Updated : 18/11/2022 20:32 IST

Relationship: బంధం ప్రమాదకరంగా మారుతోందా?

ప్రేమికులు, దంపతుల మధ్యలో అప్పుడప్పుడూ గొడవలు, భేదాభిప్రాయాలు సహజం. అయితే ఇవి తరచూ జరుగుతున్నా, మీ భాగస్వామి కావాలనే మిమ్మల్ని టార్గెట్‌ చేసి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నా.. ఆ బంధం ప్రమాదకరంగా మారుతోందన్న విషయం గుర్తించమంటున్నారు నిపుణులు. భాగస్వామిలో కనిపించే కొన్ని లక్షణాలు, వారి ప్రవర్తన ఆధారంగా ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టవచ్చంటున్నారు. అవేంటంటే..!

⚛ భాగస్వామి మనకు తెలియకుండానే మనల్ని తప్పుదోవ పట్టిస్తుంటారు. ఈ క్రమంలో మనపై మనకు నమ్మకం కోల్పోయేలా చేస్తారు.. బలహీనులుగా మార్చుతారు. అన్ని రకాలుగా మనల్ని తమ అధీనంలోకి తెచ్చుకునే దాకా నిద్రపోరు. దీన్నే ‘గ్యాస్‌లైటింగ్‌’గా పేర్కొంటున్నారు నిపుణులు.

⚛ ప్రతి విషయంలోనూ అబద్ధాలు ఆడడం వేధించే భాగస్వామిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తుంటారు.

⚛ చిన్న విషయానికే చిరాకు పడడం, కోప్పడడం, అరవడం.. వంటివి వీరి ప్రవర్తనలో ఎక్కువగా గమనించచ్చు.

⚛ శారీరకంగా, మానసికంగానే కాదు.. భాగస్వామి భావోద్వేగాల పైనా దెబ్బకొడుతుంటారు. కాబట్టి భాగస్వామి మాటలు, చేతల్ని బట్టి వారి హింసాత్మక ధోరణిని పసిగట్టచ్చు.

⚛ మీపై అసూయాద్వేషాల్ని పెంచుకుంటారు. ఇలాంటి వాళ్లకు మీరు చేసే పనులు, మీరు మాట్లాడే మాటలు రుచించవు. మీది తప్పన్నట్లుగా, వారిదే కరక్ట్‌ అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. తద్వారా మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.

⚛ అనుబంధంలో ముందు మీతో బాగానే వ్యవహరిస్తారు.. మీపై ప్రేమ కురిపిస్తారు. కానీ రాన్రానూ మీపై ప్రేమ తగ్గిపోవడం, మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడం, మీ కాల్స్‌/సందేశాలకు స్పందించకపోవడం.. వంటివీ ప్రమాద సూచికలే అని అర్థం చేసుకోవాలి.

⚛ ఆరోగ్యకరమైన అనుబంధంలో అర్థం చేసుకోవడాలు, సర్దుకుపోవడాలు ఉంటాయి.. కానీ మిమ్మల్ని వేధించాలని చూసే భాగస్వామి ఏ విషయంలోనూ రాజీ పడరని, మీతో ఏకీభవించరని, వాళ్ల మాటే చెల్లుబాటయ్యేలా వ్యవహరిస్తారని అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు.

⚛ ఒక వ్యక్తితో బంధాన్ని ఏర్పరచుకునే ముందు.. వారికి ఫ్రెండ్స్‌ సర్కిల్‌ ఉందో, లేదో చూసుకోవడమూ కీలకమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే తనకు స్నేహితులు లేరంటే తన వ్యక్తిత్వం అంత మంచిది కాకపోవచ్చనడానికి ఓ సంకేతమని అనుమానించడంలోనూ తప్పు లేదంటున్నారు. ముందు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేసి కమిట్‌ అయినా.. ఆ తర్వాత జాగ్రత్తపడమంటున్నారు.

⚛ ‘అనుమానం పెనుభూతం!’ అంటారు. వేధించే భాగస్వామిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో మిమ్మల్ని అనుమానించడం, మీ ఫోన్‌ సంభాషణలు చాటుగా వినడం.. వంటివీ ఆమోదయోగ్యం కాని అంశాలే!

కాబట్టి ఇలాంటి లక్షణాలు మీ భాగస్వామిలో కనిపిస్తే.. రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది.

సహజీవనంపై మీ అభిప్రాయమేమిటి? ఇలాంటి అంశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

అమ్మాయిలూ జాగ్రత్త.. ప్రేమ ముసుగులో.. మేకవన్నె పులులెన్నో!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని