్సాహం. సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను మర్చిపోకుండా నేటి తరానికి అందిస్తున్న విలువైన మహోత్సవం. 'అమ్మ బైలెల్లినాదో..తల్లి బైలెల్లినాదో' అని అమ్మవారిని స్తుతించుకుంటూ, సకల అరిష్టాల నుంచి దూరం చేయమని వేడుకుంటూ జనహృదయాలు భావోద్వేగంతో చేసుకొనే గొప్ప సంబరం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్